ఆమెకు అన్నీ తానే... | a real story to 'Husband is responsible' | Sakshi
Sakshi News home page

ఆమెకు అన్నీ తానే...

Published Fri, Aug 18 2017 12:03 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఆమెకు అన్నీ తానే... - Sakshi

ఆమెకు అన్నీ తానే...

ఆదర్శం

ఆమె పేరు శోభ. సాధారణ గృహిణి... ఆమెకు పెళ్లయి పాతికేళ్లయింది. పదిహేడేళ్లుగా ఆమె మంచం దిగనే లేదు. ప్రమాదం ఆమె వెన్నును విరిచేసింది... విధి ఆమెను పరిహసించింది. నాతి... చరామి... అని పెళ్లి నాడు చేసిన బాసను గుర్తు చేసుకున్నాడామె భర్త.ఉద్యోగాన్ని వదిలేశాడు... భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవడమే తన బాధ్యత అనుకున్నాడు. భర్త అంటే ఇంత బాధ్యతగా ఉండాలని చెబుతున్నాడు సిద్ధరామ్‌రెడ్డి.

మెదక్‌ జిల్లా పర్వతాపూర్‌ గ్రామానికి చెందిన సిద్ధ్దరామ్‌రెడ్డి, కామారెడ్డి పట్టణానికి చెందిన శోభను సరిగ్గా పాతికేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఉద్యోగరీత్యా కామారెడ్డిలోనే స్థిరపడ్డాడు. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా జీవించేవారు. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. శోభ ఇంటి వద్దే ఉంటూ కొడుకును చూసుకునేది. దాదాపుగా ఏడెనిమిదేళ్లపాటు హాయిగా ఉన్నారు. విధి వీరి జీవితంలో పిడుగు వేసింది.

అది 2000 సంవత్సరం అక్టోబర్‌ 17వ తేదీ. ఆ దంపతులకు చేదు అనుభవం మిగిల్చిన రోజది. సాయంత్రం ఇంటి డాబా మీద ఏదో పనిచేస్తూ ఉంది శోభ. ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆపరేషన్ల మీద ఆపరేషన్లు చేశారు. ఐదు లక్షలకు పైగా ఖర్చయింది. కానీ విరిగిన వెన్నును మామూలు చేయడం సాధ్యం కాదన్నారు. ఇక ఆమె లేచి నడవడం జరిగేపని కాదని తేల్చేశారు. తనతోపాటు ఏడడుగులు నడిచిన సహధర్మచారిణి ఇక నడవలేదని తెలిసి సిద్ధరామ్‌రెడ్డి తల్లడిల్లిపోయాడు. కన్నీళ్ల పర్యంతమవుతున్న శోభ కన్నీళ్లు తుడిచి తన జీవిత గమనాన్ని పూర్తిగా మార్చుకున్నాడు.

గాయత్రీ షుగర్స్‌ ఫ్యాక్టరీలో అగ్రికల్చర్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహించే సిద్ధరామ్‌రెడ్డి భార్య కోసం తన ఉద్యోగానికి స్వచ్చంద విరమణ చేశాడు. కొంతకాలం పాటు అటు ఉద్యోగానికి వెళ్లడం, తిరిగి వచ్చి ఆమెకు సేవలు చేయడం ద్వారా అలసట తీవ్రమైన అలసటకు లోనయ్యేవాడు. దీంతో ఉద్యోగాన్ని వదిలేసి భార్యతోనే ఉంటున్నాడు. శోభను చేతులతో లేపి వీల్‌చైర్‌లో కూర్చోబెట్టుకుని బయటకు తీసుకెళతాడు. ఒక మోస్తరుగా కోలుకున్న తర్వాత శోభ భర్త వంట చేసి పెడితే తిని కూర్చోవడానికి మనసొప్పడం లేదని, తానే వంట చేస్తానని పట్టుపట్టింది. శోభ మంచం వద్దనే గ్యాస్‌ స్టౌను ఏర్పాటు చేయగా, ఆమె మంచం మీద కూర్చునే వంట చేస్తోంది. భర్త అన్ని సామాన్లను అందిస్తుంటే వంట పెడుతుంది. ఇంటికి ఎవరు వెళ్లినా చాయ్‌ చేసి తాగిన తర్వాత కానీ పంపించదు.

కొడుకుని పెంచి పెద్ద చేశాడు...
శోభకు ప్రమాదం జరిగేటప్పటికి కొడుకు వంశీ సాయికి రెండున్నరేళ్లు. అప్పటి నుంచి కొడుకు ఆలనా, పాలనా అంతా సిద్ధరామ్‌రెడ్డి చూసుకునేవాడు. వంశీ సాయి ఇప్పుడు జలంధర్‌లోని ఎన్‌ఐటీ (నిట్‌)లో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. ఇంజనీరింగ్‌ పూర్తయి ఉద్యోగం సంపాదిస్తే తమకు ఆర్థిక కష్టాలు కూడా తీరుతాయని ఆ దంపతులు ఆశతో ఉన్నారు. ఇంట్లో తల్లి పరిస్థితి, తండ్రి కష్టాలను చూసిన వంశీ పట్టుదలతో చదివి నిట్‌లో సీటు తెచ్చుకున్నాడని వారు చెబుతున్నారు.

అదే నాకు జరిగితే!
మంచానికే పరిమితమైన శోభకు ధైర్యాన్నిస్తూ ఆమెకు అన్నీ తానై సేవలు చేయసాగాడు సిద్ధరామ్‌రెడ్డి. గడచిన పదిహేడేళ్లుగా సపర్యలు చేస్తూనే ఉన్నాడు. భార్య మంచాన పడడంతో బంధువులందరూ ఆయన్ను రెండో పెళ్లి చేసుకోవాలనే సలహా ఇచ్చారు, ఒత్తిడి చేశారు. కాని ఆయన ససేమిరా అన్నాడు. ‘ఆమెకు అలా అయ్యిందని రెండో పెళ్లి చేసుకోమంటున్నారు. అదే నాకు జరిగి ఉంటే ఏమనేవారు’ అని వారిని ఎదురు ప్రశ్నించేవారాయన. భార్య కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు.  జీవచ్ఛవంలా పడి ఉన్న భార్యకు అన్ని సేవలు చేస్తూ ఆత్మసై ్థర్యాన్ని నింపాడు. అవస్థలతో ఈ బతుకే ఎందుకనుకున్న శోభకు మనోధైర్యాన్నిచ్చి ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. శోభ ఇప్పుడు తనలాంటి సమస్యతో నడవలేని వారెందరికో మనోధైర్యాన్నిచ్చే స్థాయికి ఎదిగింది. వెన్ను సమస్యతో మంచం పట్టిన వారి నంబర్లను సేకరించి వాట్సాప్‌ గ్రూప్‌లు క్రియేట్‌ చేసి వారికి ఎప్పటికప్పుడు మనోధైర్యాన్ని నింపుతోంది.

ఆయన త్యాగం గొప్పది
నా వెన్ను విరిగి మంచం పడితే అందరూ ఆయన్ను రెండో పెళ్లి చేసుకోమని వెంట పడ్డారు. కాని ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు. అంతేగాక రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేవరకు ఎన్నో సేవలు చేస్తున్నాడు. ఎంత అలసట ఉన్నా నొచ్చుకున్న సందర్భం ఒక్కటీ లేదు. పదిహేడేళ్లుగా ఆయన నాకు చేసిన సేవలు నాలుగు జన్మలెత్తినా తీర్చుకోలేనివి. మా బాబుని ఆయనే పెంచి పెద్ద చేశాడు. ఎన్ని కష్టాలు వచ్చినా చలించిపోలేదు. నా కోసం ఎన్నో భరించాడు.
– శోభ

అది నా బాధ్యత...
నా జీవితంలోకి వచ్చిన వ్యక్తి కష్టాలపాలైతే ఆమెను అలాగే వదిలేయడం ఎలా? అలాంటి ఇబ్బంది భర్తకు ఎదురైతే భార్యే అన్నీ చూస్తుంది. మరి భార్యకు కష్టం వస్తే చూసుకోవలసింది భర్తే కదా. నేను నా బాధ్యతను నిర్వర్తిస్తున్నా. ఆమె ధైర్యంగా ఉండడమే నాకు సంతోషం.
– సిద్దరాంరెడ్డి, శోభ భర్త

సిద్ధరామ్‌రెడ్డి... పేరు చెప్పగానే తెలిసిన వాళ్లంతా ‘‘ఆయన అందరిలా కాదు. ఆదర్శ భర్త. నేటి తరం ఆయన్ను చూసి నేర్చుకోవాలి’’ అంటారు. భార్యభర్తల బంధం ఇలా ఉండాలి అని నిరూపించిన వ్యక్తి. భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడు–నీడ అంటే అర్థం ఏమిటో ఈ దంపతులను చూస్తే తెలుస్తుంది. వీళ్లను చూస్తే వివాహ బంధం విలువ తెలుస్తుంది.
– సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి

భార్యతో సిద్దరాంరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement