టీడీపీ, బీజేపీలను చిత్తుగా ఓడించండి
ఏలూరు రూరల్, న్యూస్‌లైన్: సంక్షేమం, అభివృద్ధి పథకాల పునాదులపై రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. తోడు దొంగలై రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన బీజేపీ, టీడీపీలను చిత్తుగా ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఏలూరు మండలం లింగారావుగూడెం, మాదేపల్లిలో మైసూరారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమన్యాయం అంటూనే చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు సహకరించారని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలైన సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చిందని గుర్తుచేశారు. సంక్షేమ పథకాల అమలులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజన్న దారిలో నడుస్తారన్నారు. ఏలూరు ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ తొమ్మిదేళ్ల టీడీపీ రాక్షస పాలన పునరావృతం కానీయవద్దని ఓటర్లను కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాష్ట్ర భవిష్యత్‌కు పునాది వేయాలన్నారు. దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి, పీవీ రావు, పార్టీ నాయకులు ఊదరగొండి చంద్రమౌళి, చలమోలు అశోక్‌గౌడ్, కోసూరి సుబ్బారావు, సంజీవ్‌కుమార్ పాల్గొన్నారు.