విధిపోవాలి | a real story to veena vani | Sakshi
Sakshi News home page

విధిపోవాలి

Published Wed, Jun 29 2016 10:09 PM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

విధిపోవాలి - Sakshi

విధిపోవాలి

అవును. విడిపోవాలి.
విధి బంధించిన ఈ రెండు మనసులు విడిపోవాలి.
అవును. విడిపోవాలి.
ఈ రెండు ఆకాంక్షల గూళ్లు విడిపోవాలి.
స్వేచ్ఛతో పక్షుల్లా ఎగరాలి.
‘తల’పుల తలుపులు తెరుచుకోవాలి.
వీణావాణీలు రెండు బాటలలో రెండు గమ్యాలు చేరగలగాలి.
అవును. కబంధవిధి ఓడిపోవాలి.
ఇలాంటి విధి.. పోవాలి.

విధిపోవాలి.

 

 

‘‘ఫిబ్రవరి 12 న నా బార్బీ తల ఎక్కడో పోయింది. తెచ్చిస్తారా?’’ వాణి వేసిన ప్రశ్నకి గుండె కలుక్కుమంది. తమాయించుకొని మీ ఇద్దరికీ బార్బీ అంటే అంతిష్టమా? అని అడిగితే.. అతి కష్టంగా తల ఔనన్నట్లుగా. కాదన్నట్లుగా ఊగింది. నిజానికి ఊగాల్సింది వాణి ఒక్క తలే. కానీ రెండు తలలూ ఊపక తప్పలేదు వీణా వాణీలకు. ఎందుకంటే - సమాధానం నోటితో అయితే ఔననో కాదనో చెప్పే వీలుంది. కానీ ఒకే తలతో రెండు భావాలను ప్రకటించడం వారికి అసాధ్యం.

 
‘‘‘నాకైతే డోరెమాన్ అంటే ఇష్టం అని చెప్పాలనుకుంది వీణ. కానీ వాణి తలతో ముడిపడి వున్న తన తల ఆ పనిచేయలేకపోయింది. వాణి కి బార్బీ అంటే పంచప్రాణాలు. తన కి ఎవరో బహుమతిగా యిచ్చిన బార్బీ పాతదైపోయి దాని తల ఎక్కడో ఊడిపోయింది. దాన్నెవరో ఆ గదినుంచి, ఆసుపత్రి ప్రాంగణం నుంచి ఊడ్చి ఎత్తిపారబోసారు. కానీ వాణి గుండెల్లోనుంచి ఆ బార్బీ బొమ్మమాత్రం చెరిగిపోలేదు. తలలేని ఆ బార్బీని తనదగ్గరే దాచుకుంది అపురూపంగా. ఎంత అపురూపం అంటే.. బార్బీ తలను పోగొట్టుకున్న రోజును కూడా గుర్తుపెట్టుకుంది.

 
తలలు ఒక్కటే.. తలపులు వేరు

వీణకి బార్బీ అంటే అంతిష్టమేం లేదు. అదొక్కటే కాదు. వీణకి సిరిమల్లెపువ్వా పాటంటే ప్రాణం, కానీ వాణికి చిరుగాలిలా... నలువైపులా... నీవెంటే ఉంటానులే... ఇష్టం. వీణకి వెనీలా ఐస్‌క్రీం యిష్టం, వాణికి స్ట్రాబెర్రీ యిష్టం. వీణకి బ్లూస్కర్ట్, టాప్ అంటే యిష్టం, వాణికి లాంగ్‌ఫ్రాక్ ఇష్టం. వీణ సైంటిస్ట్ కావాలనుకుంటోంది. వాణి గొప్ప ఇంజనీర్‌గా ఎదిగి వాళ్లిద్దరికీ మధ్య ఉన్న గోడను తొలగించుకుని, తనకిష్టమైన రంగంలో పై చదువులు చదవాలనుకుంటోంది. ఇవే కాదు, ఇంకా ఎన్నో ఇష్టాలు, ఎన్నో భావాలు. ఎన్నెన్నో అభిరుచులు.. ఎన్నెన్నో కథలు, కవితలు, పాటలు, కలలు.  అన్నీ విభిన్నమైనవే కానీ తలొక్కటే అవిభక్తం.

 
ఆసుపత్రితో అటాచ్‌మెంట్

వైద్య శాస్త్ర పరిజ్ఞానానికే సవాల్‌గా మారిన అవిభక్త కవలలు హైదరాబాద్‌లోని నీలోఫర్‌కి వచ్చి అప్పుడే పదేళన్లు గడిచిపోయాయి. తలలు మాత్రమే కలిసి ఉండి, మిగతా శరీర భాగమంతా విడివడి ఉన్న వీరి పోషణ బాధ్యత ప్రభుత్వానిదేనని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. వారి బాధ్యతను నీలోఫర్ ఆసుపత్రికి అప్పగించారు. నాటి నుంచి నేటి వరకు వారి  ఆలనా పాలనా చూస్తున్నది నీలోఫర్ వైద్యులు, ఆ ఆసుపత్రి సిబ్బందే. దాంతో వీణ, వాణిలకు ఆసుపత్రే సర్వస్వం అయింది. దానిచుట్టూనే వారి ప్రపంచం. కథలైనా, బొమ్మలైనా, మాటైలనా, పాటలైనా అన్నీ ఆసుపత్రే.

 
ఒకరికి అనువుగా ఇంకొకరు

ఇంటర్వ్యూ మధ్యలో వాణి టాయ్‌లెట్‌కి వెళ్లాల్సి వచ్చింది. వీణ భుజంపై తట్టడంతో తను అద్దం చేతిలోకి తీసుకుని మెల్లిగా వాణిని అనుసరించింది. అద్దం ఎందుకు? వాణి కాలకృత్యం పూర్తయ్యిందన్న విషయం వీణకు తెలియాలిగా. ఆ అద్దంలో చూస్తూ వాణికి అనుకూలంగా వీణ తనని తాను సర్దుబాటు చేసుకుంటూ తన శరీరం బరువునంతా పక్కకు ఒంచి అలాగే నిలబడుతుంది. అంటే ఒకరు టాయ్‌లెట్ బేసిన్‌పై ఉన్నప్పుడు మరొకరు ఓ పక్కకు ఒరిగి నించొని ఉండాలి. అది ఎంతసేపైనా. దేవుడా! ఎంత నరకం! తలలు రెండూ రెండు భిన్నమైన దిక్కుల్లో ఉంటే ఒకరేం చేస్తున్నారో రెండోవారికి అర్థం కాదు కనుక వీణావాణి శరీరంలో అద్దం కూడా ఒక భాగమయ్యిందిప్పుడు.

 
జీవితంలోని కీలక దశ మొదలైంది!

ఇప్పుడు వీణావాణిలకు 12 ఏళ్లు నిండాయి. వారిలో ప్రకృతి సహజంగా వచ్చే మార్పులను ఎదుర్కోవడం మరో సవాల్‌గా మారింది. యుక్త వయస్సు ఆడపిల్లలకు ప్రారంభం అయ్యే రుతుక్రమం సహజంగా ఇదే వయస్సులో మొదలవుతుంది. ప్రతి స్త్రీ జీవితంలోనూ ప్రకృతి సహజమైన, అనివార్యమైన సమస్య ఇది. ఆ ఐదురోజులూ స్త్రీలు అనుభవించే కష్టాలు కొన్ని సామాజికమైనవైతే, మరికొన్ని వ్యక్తిగతమైనవి, ఆరోగ్యపరమైనవి. ఇకపై వీణావాణిల ఇద్దరి శరీరాలు ఆ రెండింటినీ ఎదుర్కోవడానికి  సంసిద్ధం కావాలి. ఒకరికి ఇష్టం ఉన్నా లేకున్నా తరచూ బాత్‌రూంకి వెళ్తుండాలి. రెండో వారికి అనుకూలంగా మెలగాలి. అంతేకాదు. ఇప్పటివరకు వీణవాణిల పోషణ, విద్యాబుద్ధులు మాత్రమే ఆసుపత్రి బాధ్యత. ఇక యిప్పుడు వారి బాధ్యతకు తోడు భద్రత ప్రధాన సమస్యగా మారనుంది. ఈ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వస్తుంది.

 
విడదీయడానికి 10 కోట్లు!

వీణావాణిలను ఆపరేషన్ చేసి విడదీయడం కష్టసాధ్యం అని తేల్చేసారు యు.కె వైద్యులు. ఆపరేషన్‌కి పదికోట్లు దాకా ఖర్చవుతుందని కూడా యు.కె. వైద్య బృందం అంచనా వేసింది. ఇంతా చేస్తే ఆపరేషన్ సక్సెస్ అవుతుందన్న నమ్మకం లేదు. పాక్షికంగా కానీ, శాశ్వతంగాకానీ వారు కోమాలోనే ఉండే ప్రమాదం కూడా లేకపోలేదంటున్నారు వైద్యులు.

 
వీణావాణిల డైరీలు ఒక్కసారి తిరగేస్తే వారి మనోగతం మనకు కన్నీళ్లు తెప్పిస్తుంది. ఆసుపత్రిని వీడి వెళ్లడం వారికేమాత్రం ఇష్టం లేదు. తమని ఇక్కడినుంచి పంపించేయొద్దని వేడుకుంటూ సూపరింటెండెంట్‌కి లేఖ కూడా రాసుకున్నారు. ఆ గదిలో ఏ కాగితం ముక్క చూసినా అన్నింట్లోనూ ఆసుపత్రి చుట్టూ అల్లుకున్న వారి అనుబంధాలే. ఆ గోడలన్నింటా వారి స్వప్నలోకాలే.

 
నిజానికి కుటుంబం, ప్రభుత్వం, వైద్యులు ఈ ముగ్గురి పర్యవేక్షణలో ఈ పిల్లలుండాలి. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు తమ బాధ్యత నుంచి తప్పుకున్నా వారి జీవితాలు గాలిలో దీపంగా మారే ప్రమాదం వుంది. 

- అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరస్పాండెంట్

 

 

ఎక్కువ కాలం ఇక్కడ ఉంచలేం
వీణావాణీల్లా ఇరాన్‌లో 34 ఏళ్ల తరువాత అవిభక్త కవలల కోరిక మేరకు వారిని విడదీయడంతో వారు చనిపోయిన అనుభవం వైద్యశాస్త్రం ముందుంది. అలాగే బీహార్‌లో కూడా ఇటువంటిదే మరో కేసు వుంది. ఆపరేషన్ రిస్క్‌తో కూడుకున్నది. ఈ పిల్లల్ని మా దగ్గర మరెంతో కాలం కొన సాగించే అవకాశం లేదు. తల్లి దండ్రులు తీసుకెళ్లేందుకు వస్తామన్నారు. తండ్రి ఒక్కరే వారిని చూసుకుంటామన్న అంగీకార పత్రంపై సంతకం చేసి తీసుకొచ్చారు. తల్లి సంతకం కూడా కావాలని అడిగాం. ఎప్పుడో వస్తామన్న వాళ్లు ఇంతకీ రాలేదు. ఏం చేయాలన్న సందిగ్దంలో ఇప్పుడు ఉన్నాం.  - సి.సరేష్ కుమార్,  నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్

 

బాధ్యత ప్రభుత్వానిదే
ఈ పిల్లల్ని స్పెషల్ కేసుగా గుర్తించి బాధ్యతని ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ తీసుకోవాలి. వీరిది ప్రత్యేకమైన కేసుగా చూడాలి. జనరల్ రూల్స్ దీనికి వర్తించవు. ఇటువంటి పిల్లల కోసం స్పెషల్ రూల్స్ పొందుపరచాలి. పిల్లల హక్కులకు భంగం కలగకుండా, వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను ప్రభుత్వమే కల్పించాల్సి ఉంటుంది.  - శాంతా సిన్హా. జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు

 

వీళ్లిక పిల్లలు కాదు
మాది పిల్లల ఆసుపత్రి. పన్నెండేళ్ళు దాటిన ఈ చిన్నారులకు కావాల్సింది పీడియాట్రిషన్ కాదు, ఫిజీషియన్, గైనికాలజిస్ట్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్. వారికి సర్వస్వం మేమే అయి ఇంతకాలం చూసుకున్నాం, కానీ ఇకపై వీరిని ప్రభుత్వం నిర్వహించే చిల్డ్రన్ హోంలో చేర్పించడం మంచిది. కేవలం నాలుగ్గోడల మధ్యే కాకుండా బాహ్య ప్రపంచాన్ని కూడా వీళ్లు చూడగలుగుతారు.- డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్,  నీలోఫర్ ఆసుపత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement