అబ్బూరి ఛాయాదేవి వీలునామా | Abburi chayadevi veelunama | Sakshi
Sakshi News home page

అబ్బూరి ఛాయాదేవి వీలునామా

Published Sat, Jun 29 2019 8:16 AM | Last Updated on Sat, Jun 29 2019 8:34 AM

Abburi chayadevi veelunama - Sakshi

ఎంతకాలం బతికామన్నది కాదు. ఎలా బతికామన్నది ఒక జీవితానికి ‘విలువ’ కడుతుంది. ఎంత ఇచ్చామన్నదికాదు. వసుధైక కుటుంబానికి ఏమిచ్చామన్నది విలువ చెబుతుంది.

ప్రముఖ రచయిత్రి, సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి నిన్న శుక్రవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. 2012లో ఆవిడ రాసిన విల్లునామా యథాతథంగా.

ప్రియమైన కొండవీటి సత్యవతి గారికి,
నమస్కారం.
ఇక్కడ చేరగానే సి.ఆర్‌.ఫౌండేషన్‌ వాళ్లు ఒక ప్రింటెడ్‌ అప్లికేషన్‌ ఇచ్చారు. అందులో ఒక కాలమ్‌ –‘‘అత్యవసర పరిస్థితుల్లో సమాచారాన్ని అందించవలసిన వారి పేరు, చిరునామా... అని ఉంటే, మా మరిది డా.గోపాలకృష్ణ పేరు ఇచ్చాను. అతను పూర్తిగా అశక్తుడని తెలుసు. అయినా, నా బాధ్యతగా అతని పేరు ఇచ్చాను. అయితే, నా శరీరాన్ని మాత్రం ‘మోహన్‌ ఫౌండేషన్‌’ వారికి అప్పగించమని రాశాను.

కానీ మళ్లీ, ఇప్పుడు ఈ సంస్థ వాళ్లు వరుసగా అందరి లిస్టూ రూమ్‌ నంబర్‌తో సహా తయారు చేస్తున్నారు. అందులో మళ్లీ ఒక కాలమ్‌ – ‘‘అత్యవసర పరిస్థితిలో సంప్రదించవలసిన వారి పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌’’ అని ఉంది. అందులో ఈసారి మీపేరు ఇవ్వాలనుకుంటున్నాను. లోకల్‌గా ఉంటారు కాబట్టి. మా సుజాత ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇంకెవరూ లాభం లేదు.

నా దగ్గరున్న డాక్యుమెంట్స్‌ అన్నీ ఒక పెద్ద నల్లటి కేన్‌వాస్‌ బ్యాగ్‌ (అరలతో, జిప్పులతో ఉన్నది – సాహిత్య అకాడమీ వాళ్లు ఏదో సదస్సులో ఇచ్చినది)లో పెట్టాను. అది నా అలమారాలో బట్టలున్న భాగం వైపు రెండవ అరలో పెట్టాను. పైన ఒక చిన్న కర్టెన్‌ బట్ట ముక్క కప్పి ఉంటాను. అవసరమైనప్పుడు ఆ బ్యాగ్‌లో ఉన్న డాక్యుమెంట్స్‌ని చూసి కావల్సిన విధంగా వాడే స్వేచ్ఛ మీకు ఉంటుంది. ముఖ్యంగా, బ్యాంక్‌లకు (ఆంధ్రాబ్యాంక్‌ అండ్‌ ఏపీ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌) సంబంధించినదీ, పోస్టాఫీస్‌లో ఉన్న అకౌంటుకి సంబంధించినవీ, కొంత క్యాష్‌తో పాటు నన్ను ఏదైనా హాస్పిటల్లో చేర్పించవలసి వస్తే వాళ్లకి కావల్సిన డబ్బు ఇవ్వడానికి వీలుగా కొన్ని చెక్కుల మీద మీ పేరు రాసి ఉంచుతాను. తక్కినవి మీరు ఫిల్‌అప్‌ చేసుకోవచ్చు.

మీ మంచితనాన్నీ, స్నేహాన్నీ వాడుకోవాలనుకుంటున్నందుకు క్షమించండి. ఆధారపడేందుకు ఇంకెవరూ లేరు. చెన్నైలో ఉన్న బావగారి కొడుకులిద్దరినీ రెండు మూడు ముఖ్యమైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకి నామినీలుగా చేశాను. పోస్టాఫీసులోని అకౌంటు (6 ఏళ్లకి వేసినది)కి మా ఆడబడుచు సుజాతను నామినీగా రాశాను. చిన్న చిన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లని (రెండు బ్యాంకుల్లోనూ) మెచ్యూర్‌ అయినప్పుడల్లా కొండాపూర్‌లోని ఆంధ్రాబ్యాంకుకి మార్చి రెన్యూ చెయ్యడానికి పూనుకున్నాను. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల డాక్యుమెంట్లు అన్నీ ఒక నల్ల పర్సులోనూ, కరెంట్‌ అకౌంట్ల తాలూకు పాస్‌బుక్కులూ, చెక్కుబుక్‌లూ మొదలైనవీ, పోస్టాఫీసుకి చెందిన పాస్‌బుక్కులు, మెరూన్‌ కలర్‌ పర్స్‌లోనూ ఉన్నాయి. క్యాష్‌ లేత ఆకుపచ్చ పర్సులో ఉంటుంది. ఇవన్నీ నల్లటి పెద్ద కేన్‌వాస్‌ బ్యాగ్‌లోని ఒక పెద్ద అరలో పెట్టాను.

ఇదికాక, మరో అరలో ఇల్లు అమ్మిన తాలూకు డాక్యుమెంట్స్‌ పెట్టాను. మరో పెద్ద అరలో, నా చదువు, ఉద్యోగం తాలూకు డాక్యుమెంట్లు, మావారి తాలూకు డాక్యుమెంట్లూ ఉన్నాయి. ఇంకొక అరలో నాకు నచ్చిన, ముఖ్యమైన విలువైన ఉత్తరాలు (కొద్దిపాటి), నా అవార్డుల తాలూకు డాక్యుమెంట్లూ రికార్డ్‌ కోసం దాచి ఉంచాను. వీటన్నిటి బాధ్యతా మీకు అప్పజెబుతున్నాను. నాకు లేని నా కూతురు కన్న మిన్నగా నాపై ఆపేక్ష చూపిస్తున్నందుకు మీపై ఈ బాధ్యత మోపుతున్నాను. అవసరమైనప్పుడు ముందుకొచ్చి, నా విషయమై సహాయపడాలని కోరుకుంటున్నాను. మీకేమైనా సందేహాలుంటే అడగండి. ఈసారి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వాటిని స్వయంగా చూపిస్తాను. నేను నిత్యం వాడే పెద్ద బ్యాగ్‌ (చాక్‌లెట్‌ కలర్‌ది)లో నిత్యం అవసరమయ్యే డబ్బూ, కాగితాలూ పెట్టుకుంటున్నాను.

ఇవి నా బట్టలున్న భాగంలో రెండవ అరలో ఉన్నాయి. వాటిపై ఒక చిన్న బట్ట కప్పి ఉంచాను. ఈ ఉత్తరాన్ని డి.టి.పి. చేయించి ఉంటే బావుండేది. నేను మీకు అఫీషియల్‌గా ఇచ్చిన ఆథరైజేషన్‌ లెటర్‌లా ఉంటుంది. చేయించాలంటే చూడండి. నేను మళ్లీ సంతకం పెట్టి ఇస్తాను. నాకు సంబంధించిన కళాత్మక వస్తువులన్నటినీ అద్దాల అలమారాలతో పాటు ఇక్కడ ఆవరణలో ఉన్న మహిళా శిక్షణాకేంద్రానికి ఇచ్చేస్తున్నట్లూ, నా తదనంతరం అక్కడ భద్రపరచవలసిందనీ, అలాగే నా పుస్తకాలూ మొదలైన వాటిని రీసెర్చి సెంటర్‌లో భద్రపరచమనీ కోరుతూ ‘విల్లు’ రాసి ఈ సంస్థ అధినేతలకి అందజేశాను. మానసికంగా ‘‘ఎవర్‌ రెడీ’’గా, నిత్య ‘ఎవర్‌ గ్రీన్‌’’ గా ఉండాలని నా ప్రయత్నం.
మీ సహకారాన్ని కోరుతూ...
అబ్బూరి ఛాయాదేవి

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ఛాయాదేవి వీలునామా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement