ఓ ఖైదీ... ఓ సిపాయి... ఓ అథ్లెట్ కలిపితే మిల్కా సింగ్ | A prisoner ... a soldier ... I put the athlete Milkha Singh | Sakshi
Sakshi News home page

ఓ ఖైదీ... ఓ సిపాయి... ఓ అథ్లెట్ కలిపితే మిల్కా సింగ్

Published Fri, Mar 21 2014 11:09 PM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

ఓ ఖైదీ... ఓ సిపాయి... ఓ అథ్లెట్ కలిపితే మిల్కా సింగ్ - Sakshi

ఓ ఖైదీ... ఓ సిపాయి... ఓ అథ్లెట్ కలిపితే మిల్కా సింగ్

1947... దేశ విభజన సమయం.. పాకిస్థాన్ నుంచి హిందువులు.. భారత్ నుంచి ముస్లింలు వలసలు సాగిస్తున్న వేళ... అనుకోకుండా మత కలహాలు.. లక్షల మంది ఊచకోత... ఈ దురాగతాలను ఓ చిన్నారి ప్రత్యక్షంగా చూశాడు.. ఎంతలా అంటే కళ్లెదుటే తన తల్లిదండ్రులతోపాటు సోదరుడు, ఇద్దరు చెల్లెళ్లను ముష్కరులు దారుణంగా నరికి చంపారు.. ప్రాణం అరచేతిలో పెట్టుకుని పాక్ నుంచి ఢిల్లీకి శరణార్థిలా వచ్చాడు.. తోడు లేదు.. నీడ లేదు.. తినడానికి తిండి లేదు.. ఎలాగో పెరుగుతున్నాడు.. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి ఆలోచనలు పెడదారి పట్టడం ఖాయం. ఇతడూ అలాగే ఆలోచించాడు.. ఓ దశలో బందిపోటు అవుదామనుకున్నాడు.. అయితే తన అదృష్టమో.. దేశ సౌభాగ్యమో క్రీడాకారుడయ్యాడు.. దేశం గర్వించే స్థాయిలో ప్రపంచ యవనికపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాడు.. అతడెవరో కాదు ఫ్లయింగ్ సిఖ్‌గా పిలుచుకునే మిల్కా సింగ్.
 
ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్‌లోని గోవింద్‌పురా అనే గ్రామం మిల్కా జన్మస్థలం. తనకు 15 మంది తోబుట్టువులు. వీరిలో విభజనకు ముందే ఎనిమిది మంది మరణించారు. మత కలహాల బారి నుంచి తప్పించుకునేందుకు మిల్కా ఢిల్లీకి పయనమయ్యాడు. కొద్దికాలంపాటు అక్కడే ఉన్న తన సోదరి ఇంట్లో ఉన్నాడు. ఓసారి టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించినందుకు తీహార్ జైల్లో గడపాల్సి వచ్చింది. మరికొద్ది రోజులు పురానా ఖిల్లాలోని శరణార్థి శిబిరంలో తలదాచుకున్నాడు. ఈ దశలోనే జీవితంపై ఆశ లేకుండా నిరాసక్తంగా గడపసాగాడు. అప్పట్లో చంబల్ లోయను బందిపోటు ముఠాలు గడగడలాడించేవి. తను కూడా వారిలాగే తయారవుదామనుకున్నాడు.
 
 ఆర్మీలో ప్రవేశం


 అయితే ఇలాంటి విపరీత ఆలోచనలను సోదరుడు మల్కన్ సింగ్ దారి మళ్లించాడు. అప్పుడే భారత సైన్యంలో ప్రవేశాలు జరుగుతున్నాయి. తమ్ముడిని కూడా అటు పంపించాడు. 1951లో తన నాలుగో ప్రయత్నంలో మిల్కా సైన్యంలో ప్రవేశించగలిగాడు. సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ సెంటర్‌లో పోస్టింగ్. ఇక్కడే తనకు అథ్లెటిక్స్‌తో పరిచయమైంది. దీంట్లో ఎంపికయ్యేందుకు... తను చిన్నప్పుడు పాఠశాల కోసం 10 కి.మీ. పరిగెత్తిన అనుభవం పనికివచ్చింది. అథ్లెటిక్స్‌లో శిక్షణకు ఎంపికయ్యాడు. అయితే అప్పటిదాకా అలాంటి పోటీ ఒకటి ఉంటుందనే విషయం కూడా మిల్కాకు తెలీదు. తను సొంతంగా కూడా కఠోర శ్రమ కొనసాగించాడు. నడుముకు టైర్ కట్టుకుని మైదానాల్లో పరిగెత్తి తన సామర్థ్యాన్ని పెంచుకున్నాడు.
 
 అంతర్జాతీయ స్థాయిలో..


 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో 200మీ., 400 మీ.లలో మిల్కా సింగ్ పోటీపడ్డాడు. అయితే అంత పెద్ద స్థాయి ఈవెంట్స్‌లో పాల్గొనే అనుభవం లేకపోవడంతో హీట్స్ దశలోనే వెనుదిరగాల్సి వచ్చింది. కానీ 400 మీ.లో చాంపియన్‌గా నిలిచిన చార్లెస్ జెన్‌కిన్స్... మిల్కాసింగ్‌కు మార్గనిర్దేశకుడిగా నిలిచాడు. ఎలా శిక్షణ తీసుకోవాలనే విషయంలో తను విలువైన సూచనలిచ్చాడు. తదనంతరం 1958లో జరిగిన జాతీయ క్రీడలు, ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాలతో దూసుకెళ్లాడు. అలాగే అదే ఏడాది జరిగిన బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్‌లో 400 మీ. పరుగును 46.6 సెకన్లలో పూర్తి చేసి... స్వర్ణం సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు మిల్కానే. ఈ క్రీడల్లో ఇప్పటికీ వ్యక్తిగత అథ్లెటిక్స్‌లో భారత్ నుంచి స్వర్ణం సాధించిన రికార్డు మిల్కా పేరిటే ఉండడం విశేషం.
 
 1960 రోమ్ ఒలింపిక్స్..


 మిల్కా పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిన ఒలింపిక్స్ ఇదే. అప్పటికే తగిన అనుభవం, లెక్కలేనన్ని పతకాలతో మిల్కా సింగ్ మంచి ఊపు మీదున్నాడు. 400 మీ.లో కచ్చితంగా పతకం దక్కించుకుంటాడనే అందరూ భావించారు. ఫైనల్ రేసు ప్రారంభమైన తర్వాత ధాటిగా పరిగెత్తాడు. 250 మీటర్ల వరకు తనదే టాప్ పొజిషన్. ఇక్కడ కొద్దిగా నెమ్మదించి తల తిప్పుతూ  తన తోటివారి పరుగును గమనించాడు. అంతే ఇదే అదనుగా మిగతా అథ్లెట్స్ బుల్లెట్‌లా దూసుకెళుతూ మిల్కాను అధిగమించారు. అయినా పూర్తి స్థాయిలో పరుగు తీసి సెకన్లో వందో వంతు తేడాతో మూడో స్థానాన్ని కోల్పోయాడు. అయితేనేం 45.6 సెకన్లలో పరుగు పూర్తి చేసి అంతకు ముందు ఉన్న ఒలింపిక్ రికార్డును అధిగమించాడు (ఈ రేసులో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన నలుగురూ పాత ఒలింపిక్ రికార్డు (45.7 సెకన్లు)ను అధిగమించారు). 1962లో జరిగిన ఆసియా గేమ్స్‌లో 400మీ., 4ఁ100మీ. రేసులో స్వర్ణాలు గెలిచాడు.
 
మెడల్స్ అన్నీ జాతీయం


తన జీవిత కాలంలో దక్కిన పతకాలన్నీ మిల్కా సింగ్ జాతికి ప్రదానం చేశాడు. మొదట్లో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో వీటిని ప్రదర్శనకు ఉంచినా తదనంతరం పాటియాలాలోని స్పోర్ట్స్ మ్యూజియంకు తరలించారు. రోమ్ ఒలింపిక్స్‌లో తను ధరించిన షూస్ కూడా ఇక్కడున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement