సేవే లక్ష్యంగా సివిల్స్‌కు...
సక్సెస్ స్టోరీ
ఐఐటీలో బీటెక్.. ఐఐఎంలో పీజీపీఎం.. ఆ తర్వాత ప్రఖ్యాత సిటీ గ్రూప్‌లో లక్షల వేతనంతో కార్పొరేట్ కొలువు.. అయినా సామాన్య ప్రజలకు సేవ చేయాలనే తలంపు.. నాలుగేళ్లపాటు చేసిన విదేశీ ఉద్యోగాన్ని వదిలి.. స్వదేశానికి పయనం.. ఐఏఎస్ దిశగా సివిల్స్‌కు ప్రిపరేషన్.. తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్.. గురి మాత్రం ఐఏఎస్‌పైనే..! తుది లక్ష్యం దిశగా పట్టువదలని ప్రయాణం.. ఫలితం.. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు!! సివిల్ సర్వీసెస్ 2013-14 ఆల్ ఇండియా టాపర్ గౌరవ్ అగర్వాల్‌తో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ..
అమ్మ శ్రద్ధ ఎంతో:
మా స్వస్థలం జైపూర్. కుటుంబంలో అందరూ విద్యావంతులే. నాన్న సురేశ్ చంద్ర గుప్తా.. జైపూర్ డెయిరీలో సీనియర్ మేనేజర్. అమ్మ సుమా గుప్తా.. గృహిణి. అమ్మ నన్ను చదివించే విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునేది. ఫలితంగా అకడెమిక్స్‌లో ఎప్పుడూ ముందుండే వాణ్ని.
సేవ చేయడమే లక్ష్యంగా.. సివిల్స్‌కు:
ఐఐఎం, లక్నోలో ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పీజీపీఎం 2008లో పూర్తయింది. తర్వాత సిటీ గ్రూప్‌లో క్రెడిట్ డెరివేటివ్స్ విభాగంలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ (ట్రేడర్)గా ఎంపికయ్యాను. 2008 జూన్ నుంచి 2011 సెప్టెంబర్ వరకు హాంగ్‌కాంగ్‌లో క్రెడిట్ ట్రేడర్‌గా విధులు నిర్వర్తించాను. ఈ క్రమంలో ఎన్నో ఫీల్డ్ విజిట్స్.. విభిన్న సంస్కృతుల ప్రజలతో మమేకం కావడంతోపాటు వారి సాదకబాధకాలు దగ్గర నుంచి చూశాను. మన దేశంలో ప్రజలకు సేవలందించాలని అనిపించింది. ఇందుకు ఐఏఎస్ సరైన మార్గంగా కనిపించింది. దాంతో 2011 సెప్టెంబర్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి.. స్వదేశానికి తిరిగి వచ్చాను.
2011 సెప్టెంబర్ నుంచి ప్రిపరేషన్:
ఐఏఎస్ లక్ష్యంతో సివిల్స్‌లో విజయం కోసం స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత సమయాన్ని ఏ మాత్రం వృథా చేయలేదు. తొలి ప్రయత్నంలోనే ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగాను.
2012లో మొదటిసారిగా సివిల్స్ రాశాను.
2012 ప్రిలిమ్స్‌కు.. 2011 సెప్టెంబర్ నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాను. ప్రతిరోజు సగటున 10 నుంచి 12 గంటల పాటు పుస్తకాలతోనే. 2012 ప్రిలిమ్స్‌లో రెండో పేపర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు గతంలో క్యాట్ రాసిన అనుభవం బాగా కలిసొచ్చింది. అలాగే పేపర్-1 జనరల్ స్టడీస్ కోసం ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాను. గత ప్రశ్నపత్రాల పరిశీలన.. ప్రశ్నలు అడుగుతున్న తీరు.. ఆయా అంశాలకు వెయిటేజిలపై స్వీయ విశ్లేషణ ద్వారా అవగాహన పెంచుకున్నాను. ఫలితంగా ప్రిలిమ్స్‌లో విజయం సొంతమైంది.
మెయిన్స్‌కు ఇలా:
సివిల్స్-2012 మెయిన్స్‌లో రెండు ఆప్షనల్స్ ఉండేవి. అకడెమిక్ నేపథ్యం, పరిజ్ఞానం ఆధారంగా ఎకనామిక్స్‌ను ఒక ఆప్షనల్‌గా.. చరిత్ర సంబంధిత అంశాలు, చారిత్రక అంశాలపై సహజ ఆసక్తి వంటి కారణాలతో హిస్టరీని రెండో ఆప్షనల్‌గా ఎంచుకున్నాను. ఎకనామిక్స్‌కు కోచింగ్ తీసుకోలేదు. కానీ హిస్టరీకి ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను. ప్రతి అంశానికి సంబంధించి సొంతంగా నోట్స్ రాసుకోవడంతోపాటు ఇంటర్నెట్ రిసోర్స్‌ను సమర్థవంతంగా వినియోగించుకున్నాను. తద్వారా జనరల్ స్టడీస్‌పై పట్టు సాధించాను. దాంతో మెయిన్స్‌లోనూ విజయం వరించింది. తర్వాత ఇంటర్వ్యూలోనూ ప్రతిభ చూపి ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. శిక్షణలో చేరినప్పటికీ.. ఐఏఎస్ లక్ష్యంగా సిద్ధమయ్యాను.
ఓవైపు శిక్షణ.. మరోవైపు ఐఏఎస్ ప్రిపరేషన్:
రెండో ప్రయత్నంలో ఎలాగైనా ఐఏఎస్ సాధించాలనే పట్టుదలతో నిర్దిష్ట టైం మేనేజ్‌మెంట్‌తో 2013 సివిల్స్‌కు ప్రిపరేషన్ సాగించాను. ఈ సమయంలో ప్రతి రోజు ఆరు నుంచి ఎనిమిది గంటలు తగ్గకుండా చదివే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నాను. ఐపీఎస్ ఫౌండేషన్ కోర్సు తర్వాత ఎన్‌పీఏలో శిక్షణ ప్రారంభం కావడానికి, 2013 మెయిన్స్ పరీక్షలకు మధ్య కొంత వ్యవధి లభించింది. ఈ సమయంలో మెయిన్స్‌పై దృష్టిపెట్టి గతంలో చేసిన పొరపాట్లను అధిగమించేలా కృషి చేశాను. అప్పటికే సివిల్స్ పరీక్షలపై స్పష్టత రావడంతో.. ఐపీఎస్ శిక్షణ, ప్రిపరేషన్‌కు సమయం కేటాయింపు విషయంలో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాలేదు.
కొత్త ప్యాట్రన్.. కంగారు అనవసరం:
2013 మెయిన్స్‌లో కొత్త ప్యాట్రన్ అమల్లోకి వచ్చింది. ఆప్షనల్‌ను ఒక సబ్జెక్ట్‌కే పరిమితం చేసి, జనరల్ స్టడీస్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. కొత్తగా ఎథిక్స్ పేపర్‌ను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా జనరల్ స్టడీస్‌కు ప్రాధాన్యం పెరగడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇక్కడ గుర్తించాల్సింది.. పాత విధానంలో ఉన్న జనరల్ స్టడీస్ అంశాలనే విభజించి వేర్వేరు పేపర్లుగా యూపీఎస్సీ పేర్కొంది. ఈ లాజిక్‌ను గుర్తిస్తే కొత్త ప్యాట్రన్ విషయంలో ఎలాంటి ఆందోళన ఉండదు. ఎథిక్స్ పేపర్‌లో కొంతమేర పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంశాలు ఉంటాయి. ఇలా సిలబస్‌ను ఆమూలాగ్రం పరిశీలించి విశ్లేషిస్తే మానసిక సంసిద్ధత లభిస్తుంది. ఇదే వ్యూహంతో రెండోసారి ప్రిపరేషన్ సాగించి ఇంటర్వ్యూ దశకు చేరుకున్నాను.
ఇంటర్వ్యూ.. అధిక శాతం అకడెమిక్ ప్రొఫైల్‌పైనే:
నా ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నలు అధిక శాతం అకడెమిక్ ప్రొఫైల్ నుంచే. మే 30న పద్మశ్రీ అవార్డ్ గ్రహీత డాక్టర్ కిలమ్ సుంగ్లా బోర్డ్ నేతృత్వంలో ఇంటర్వ్యూ జరిగింది. ప్రశ్న-సమాధానం కంటే.. ఒక చర్చ కోణంలో ఇంటర్వ్యూ సాగింది. ప్రస్తుత దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు.. వాటిని అధిగమించేందుకు మార్గాలు.. ద్రవ్యోల్బణం.. ఎస్‌ఈజెడ్‌లు అంటే ఏంటి? కొత్త ప్రభుత్వం ఎలాంటి ఆర్థికవిధానాలు అనుసరిస్తే బాగుంటుంది? భూ సేకరణ చట్టాలు.. పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన విధానాలు.. ఇలా అన్నీ ఆర్థిక అంశాలకు సంబంధించిన ప్రశ్నలే అడిగారు. వీటితోపాటు ప్రస్తుత సామాజిక పరిస్థితుల నేపథ్యంలో.. మీడియా వ్యవహరిస్తున్న తీరు, మీడియా పాత్ర, సోషల్ మీడియాతో సానుకూలతలు-ప్రతికూలతలు వంటి ప్రశ్నలు అడిగారు. కాలేజీ రోజుల్లో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌పైనా చర్చించారు. అన్నిటికీ సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చాను. నేషనల్ బయోస్ఫియర్ రిజర్వ్స్, నేషనల్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ మధ్య తేడా ఏంటి? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేకపోయాను. మొత్తం మీద ఇంటర్వ్యూ ముగిసాక.. ఐఏఎస్‌కు అవసరమైన ర్యాంకు వస్తుందనే నమ్మకం కలిగింది.
ఫస్ట్ ర్యాంకు ఊహించలేదు:
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఐఏఎస్ గ్యారంటీ అనుకున్నాను. కానీ ఆల్ ఇండియా టాపర్‌గా నిలుస్తానని ఊహించలేదు. ఈ ఆనందం మాటల్లో చెప్పలేను. నా విజయం వెనుక కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల తోడ్పాటు మరువలేనిది. ముఖ్యంగా సిటీ గ్రూప్‌లో ఉద్యోగాన్ని వదిలి వచ్చినా.. ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా.. ‘గో ఎహెడ్’ అంటూ ప్రోత్సహించారు.
ఫండమెంటల్స్‌లో పట్టు.. తొలి మెట్టు:
సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులకు నా సలహా.. తొలి ప్రయత్నానికి ఏడాది ముందు నుంచే కసరత్తు ప్రారంభించాలి. ముందుగా సివిల్స్ అంటే అందని ద్రాక్ష అనే భావన వీడాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. అన్ని సబ్జెక్ట్‌లు, అంశాలకు సంబంధించి ఫండమెంటల్స్‌పై పట్టు సాధించడం చాలా అవసరం. ఇవి సాధ్యం చేసుకుంటే గమ్యం దిశగా సగం దూరం చేరుకున్నట్లే! ప్రిపరేషన్ ప్రణాళికలను కూడా వ్యూహాత్మకంగా రూపొందించుకోవాలి. ఈ విషయంలో గత ప్రశ్నపత్రాల పరిశీలనతోపాటు, సిలబస్‌పై అవగాహన పెంచుకోవాలి. ఆప్షనల్ ఎంపికలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఒక్క ఆప్షనల్ మాత్రమే ఉంది కాబట్టి ఆసక్తికి ప్రాధాన్యమిస్తూనే స్కోరింగ్ అవకాశం ఉన్న సబ్జెక్ట్‌ను ఎంచుకోవడం మంచిది. ఇందుకోసం సీనియర్ల సలహాలు తీసుకోవడం ఉపయుక్తం. ప్రిలిమ్స్ ప్రిపరేషన్ నుంచే మెయిన్స్ కోణంలో విశ్లేషణాత్మకంగా చదవాలి. ఆల్ ద బెస్ట్!!
చదివిన పుస్తకాలు...
హిస్టరీ: బిపిన్ చంద్ర
జనరల్ స్టడీస్: ఇన్‌సైట్ ఐఏఎస్ అకాడమీ నోట్స్
పాలిటీ అండ్ కాన్‌స్టిట్యూషన్: డి.డి.బసు
జాగ్రఫీ, హిస్టరీ బేసిక్స్ కోసం: 11, 12 తరగతుల పాత ఎన్.సి.ఇ.ఆర్.టి పుస్తకాలు
బయాలజీ, ఎన్విరాన్‌మెంట్: 9, 10 తరగతుల ఎన్.సి.ఇ.ఆర్.టి పుస్తకాలు
కరెంట్ అఫైర్స్: దినపత్రికలు, మ్యాగజైన్‌లు
గౌరవ్ అగర్వాల్ అకడెమిక్ ప్రొఫైల్
1999లో పదో తరగతి ఉత్తీర్ణత (88.2 శాతం)
2001లో +2 (సైన్స్, మ్యాథ్స్ గ్రూప్) ఉత్తీర్ణత (85.6 శాతం)
2001లో ఐఐటీ-జేఈఈలో ఆల్ ఇండియా 45వ ర్యాంకు
2005లో ఐఐటీ-కాన్పూర్ నుంచి బీటెక్
క్యాట్-2004లో 99.3 పర్సంటైల్
క్యాట్-2005లో 99.80 పర్సంటైల్
2005 డిసెంబర్ నుంచి 2006 జూన్ వరకు ఐబీఎం రీసెర్చ్ ల్యాబ్స్‌లో ప్రాజెక్ట్ ట్రైనీగా ఇంటర్న్‌షిప్
2006-2008 ఐఐఎం-లక్నోలో ఎంబీఏ ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేషన్. 9.25 జీపీఏతోపాటు గోల్డ్ మెడల్ విజేత
2007లో సిటీ గ్రూప్ హాంకాంగ్‌లో రెండు నెలల ఇంటర్న్‌షిప్, ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్
2012-13 సివిల్స్‌లో 244వ ర్యాంకు
సివిల్స్ 2013 - 14 ఆల్ ఇండియా 30వ ర్యాంకర్ కృత్తిక జ్యోత్స్నతో ఇంటర్వ్యూ ఈ వారం భవితలో (19.06.2014)