ఆలియా ఇల్లు విడిచిందా?
రణ్‌బీర్ కపూర్ ఇల్లు విడిచి, కత్రినా కైఫ్‌తో కలిసి వేరే ఇంట్లో ఉంటున్నాడని గత సంవత్సరం పుకార్లు షికార్లు చేశాయి. అదెంత వరకు నిజమో తెలియదుగానీ, అందాల ముద్దుగుమ్మ ఆలియాభట్ విషయంలోనూ తాజాగా ‘ఇల్లు విడిచింది’ టైప్ పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. అమ్మా నాన్నలతో కలిసి ఉంటున్న ఆలియా ఆ ఇంటికి కూతవేటు దూరంలోనే కొత్త ఇల్లు ఒకటి ఎంపిక చేసుకుందని, ఇంటీరియర్ డిజైన్‌ను దగ్గరుండి మరీ చూసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఆలియా ఇల్లు ఎందుకు విడిచినట్లు? తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కొత్త ఇంట్లో ఉండబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆలియా పొరపాటున కూడా అలాంటి పని చేయదని తల్లిదండ్రులను నొప్పించేలా వ్యహరించదు అనేవాళ్లూ ఉన్నారు. ‘‘తల్లిదండ్రులతో నివసించడం ద్వారా ప్రేమాభిమానాలు సొంతం అవుతాయి. ఇదొక కోణం. అయితే స్వతంత్రంగా జీవించడం వల్ల బాధ్యతలు తెలిసొస్తాయి. జీవితం పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది’’ అని గతంలో ఆలియా చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడం అవసరం.