
గతంలో ప్రమాదాలు అనుకున్నవే... ఇప్పుడు చికిత్సకు తక్షణావసరాలు!
‘వివాదాల నుంచి ఏకాభిప్రాయానికి’ (కాంట్రవర్సీస్ టు కన్సెన్సస్) అనే నినాదంతో ఈ నెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్‌లో కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఇందులో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టులు పాలుపంచుకున్నారు. గుండె చికిత్సల విషయంలో అనేక విషయాలపై ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భారత కార్డియాలజిస్ట్‌ల సొసైటీ 66వ వార్షిక సమావేశానికి కార్యనిర్వాహక కార్యదర్శి (ఆర్గనైజింగ్ సెక్రటరీ)గా వ్యవహరించిన డాక్టర్ బి. రమేశ్‌బాబు ‘సాక్షి’ ఫ్యామిలీ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. గుండె చికిత్స ప్రక్రియల విషయంలో అనేక విషయాలపై ఆయన పేర్కొన్న వివిధ అంశాలు ఆయన మాటల్లోనే...
‘వివాదాల నుంచి ఏకాభిప్రాయానికి’ అన్నది మీ సమావేశం నినాదం. గుండె చికిత్సల్లో ఏయే అంశాలపై వివాదాలున్నాయి. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం సాధించారా?
డా. రమేశ్ : అన్ని శాస్త్రాల్లాగే వైద్యశాస్త్రమూ నిత్యం పురోగమిస్తూ ఉంది. కొత్త కొత్త విషయాలు అనేకం నిత్యం వెలుగుచూస్తుంటాయి. ఒక చికిత్స ప్రక్రియ నిర్దిష్టంగా ఇలాగే ఉండాలని ఎప్పుడూ చెప్పలేం. ఎందుకంటే చికిత్స అన్నది అందరిలో ఒకేలాగా ఎప్పుడూ ఉండదు.
రోగి వయసు, అతడికి డయాబెటిస్ ఉందా లేదా... లాంటి అనేక అంశాలు రోగి చికిత్స విధానాన్ని నిర్ణయించడంలో ప్రధాన భూమిక వహిస్తాయి. కాబట్టి ఇదమిత్థంగా ఇదే పద్ధతి అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు. అయితే ఇలాంటి సమావేశాల ద్వారా గతంలో అస్పష్టంగా ఉండే అనేక అంశాల విషయాల్లో స్పష్టత వస్తుంటుంది. అంతేగానీ... ‘ఇది ఇలాగే జరిగి తీరాలి’ తరహా ఏకాభిప్రాయం అన్నది ఎప్పుడూ సాధ్యం కాదు. అప్పటి అంశాల ఆధారంగా సాధ్యమైనంత స్పష్టతను సాధించడమే ఎప్పటికప్పుడు మనం చేయగలిగే పని.
గతంలో ఆమోదం కానివని భావించిన చికిత్సలే... ఇప్పుడు ఆమోదయోగ్యమైనవి అని అనుకుంటున్నవి ఏవైనా ఉన్నాయా?
డా. రమేశ్ : చాలా! గుండెకు ఉండే ప్రధానమైన మూడు రక్తనాళాల్లో ఒకదానిలో లేదా రెండింటిలోనూ అడ్డంకి ఉంటే యాంజియోప్లాస్టీ (శస్త్రచికిత్స లేకుండానే అడ్డంకిని తొలగించి సన్నబడ్డ రక్తనాళాన్ని వెడల్పు చేసే చికిత్స) ద్వారా ఆ అడ్డంకి తొలగించడం చాలా సాధారణం. అలాగే లెఫ్ట్ మెయిన్ అని పేర్కొనే ఎడమవైపున ఉండే ప్రధాన రక్తనాళం (ధమని)లో అడ్డంకి ఉంటే పదేళ్ల క్రితం శస్త్రచికిత్సనే సూచించేవారు. కానీ ఇప్పుడు ఆ లెఫ్ట్ మెయిన్‌తో సహా మూడు ప్రధాన రక్తనాళాల్లో అడ్డంకి ఉన్నా యాంజియోప్లాస్టీ ప్రక్రియ ద్వారా చికిత్స చేయవచ్చని వైద్యశాస్త్రం పేర్కొంటోంది. అయితే ఈ విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. ఇది ఇప్పటికీ చర్చనీయాంశమే. అయినప్పటికీ లెఫ్ట్ మెయిన్‌తో సహా మూడు ప్రధాన రక్తనాళాల్లో అడ్డంకి ఉన్నా యాంజియోప్లాస్టీతో చికిత్సను సుసాధ్యం చేసి, మంచి ఫలితాలే సాధిస్తోంది ఇప్పటి ఆధునిక వైద్యశాస్త్రం. వైద్యనిపుణులూ సమర్థంగా ఈ పని చేస్తున్నారు.
ఒకవేళ మూడు ధమనులనూ వెడల్పు చేసే యాంజియోప్లాస్టీకి అయ్యే వ్యయం శస్త్రచికిత్సకు అయ్యే వ్యయం కంటే ఎక్కువ కాబట్టి... రోగి శస్త్రచికిత్సనే కోరుకుంటే?
డా. రమేశ్ : ఇది చాలా వాస్తవం. కాబట్టి ఉన్న ప్రత్యామ్నాయాలు రోగి ముందు ఉంచి, రోగి ఏది కోరుకోదలచుకున్నాడో చెప్పమనాలి. ఈ విషయంపై తీసుకునే నిర్ణయంలో రోగిని ఇన్వాల్వ్ చేయాలి. అయితే వ్యయం భరించగలిగే ఆర్థిక స్థోమత ఉన్న కొందరు రోగులు శరీరంపై కోత పెట్టే శస్త్రచికిత్స అంటే ఆందోళన పడతారు. మరికొందరు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని శస్త్రచికిత్స వైపునకు మొగ్గు చూపుతారు.
మీరు అన్నట్లే... కొందరు యాభయ్యవ పడిలో ఉన్న రోగులు తమకు ఆర్థిక స్థోమత ఉండి, ఈ వయసులోనే శస్త్రచికిత్స ఎందుకులే అని యాంజియోప్లాస్టీ వైపు మొగ్గు చూపారనుకుందాం. మళ్లీ భవిష్యత్తులో వారి రక్తనాళాలు మరోమారు సన్నబారి ఈసారి తప్పక శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందనుకోండి. అప్పటికీ వాళ్ల వయసు బాగా పెరిగిపోతుంది కదా! మరి ఆ వయసులో వారు శస్త్రచికిత్సను తట్టుకోగలరంటారా? అప్పుడెలా?
డా. రమేశ్ : మూడు ప్రధాన రక్తనాళాల్లోనూ అడ్డంకులు ఉండి, యాంజియోప్లాస్టీకి అయ్యే వ్యయాన్ని భరించగలిగితే సరే. లేకపోతే శస్త్రచికిత్సకు వెళ్లడం అనేది రోగి ఇష్టానిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ రోగి వ్యయాన్ని భరించగలిగేవారే అనుకుందాం. అప్పుడు భవిష్యత్తులో తప్పక శస్త్రచికిత్స చేయించాల్సి వచ్చినా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు 80 ఏళ్లవారికీ శస్త్రచికిత్స చేయడం అంత కష్టమైన పనిగా వైద్యనిపుణులు భావించడం లేదు.
రోగికి డయాబెటిస్ ఉంటే యాంజియోప్లాస్టీ మంచిదా లేక శస్త్రచికిత్సను సూచిస్తారా?
డా. రమేశ్ : చాలామంది డయాబెటిస్ రోగులకు శస్త్రచికిత్స అంత మంచిది కాదనీ, యాంజియోప్లాస్టీయే మంచిదని అనుకుంటారు. కానీ... డయాబెటిస్ రోగులకు యాంజియోప్లాస్టీ ద్వారా రక్తనాళాన్ని వెడల్పు చేసినా... వారి మధుమేహ వ్యాధి కారణంగా రక్తనాళాలు మళ్లీ సన్నబారిపోవడానికి (రీ-స్టెనోసిస్‌కి) అవకాశాలు ఎక్కువ. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి యాంజియోప్లాస్టీ కంటే శస్త్రచికిత్స మేలు.
గుండె చికిత్స విధానాల్లో గతంలో అపోహలు అనుకున్నవి... ఇప్పుడా అభిప్రాయాలు మారిపోయినవి ఏవైనా ఉన్నాయా?
డా. రమేశ్ : ఉన్నాయి! గతకొంత కాలం క్రితం బీటా బ్లాకర్స్ అనే మందులు హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న రోగులకు వాడటం సరైన పద్ధతి కాదు అనుకునేవారు. కానీ ఈరోజు ఆ మందులే వైద్యుల ‘డ్రగ్ ఆఫ్ ఛాయిస్’ అయ్యాయి. ఇక అలాగే వ్యాయామం విషయానికి వస్తే... ఆపరేషన్ అయిన రోగికి వారానికి మూడు రోజుల పాటు... రోజుకు 45 నిమిషాల నడక చాలు అనుకునేవారు. కానీ వారి వారి సామర్థ్యాన్ని బట్టి వారంలోని ఏడు రోజులూ నడిచినా మంచిదే. ఇది కేవలం గుండెజబ్బుల వారికే కాదు, ఆరోగ్యవంతులకూ వర్తిస్తుంది.
ఒక్కొక్క రోగికీ అతడి లక్షణాలను బట్టి చికిత్సాప్రాధాన్యాలు మారుతుంటాయి. కానీ ఓ సంయుక్త సందేశం ఇవ్వదలిస్తే డాక్టర్‌గా మీరేం చెబుతారు?
డా. రమేశ్ : నేను ఒక్కడినే చెప్పడం కాదు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఆరోగ్య అంశాలపై రూపొందించిన ‘నాన్ కమ్యూనికబుల్ డిసీజస్’ విభాగం పేర్కొనే విషయం ఒక్కటే. గుండెజబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు... ఈ నాలుగు ప్రధాన జబ్బుల నివారణకు ఒకటే తారక మంత్రం. అది పొగతాగకపోవడం, క్రమం తప్పని వ్యాయాయం, మంచి ఆరోగ్యకరమైన ఆకుకూరలు ఎక్కువగా ఉండే సమతులాహారం.
సవరణ: ఈనెల 5వ తేదీన ‘చైతన్య శీల నెట్‌వర్క్’ శీర్షికన ఫ్యామిలీ పేజీలో ప్రచురించిన వార్తలో ఫ్లోరైడ్ యాక్షన్ నెట్‌వర్క్ ఏర్పాటు కోసం స్ఫూర్తినిచ్చిన వారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్. డి. రాజారెడ్డి అని గమనించగలరు. ఈయన గత నాలుగు దశాబ్దాలుగా ఫ్లోరైడ్‌పై పలు రూపాల్లో యుద్ధం చేస్తున్నారు.