చీకటి పొత్తు..టీడీపీ చిత్తు
సాక్షి, ఏలూరు : భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగిన తెలుగుదేశం పార్టీ తెరవెనుక కాంగ్రెస్ పార్టీతోనూ అనైతిక పొత్తును కొనసాగిస్తోంది. పంచాయతీ, సొసైటీ, మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని నేరుగా ఢీకొనలేక టీడీపీ నాయకులు కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పం దాలు చేసుకున్న విషయం విదితమే. సార్వత్రిక ఎన్నికల్లో పైకి కాంగ్రెస్ పార్టీని తిడుతూ తెరవెనక మాత్రం తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలంటూ టీడీపీ మంత్రాంగాలు చేస్తోంది. వైఎస్సార్ సీపీని ఎదుర్కోలేక...
జిల్లాలో ఫ్యాన్ గాలిని ఎదుర్కోవడానికి టీడీపీ ఆ పసోపాలు పడుతోంది. తమకు జనాదరణ ఉందంటూ నిన్నమొన్నటి వరకూ లేని బలాన్ని ఉన్నట్లుగా గోబెల్స్ ప్రచారం చేయించింది. ఆ ప్రచారాల్ని ప్రజలు నమ్మకపోవడంతో కంగుతిన్న టీడీపీ నేతలు రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. అరుుతే, చివరకు జనం ముందు ఆ ఎత్తులన్నీ చిత్తవుతున్నాయి. గడచిన పంచాయతీ, సహకార ఎన్నికల్లో ఈ విషయం రుజువైంది కూడా. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దోస్తీ కట్టి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాయి. సహకార ఎన్నికల సమయంలో ఓటర్లను బెదిరించాయి. పంచాయతీ ఎన్నికల్లో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం సహకార ఎన్నికల్లో సీట్లు పంచుకున్నాయి.
ఇదే స్నేహాన్ని పరిషత్, మునిసిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించాయి. అప్పటికే సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. దీంతో కాంగ్రెస్ నేతలకు టీడీపీ వల వేసింది. ఆశలు కల్పించి పార్టీలో చేర్చుకుంది. వారిని వాడుకుని చివరకు వీధిలోకి విసిరేసింది. ఆ తరువాత బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీకి కేటాయించిన స్థానాల్లో టీడీపీ నాయకులతో నామినేషన్లు వేయించింది. వీటివల్ల కూడా లాభం లేదని తేలిపోవడంతో కొత్త ఎత్తులు వేస్తోంది. అయినా తన అవసరానికి ఎవరినైనా వాడుకుని విసిరేసే టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మిగిలి ఉన్న నేతలపై దృష్టి సారించింది. కాంగ్రెస్‌లో కాస్తోకూస్తో పేరున్న వారికి రవేస్తోంది. మీ వాళ్లకే టిక్కెట్టిచ్చాను గెలిపించుకోండంటూ ప్రలోభపెడుతోంది. బంధుత్వం పేరుతో కాంగ్రెస్ వారే టీడీపీకి అనుకూలంగా పలుచోట్ల ప్రచారం నిర్వహిస్తున్నారు.
నామమాత్రంగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారానికి వెళ్లినపుడు టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతుండటం చూసి జనం అవాక్కవుతున్నారు. అసలు టీడీపీ వాళ్లెవరు? బీజేపీ వాళ్లెవరు? కాంగ్రెస్ వాళ్లెవరు? అనేది తెలియక ప్రజలు తికమకపడుతున్నారు. దీనికితోడు జనసేన పార్టీ జెండాలను వాడుకుంటూ పవన్‌కల్యాణ్ అభిమానులు తమవైపే ఉన్నారన్నట్లు టీడీపీ నేతలు కల రింగ్ ఇస్తున్నారు. అరుుతే, పవన్ అభిమానులు మాత్రం తమ పార్టీ అధినేత మోడీకి మాత్రమే మద్దతు ప్రకటించారని, టీడీపీతో తమకెలాంటి సంబంధం లేదని తెగేసి చెబుతున్నారు. టీడీపీ నాయకులతో కలసి వెళితే పవన్ కల్యాణ్‌తోపాటు స్థానికంగా తమ పరువు కూడా గంగలో కలిసిపోతుందని వారు బహిరంగంగానే చెబుతున్నారు. కొందరు వ్యక్తులు పవన్ పేరు చెప్పుకుని పరువు తీస్తున్నారనే ఆవేదన ఆయన అభిమానుల్లో నెలకొంది.