
మన అమ్మాయో, అబ్బాయో ఆటల పోటీల్లో స్కూల్ ఫస్ట్ వస్తే ఏం చేస్తాం? భుజం తట్టి ప్రోత్సహిస్తాం. అదే.. మండల స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో కప్పు గెలుచుకుంటే..? మళ్లీ ఇదేం ప్రశ్న? అప్పుడు కూడా మెచ్చుకుంటాం. మరింతగా ఎంకరేజ్ చేస్తాం. ఇంకొంచెం ముందుకు వెళ్లి జాతీయ స్థాయిలో పేరు తెస్తే?అప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మన వెన్ను తట్టి అండగా నిలుస్తుంది. అవార్డులూ రివార్డులూ ప్రకటిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో అయితే..ఇక చెప్పేదేముంది? ప్రభుత్వమే పరమానందపడిపోయి ఇళ్ల స్థలాలూ, కార్లూ, ఉద్యోగాలూ ఇచ్చేస్తుంది. ఇది మన దేశంలో. మన దేశంలో అనేముంది? దాదాపుగా ఏ దేశమైనా ఇంతే. కానీ ఇరాన్‌లో మాత్రం అంతర్జాతీయ బాక్సింగ్‌లో కప్పు గెలుచుకున్న అమ్మాయిని మెచ్చి మెడలో హారం వేయలేదు కానీ, ఆగ్రహించి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఇదేం చిత్రం అంటారా? చిత్రం కాదు... వాస్తవం.మీరు కనుక ఇరానియన్ అయితే, ముందు మీరు స్త్రీనా, పురుషుడా అని చూస్తారు. తర్వాత మీరు ధరించిన దుస్తులేమిటో తేరిపార చూస్తారు. చూసి... తేడా వస్తే గనక అరెస్ట్ చేసేస్తారు. అక్కడేవో నిబంధనలు, నియమాలు ఉన్నాయి మరి. పాపం.. ఈ ఇరానియన్ బాక్సర్ సదరా ఖదేమ్ ఫ్రాన్స్‌తో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో అన్నే చౌవీన్ అనే తన ప్రత్యర్థిపై గెలిచింది. అందుకు ప్రతిఫలంగా ఆమెకు దక్కింది స్వదేశం జారీచేసిన అరెస్ట్ వారెంట్. ఇరాన్ ప్రభుత్వం ఆమెకు ఈ వారెంట్‌ను ఎందుకు ఇచ్చిందో తెలుసా? మ్యాచ్ జరిగే సమయంలో ఆమె తన ముఖానికి మేలిముసుగు వేసుకోలేదు మరి! అయితే? అది ఆ దేశ నియమాల ప్రకారం చాలా ఘోరమైన తప్పిదమట.
దాంతో ఆమె బాక్సింగ్‌లో ఏ దేశ ప్రత్యర్థినైతే మట్టి కరిపించి విజయ బావుటా ఎగుర వేసిందో, ఆ దేశంలోనే శరణార్థిగా జీవించవలసిన పరిస్థితి... కాదు దుస్థితి ఏర్పడింది.ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దవలసిన ఇరాన్ జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఆ పని చేయకపోగా సదాఫ్‌ను గెటౌట్ అంది. ఆమెను తమ దేశానికి తిరిగి రప్పించేది లేదని పంచ్ స్టేట్‌మెంట్‌లు విసిరి మరీ చెబుతోంది. అంతేకాదు.. ‘‘ఫెడరేషన్ దృష్టిలో అదంతా ఆమె వ్యక్తిగత విషయం. జనంలోకి వచ్చేటప్పుడు వళ్లు దగ్గర పెట్టుకోనక్కరలేదా?’’ అంటూ గుడ్లురుముతున్నాడు సమాఖ్య అధ్యక్షుడు హుసేన్ సూరి.
– డి.వి.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment