పొగ మానేయాలనుకుంటున్నారా? | 31 May World No Tobacco Day | Sakshi
Sakshi News home page

పొగ మానేయాలనుకుంటున్నారా?

Published Wed, May 3 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM

పొగ మానేయాలనుకుంటున్నారా?

పొగ మానేయాలనుకుంటున్నారా?

 31 మేలు

31 మే వరల్డ్‌ నో టొబాకో డే పొగాకు నమలడం, పొగతాగడం ఎంత హానికరమోఅందరికీ తెలియజేయడం కోసం డబ్ల్యూహెచ్‌ఓ ఎంచుకున్న రోజు. పొగాకు వ్యసనాన్ని మానేయాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉన్నా ఈ అలవాటు మానలేకపోతున్నారు. వీళ్లకు సహాయం చేద్దామని ‘సాక్షి’ ఈ కొన్ని మేలు మార్గాలు చూపిస్తోంది. మే 31న పొగాకు అలవాటును మానేసి ఇతరులకు మీరు స్ఫూర్తిదాయకంగా ఉంటారని ఆశిస్తున్నాం. ఈ మేళ్లు ఎంతోమందికి మైలురాళ్లు కావాలి.

‘ముప్ఫయి రోజుల్లో...’ అనేది చాలా జనాకర్షణ కలిగిన అంశం. ముప్ఫయి రోజుల్లో ఆంగ్ల భాష, ముప్ఫయి రోజుల్లో కరాటే... ఇలా. దాదాపు నెల రోజుల తర్వాత... సరిగ్గా ఈ నెల 31న ‘యాంటీ టొబాకో డే’. పొగాకు వల్ల, పొగతాగడం వల్ల కలిగే అనర్థాలు ఇప్పటికే అందరికీ తెలిసినవే. కానీ తెలిసి కూడా మానలేకపోవడమే సిగరెట్‌ బలం... దాన్ని తాగేవారి బలహీనత. దీన్ని అధిగమించడానికీ మార్గాలున్నాయి. ఈ నెల రోజుల్లో పొగతాగడం మానేయడానికి అనేక మంది నిపుణులు సూచించిన కొన్ని మార్గాలను మీకు అందిస్తున్నాం. ఈ నెల 31న వచ్చే యాంటీ టొబాకో డే నాటికి మీరు పొగ మానేస్తారనే లక్ష్యంతో... మీకు మేము వినమ్రంగా అందిస్తున్న కథనం ఇది.

పొగాకులో దాదాపు నాలుగు వేలకు పైగా హానికర రసాయనాలు ఉంటాయి. వాటిలోని ఆక్సిడెంట్స్‌ వల్ల వయసు పైబడిన కొద్దీ దుష్ప్రభావాలు ఎదురవు తుంటాయి. పొగలో ఉండే కార్సినోజెన్స్‌ వల్ల క్యాన్సర్స్‌ కూడా రావచ్చు.

1. ఫ్రెండ్స్‌ సిగరెట్‌ తాగుతున్నది చూసి ఎడతెరిపి లేకుండా దగ్గు వచ్చినా సరే, స్నేహితుల ముందు చిన్నబోకూడదని పంతంపట్టి మొదలుపెడతారు.

2 భార్యాపిల్లలు ‘ఎప్పుడు మానేస్తారు’ అని ఎంతగా బతిమిలాడుతున్నా అదేపనిగా కొనసాగిస్తారు.

3.ఆస్తమా లేదా ఇతర ఊపిరితిత్తుల సమస్య వచ్చినప్పుడు మానేద్దామనుకొని మళ్లీ ప్రారంభిస్తారు.

4. కానీ తప్పక మానేయడానికీ 4వ తేదీ నుంచి ప్రయత్నం చేయండి. ఆయా సూచనలు పాటించండి. ఆల్‌ ద బెస్ట్‌!

5.ముందుగా క్యాలెండర్‌లో సిగరెట్‌/పొగాకు మానాల్సిన రోజును మార్క్‌ చేసుకొని, అది నిత్యం మీకు కనిపిస్తుండేలా  అమర్చుకోండి.

6.సిగరెట్‌/పొగాకుకు పురిగొల్పుతున్న అంశాల జాబితాను రాయండి. ఈ జాబితాను పూర్తి చిత్తశుద్ధితో రాయాలి. జాబితాలోని అంశాలను సమీక్షించుకుంటూ... ఆ సందర్భాలలో పొగతాగకుండా ఎందుకు ఉండలేరో ఆలోచించుకోండి.

7.భార్య, పిల్లలు, స్నేహితులు, బంధువుల నుంచి మీ పొగతాగే అలవాటు గురించి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోండి. మీ అలవాటు వల్ల వారు పడ్డ మనోవేదన, ఇక్కట్లు, కష్టాలను ఆలోచించండి. మీ అలవాటుతో వారిని బాధపెట్టారని పదే పదే గుర్తుతెచ్చుకోండి.

8.మంచి మూడ్‌లో ఉన్నప్పుడే సిగరెట్‌ను వదిలేయండి. ఇలా మంచిమూడ్‌లో ఉన్నప్పుడు వదిలేస్తే... ఆ అలవాటు మళ్లీ దరిదాపుల్లోకి రాదు. ఎక్కువ మందిలో ఇది నిరూపితమైందని అధ్యయనాలు చెబుతున్నాయి.

9.మీరు సిగరెట్‌ మానేసిన విషయం మీ భార్యకు, స్నేహితులకు, పిల్లలకు, మీ కొలీగ్స్‌కు చెప్పండి. బహిరంగంగా ఇలా ప్రకటించాక వారి ముందు మళ్లీ సిగరెట్‌ తాగాలంటే బిడియంగా ఉంటుంది. ఒకవేళ తీసినా పిల్లలు నేరుగా ప్రశ్నిస్తారేమోనని సిగ్గనిపిస్తుంది.

10.సిగరెట్‌ తాగాలనిపించినప్పుడు పంటికింద నమలడానికి ఆరోగ్యకరమైన పదార్థాలు... అంటే పల్లీలు, నట్స్‌ వంటివి అందుబాటులో పెట్టుకోండి. అవి మీ బరువును పెంచుతాయనుకుంటే చిన్న కప్పు గ్రీన్‌ టీ తాగండి.

11.మీరు సిగరెట్‌ బయటకు తీయగానే ముఖం ముడుచుకొని పక్కకు వెళ్లేవారినీ, మీరు సిగరెట్‌ తాగి రాగానే ఆ వాసన సోకిన వెంటనే ముఖం చిట్లించుకునే వారిని గుర్తుకు తెచ్చుకోండి. ఇంతటి అసహ్యాన్ని పెంచడం అవసరమా?... ఆలోచించండి.

12.మీ పనిలో బ్రేక్‌ వచ్చినప్పుడల్లా సిగరెట్‌కు వెళ్లడానికి బదులు కంప్యూటర్‌గేమ్‌లో నిమగ్నం కండి. ఆ తర్వాత మళ్లీ మీ పని మొదలుపెట్టేయండి. ఇంక సిగరెట్‌ తాగడానికి దొరికే బ్రేక్‌ ఎక్కడ? మీ పనిలో బ్రేక్‌ పడే అవకాశమెక్కడ?

13.సిగరెట్‌ తాగాలనిపించినప్పుడల్లా టెన్నిస్, స్క్వాష్‌  ఆటలు ఆడుతున్నట్లుగా ఊహించుకోండి. మర్నాడు ఆడాలని నిశ్చయించుకోండి. అందుకు ఊపిరితిత్తులకు మరింత శక్తి కావాలి కదా. సిగరెట్‌తో వాటిని కోల్పోతారన్న సంగతి గుర్తు తెచ్చుకోండి.

14.ఎప్పుడూ నో–స్మోకింగ్‌ జోన్‌లో ఉండటానికి ప్రయత్నించండి. దగ్గర సిగరెట్లు ఉంచుకోకండి. తపన (క్రేవింగ్‌) పుట్టినప్పుడు సిగరెట్‌ కొనడానికి బయటకు వెళ్తారు. చాలా సందర్భాల్లో బయటికెళ్లే సమయం లేక పొగతాగకుండా ఉండకతప్పని పరిస్థితి వస్తుంది.

15.స్మోకింగ్‌తో వచ్చే అనారోగ్యాలను జాబితా రాయండి. దాని అనేక కాపీలు తీయండి. ఇంట్లో అన్ని గదుల్లోనూ మీకు ప్రస్ఫుటంగా కనిపించేలా, మీరు నడయాడే ప్రతి చోటా అతికించండి. స్మోకింగ్‌ను కొనసాగిస్తే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేరని అర్థమవుతుంది.

16.మీరు రెగ్యులర్‌గా తీసుకునే పాన్‌–షాప్‌ వైపునకు కాకుండా... వేరే దారుల్లో ఆఫీసుకు వెళ్లండి. అదే దారిలో వెళ్తే కాళ్లు అక్కడ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కొత్త మార్గాల్లో ఎక్కడ పాన్‌–షాపు ఉంటుందో తెలియదు కాబట్టి అంత తేలిగ్గా మీకు సిగరెట్‌ దొరకదు.

17.గతంలో మీరు నిర్వహించిన అతి కష్టమైన, టాస్క్‌లను, సులువుగా పూర్తి చేసిన వ్యవహారాలను గుర్తు తెచ్చుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని, మనోనిబ్బరాన్ని తలచుకోండి. అంత కష్టమైనవే చేశారు. ఈ పొగాకూ / సిగరెట్లు మానేయడం అనగా ఎంత?

18.సిగరెట్‌ మానేశాక  ఇంట్లో వాళ్ల ఫీలింగ్‌ తెలుసుకోండి. ఆ ఫీడ్‌బ్యాక్‌ సిగరెట్‌కు దూరంగా ఉంచుతుంది. అగ్గిపెట్టె, లైటర్, యాష్‌ట్రే, సిగరెట్‌ హోల్డర్‌ వంటివేవీ దగ్గర ఉంచుకోకండి. అవి కళ్ల ముందు ఉంటే... మనసు సిగరెట్‌ మీదకు మళ్లుతుంది.

19.మీ ఫ్రెండ్స్‌లో డాక్టర్స్, పల్మనాలజిస్ట్స్, హెల్త్‌ కేర్‌ ఇండస్ట్రీ వారు ఉంటే తరచూ వారినే కలుస్తూ సిగరెట్‌ నుంచి వచ్చే అనర్థాలు, ఆరోగ్యానికి ముప్పుల గురించి చర్చిస్తూ ఉండండి. తప్పకుండా ప్రయోజనం ఉంటుంది.

20.సిగరెట్‌ మానే ప్రయత్నంలో ఒకసారి ఫెయిలైతే మరోసారి ప్రయత్నించండి. పదో ప్రయత్నంలో విజయం సాధించిన వారు  కూడా ఉన్నారు.

21.సిగరెట్‌ మానేసే ప్రయత్నంలో.. అరెరె... ఈ ఆనందానికి దూరం కావాలా అని బెంగపడకండి. ఎప్పుడు కావాలంటే అప్పడు సిగరెట్‌ దొరుకుతుంది, తాగగలను. కాకపోతే ఇప్పుడు తాగడం లేదు. అంతే...! అనుకోండి. అప్పుడు తప్పక మానేయగలరు.

22.సిగరెట్‌ తాగినప్పుడల్లా ఉల్లి, వెల్లుల్లి తిన్నవారి నుంచి వచ్చే వాసనను గుర్తు తెచ్చుకోండి. ఆరోగ్యాన్నిచ్చే వాటిని తినే మీటింగ్‌కు వెళ్లాలంటేనే వెనకాడుతాం. అనారోగ్యకరమైన పొగాకు,  సిగరెట్‌కు, ఆ కంపునకు ఆమోదం ఉంటుందా? ఆలోచించండి.

23.సిగరెట్‌ తాగాలనే కోరిక పుట్టినప్పుడల్లా మీరు అమితంగా గౌరవించే పెద్దల(సిగరెట్‌ తాగి వెళ్లలేనివారి) దగ్గరకు వెళ్లేలా ప్లాన్‌ చేసుకోండి. అలా సిగరెట్‌కూ, సిగరెట్‌కూ మధ్య వ్యవధి పెరుగుతుంది. సిగరెట్‌ అలవాటు దూరం అవుతుంది.

24.సిగరెట్‌ మానడానికి ఈ–సిగరెట్‌ను ఆశ్రయించదలచుకున్నారా? వద్దనే వద్దు. పొగతాగడం మానేయాలనుకుంటే పూర్తిగా మానేయండి. ఈ ప్రత్యామ్నాయం సరికాదు. ఈ–సిగరెట్‌ సైతం ఆరోగ్యానికి హాని చేసేదే అని గుర్తుంచుకోండి.

25.తరచూ హాస్పిటల్‌లో రోగులకు పండ్లు పంచండి. ఇందులో భాగంగా క్యాన్సర్‌ హాస్పిటల్స్‌ను, క్యాన్సర్‌ విభాగాలను సందర్శించండి. అక్కడ కనిపించే దృశ్యాలు మీ మనసు మార్చి, మీ దురలవాటును తప్పించే అవకాశం ఎక్కువ.

26.ఎడతెరిపి లేనంత పనిలో నిమగ్నం అయిపోండి. ఇది ఒత్తిడి లేని పనిౖ అయివుండాలి. మీరు పనిలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు అసలు సిగరెట్‌ తహతహ (క్రేవింగ్‌) కలగని తీరును గుర్తించండి.

27.నికోటిన్‌ తపనను తగ్గించే చ్యూయింగ్‌ గమ్స్, ప్యాచ్‌ల వంటి వాటిపై ఆధారపడండి. అవి సిగరెట్‌ తాగాలనే తహతహను తగ్గించి క్రమంగా ఆ అలవాటు నుంచి దూరం చేస్తాయి.

28.ధూమపానం మానడానికి వ్యాయామం  మంచి మార్గం. అంత కష్టపడి వ్యాయామం చేసి సంపాదించుకున్న ఆరోగ్యాన్ని, సౌష్ఠవాన్ని కేవలం సిగరెట్‌తో బుగ్గి చేసుకోవడం సరికాదనే భావన పెరుగుతుంది.

29.బోర్‌ అనిపించినప్పుడు దాన్ని అధిగమించడానికి ఇతరత్రా మంచి హాబీలను పెంపొందించుకోండి. బోర్‌ అనిపించినప్పుడు సిగరెట్‌ తాగడం వల్ల బోర్‌డమ్‌ మరింత పెరుగుతుందని గుర్తుంచుకోండి.

30.ఎవరినైనా ఆపద నుంచి రక్షించడానికి మీ బలాన్ని ప్రదర్శించాల్సి వచ్చిన సందర్భాన్ని గుర్తుతెచ్చుకోండి. మీరు సిగరెట్‌ తాగుతూ ఉంటే అదే స్టామినాను ప్రదర్శించడం సాధ్యపడేది కాదన్న విషయాన్ని గుర్తించండి. పై మార్గాలన్నీ విఫలం అయితే కౌన్సెలర్‌ వద్ద సలహా తీసుకోండి. సపోర్ట్‌ గ్రూప్‌ల సహాయం తీసుకోండి. చివరగా మీ డాక్టర్‌ / సైకియాట్రిస్ట్‌ను సంప్రదించండి.

31.వరల్డ్‌ నో టొబాకో డే...

కొన్ని అనర్థాలు
లంగ్‌క్యాన్సర్, ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్, నోటి క్యాన్సర్, ఈసోఫేజియల్‌ క్యాన్సర్, అనేక రకాల లుకేమియా, గుండెజబ్బులు, హైబీపీ, డయాబెటిస్‌ ముప్పు, డిప్రెషన్, అలై్జమర్స్‌ డిసీజ్, సంతానలేమి, పుంసత్వం తగ్గడం, ఎముకలు పలచబారడం, నాలుకకు రుచి తెలికయకపోవడం, ముక్కుకు వాసనలు తెలియకపోవడం... మొదలైనవి.

ఆలోచించండి
ఎలా మొదలైనా... ఇలా వదిలేయచ్చు!
మీరు సిగరెట్‌ తాగే చోట మీరెప్పుడూ గౌరవించే వారి ఫొటో పెట్టుకోండి. ఎంతైనా అక్కడ సిగరెట్‌ కాల్చడానికి మీ మనసు అంగీకరించదు.మీ పిల్లలకు ముద్దు పెట్టే సమయంలో మీ నుంచి వచ్చే సిగరెట్‌ కంపు కారణంగా వాళ్లు ముఖం చిట్లించుకోవడం గుర్తు చేసుకోండి. మరోసారి సిగరెట్‌ జోలికి పోరు.మంచి చేయాలనీ, మంచిని అనుసరించాలని మనం సమాజానికి చెబుతుంటాం. మరి మనం ఏం చేయకూడదన్నది మరొకరు చెప్పడం అవసరమా?ఏదైనా ఒకటి వదిలిపెట్టాలంటే కాశీ దాకా వెళనక్కర్లేదు. సిగరెట్‌ తాగీ తాగీ ఆరోగ్యం చెడగొట్టుకొని మన ఆత్మీయుడు మనల్ని వీడి వెళ్లిపోతే అతడి జ్ఞాపకార్థం శ్మశానంలోనూ దాన్ని వదిలేస్తే చాలు కదా.టీనేజ్‌లో స్నేహితుడెవరో చేశారని సిగరెట్‌ తాగడం అవసరమా? ఆ స్నేహితుడు వదిలిపోయినా, ఈ పని వల్ల జీవితాంతం ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడతారు. దీనిని కొనసాగించడం ఎంతవరకు సబబు?

పల్మనాలజిస్ట్‌ ను సంప్రదించండి
ప్లానింగ్‌
ఈ నెల 31న వరల్డ్‌ నో టొబాకో డే. ఆ తేదీకి దాదాపు నాలుగు వారాల గడువుంది. ఈ నాలుగు వారాల్లో పొతతాగడం మానేయాలనుకున్న వారు వరుసగా ఒక్కోవారంలో వేసుకోవాల్సిన ప్రణాళిక, చేయాల్సిన పని ఇదీ!

మొదటివారం
సిగరెట్‌ మానేయాలనే ఉత్సాహం, ఉద్వేగం మొదటివారం ఉంటాయి. తొలి 72 గంటల పాటు నికోటిన్‌ లోపం వల్ల తహతహ, తపన కలుగుతాయి. కానీ నాలుగు, ఐదో రోజు నుంచి అంతా మామూలవుతుంది. చెమటలు పట్టడం, ఊపిరి అందనట్లుగా అనిపించడం, ఉద్వేగం వల్ల అనర్థాలేమీ ఉండవు. ఈ వారంలో చ్యూయింగ్‌ గమ్స్, ప్యాచెస్‌ దగ్గర ఉంచుకోవాలి. అలవాటు వదిలాక మీకు అధికపాళ్లలో ఆక్సిజన్‌ అందడాన్ని మీరే గమనిస్తుంటారు.

రెండో వారం
ఇది మొదటివారం అంత గడ్డుగా ఏమీ గడవదు. చాలా రిలాక్స్‌ అవుతారు. పొగమానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ మీకే కనిపిస్తుంటాయి. మీరు తినే ఆహారం మరింత రుచికరంగా ఉంటుంది. మీకు అనేక పరిమళాలు అందుతుంటాయి. ఇంతకాలం ఏం కోల్పోయారో కొద్దికొద్దిగా మీరు అర్థమయ్యేది ఈ వారంలోనే. మీరు కోల్పోయిన వాటిని ఆస్వాదిస్తూ ఈ వారం గడుస్తుండటం వల్ల ఇది తేలిగ్గా గడవడం మీకే తెలుస్తుంది. హ్యాపీగా అనిపిస్తుంది.

మూడో వారం
ఈ వారానికి మీ ఒళ్లంతా తేలిగ్గానూ, మీ ఊపిరితిత్తులు మంచి గాలితో నిండుగానూ ఉన్న అనుభూతిని మీరు అనుభవిస్తుంటారు. ఈ వారంలో కాస్త కెఫిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి. ఎందుకంటే అవి మళ్లీ సిగరెట్‌ను ప్రేరేపించే అవకాశం ఉంది. ఈ వారంలో ఏరోబిక్స్, ధాన్యం మొదలుపెట్టడం మంచిది. ఈ వారంలో మీరు ఒకింత బరువు పెరుగుతారు. కానీ ఆందోళన వద్దు. ఆ పెరిగిన బరువుకు విరుగుడే ఈ వారంలో మీరు చేసే ఏరోబిక్స్‌.

నాలుగో వారం
ఈ వారం పొగతాగే రోజులకూ, మానేసిన రోజులకూ తేడాను సమీక్ష చేసుకుంటూ ఉంటే చాలు... అదే మీ సంకల్పాన్ని మరింత దృఢతరం చేస్తుంది. డబ్బు, ఆరోగ్యం, జీవనశైలిలో మీరు అనుభవిస్తున్న తేలికదనం (ఈజ్‌), ఫిజికల్‌ ఫిట్‌నెస్‌... ఈజీగా గడిచేలా చేస్తాయి. 31 వచ్చిందా? నెల పూర్తయ్యిందా? ఇక మిమ్మల్ని ఎవరూ నియంత్రించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆఫర్‌ చేసినా మీరే  సిగరెట్‌ను తోసిపుచ్చుతారు.
– డాక్టర్‌ కె. శైలజ, కన్సల్టెంట్, పల్మనాలజిస్ట్, మ్యాక్స్‌ క్యూర్‌ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement