మూడింట రెండొంతుల మున్సిపాలిటీల్లో ఆ పార్టీ జయకేతనం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ జరిగిన సరళిని బట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయనుందని ఎన్నికల విశ్లేషకులు అంచనావేశారు. సీమాంధ్రలో ఆదివారం ఎన్నికలు పూర్తయిన మొత్తం 92 మున్సిపాలిటీల్లో మూడింట రెండు వంతుల మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటుందని పోలింగ్ సరళిని పరిశీలించిన నిపుణులు లెక్కకట్టారు. అలాగే ఏడు కార్పొరేషన్లలో ఐదింటిలో ‘ఫ్యాన్’ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లోని 93 మున్సిపాల్టీలకు గాను హైకోర్టు ఉత్తర్వుల కారణంగా ఒక్క బనగానపల్లె మినహా 92 మున్సిపాల్టీలకు ఆదివారం పోలింగ్ జరిగింది. వీటితో పాటు అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి కార్పొరేషన్లకూ పోలింగ్ పూర్తయింది. ఈ పోలింగ్ సరళి, అందిన సమాచారాన్ని విశ్లేషించిన నిపుణులు చాలా మున్సిపాలిటీల్లో వైఎస్సార్ సీపీ మంచి మెజారిటీతో గెలుస్తున్నట్టు అంచనావేశారు. వారి అంచనాల ప్రకారం 92 మున్సిపాలిటీల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 56 మున్సిపాలిటీలు దక్కనున్నాయి. టీడీపీకి 16 స్థానాల్లో విజయావకాశాలున్నాయి. 14 స్థానాల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
ఈ మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి మెజారిటీ వస్తుందన్నది ఫలితాల వెల్లడి తరువాతే తేలనుంది. ఏడు చోట్ల ఏ పార్టీకీ మెజారిటీ రాని పరిస్థితి కనిపించింది. ఈ ఏడింటిలో చైర్మన్ పదవులు ఏ పార్టీకి దక్కనున్నాయో ఫలితాల వెల్లడి అనంతరం స్థానిక పరిస్థితులననుసరించి తేలుతుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మరో నాలుగు కార్పొరేషన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఎన్నికల నిపుణులు చెప్తున్నారు. ఇదిలావుంటే.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళి తమ పార్టీ నేతలు, శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయని వైఎస్సార్ సీపీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
పోలీసు దౌర్జన్యంపై ఫిర్యాదు చేస్తాం: కొణతాల
పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ సీమాంధ్రలో విజయఢంకా మోగించబోతోందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ ధీమా వ్యక్తంచేశారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ సరళిని బట్టి అన్ని చోట్లా తమ పార్టీ బాగా ముందంజలో ఉందని.. మెజారిటీ స్థానాలను తమ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై పోలీసు యంత్రాంగం దౌర్జన్యం చేసిందని.. కడప, రాజమండ్రి, ప్రకాశం జిల్లాల్లో తమ కార్యకర్తలను కొట్టారని.. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
మున్సిపోల్స్‌లోనూ ‘కుమ్మక్కు’ జులుం: వాసిరెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీ, కాంగ్రెస్ చేయి చేయి కలిపి పనిచేశాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్‌ను చూస్తే టీడీపీ, కాంగ్రెస్ భయపడిపోతున్నాయని.. అందుకే ఈ ఎన్నికల్లో యధేచ్ఛగా డబ్బు, మద్యం పంపిణీ చేశాయని విమర్శించారు.