ఏ దేవుడికి... ఏ ప్రసాదం?
ఒక నిమిషం–ఒక విషయం
షోడశోపచారాలతో దైవాన్ని పూజించడం మనం ఆచారం. అందులో పూజ పూర్తయ్యాక నైవేద్యం పెట్టడం ముఖ్యం. అయితే ఒక్కోదేవుడికి ఒక్కో ప్రసాదమంటే ప్రీతికరం. ఏ దేవుడికి లేదా దేవతకు ఏ ప్రసాదం అంటే ఇష్టమో తెలుసుకుని, దానిప్రకారం మన అవకాశాన్ని బట్టి అదే నైవేద్యం పెడితే మంచిది.
వేంకటేశ్వర స్వామికి: వడపప్పు, పానకం; వినాయకుడికి: బెల్లం, ఉండ్రాళ్లు, జిల్లేడుకాయలు; ఆంజనేయుడికి: అప్పాలు, లడ్డూలు, శెనగలు; సూర్యుడికి: ఆవుపాలతో చేసిన పాయసం, మొలకెత్తిన పెసలు; లక్ష్మీదేవికి: క్షీరాన్నం, పండ్లు; సత్యనారాయణస్వామికి: ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి కలిపి చేసిన ప్రత్యేక ప్రసాదం; దుర్గాదేవికి: మినపగారెలు, అల్లం ముక్కలు; షిర్డీ సాయిబాబాకి: పాలు, గోధుమ రొట్టెలు, పాలకోవా; శ్రీకృష్ణుడికి: అటుకులతోకూడిన తీపి పదార్థాలు, వెన్న; శివుడికి: కొబ్బరికాయ, అరటిపండ్లు. సంతోషిమాతకు: పులుపులేని పిండివంటలు, తీపిపదార్థాలు; సరస్వతీదేవికి: రేగుపండ్లు, వెన్న, పేలాలు, కొబ్బరి, పాయసం.
ఒక ఘటన
సీతాదేవి అశోకవనంలో ఒక చెట్టుకింద కూర్చొని ఉంది. రావణుడు, అతడి అనుచరులూ పరుషపు మాటలతో పెట్టే హింసలకు ఆమె ఎంతగానో తల్లడిల్లిపోయింది. తన జాడ తన పతికి తెలిసే అవకాశం లేదు. వారు ఇక్కడకు వచ్చే వీలూ లేదు. తానేమి చేయాలో దిక్కు తోచలేదు. దాంతో ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధపడింది. సరిగ్గా అదే సమయంలో చెట్టుకొమ్మమీద మైనాక పక్షి కూత కూస్తోందట. ఆ కూత ఎలా ఉన్నదంటే, వేదాధ్యయనం చేసిన గురువు, తన శిష్యుని నిద్రలేపి, స్నాన సంధ్యావందనాలు, అగ్ని కార్యాన్ని, హోమాన్ని చేసుకోమని చెబుతున్నట్లు తోచిందట. ఆ కూత సీతాదేవికి ఓదార్పుగానూ, హితవచనంగానూ అనిపించిందట. అంతే! సీతాదేవికి మనసు మారిపోయింది. తాను మరణిస్తే తన పతి తట్టుకోలేడు.
తాను తన నాథుని ఎప్పటికీ చూడలేదు. జీవించి ఉంటే, ఏదోవిధంగా తన జాడ తెలుస్తుంది. అప్పుడు అసుర సంహారం చేసి, తనను తీసుకొని వెళ్లగలడు... అనిపించింది. దాంతో తనకు వచ్చిన ఆత్మహత్యాలోచనను మనసు నుంచి తుడిచి వేసిందట. అంటే... అవతలి వారు తీవ్రమైన దుఃఖంలో ఉన్నప్పుడు... ఆ దుఃఖాన్ని మనం తీర్చలేమని తెలిసినప్పటికీ, అనునయపూర్వకంగా ఒక్కమాట మాట్లాడినా లేదా కనీసం ఓదార్పుగా చేతితో స్పృశించినా అవతలి వారికి ఎంతో ఊరట కలుగుతుందని వాల్మీకి మహర్షి ఈ సంఘటన ద్వారా తెలియజెబుతున్నాడు.