ఆడశిశువుల్ని ఆదరించండి!
సగటున వెయ్యిమంది అబ్బాయిలుంటే అమ్మాయిలు మరో యాభైమంది ఎక్కువగా ఉండాలి. కానీ, హర్యానాలో వెయ్యిమంది అబ్బాయిలకు 830 మంది అమ్మాయిలున్నారు.
పోను పోనూ అమ్మాయిల సంఖ్య ఇంకా తగ్గిపోతోంది. కారణం... భ్రూణహత్యలు. ఆడశిశువనగానే పురిట్లోనే ప్రాణం తీసేవారి కారణంగా అమ్మాయిల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. ఇది అందరినీ ఆలోచనలో పడేసే సమస్యే అయినా ఎవరూ పట్టించుకోని విషయంగా మారిందక్కడ.
బ్రేక్‌త్రూ’ అనే స్వచ్ఛంద సంస్థ అక్కడ అమ్మాయిల సంఖ్యను పెంచడం కోసం చాన్నాళ్ల నుంచి కృషి చేస్తోంది. ప్రభుత్వంతో కలిసి బోలెడన్ని కార్యక్రమాలు చేసి ప్రజల కళ్లు తెరిపించే పనిచేసింది. ఏం లాభం...ఆడపిల్లల సంఖ్య పెరగడం లేదు. ఇక లాభం లేదని వీధి నాటకాలను మార్గంగా ఎంచుకుంది. ఇంటింటికీ తిరిగి చెప్పినా విషయం ఒంటబట్టనివారికి నాటకం కళ్లు తెరిపిస్తుందేమోనని ఓ ప్రయత్నం చేశారు. రంగస్థల కళాకారుల సహకారంతో బస్టాపుల్లో, రచ్చబండల దగ్గర, స్కూలు కాంపౌండ్లలో, కాలేజీ గేటు దగ్గర, కిరాణా షాపుల ముందర...ఎక్కడ నలుగురూ చేరతారో ఆ ప్రదేశాన్నే వేదికగా చేసుకుని ‘బ్రేక్‌త్రూ’ సంస్థ నాటకాల ప్రదర్శన ఏర్పాటు చేయసాగింది. ఆడశిశువుల్ని ఆదరించాలంటూ ఆలోచన రేపింది.
నాలుగు జిల్లాల్లో...
జజ్జర్, సోనేపట్, పానిపట్, రోహ్‌తక్ జిల్లాల్లో ఇప్పటివరకూ వందకుపైగా నాటకాల ప్రదర్శన జరిపారు. ఈ స్వచ్ఛందసంస్థకు సాయంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు కూడా ముందుకొచ్చి ప్రజలకు తమ సందేశాలను వినిపించారు. మాటలకన్నా నాటకమే మేలనుకున్న ‘బ్రేక్‌త్రూ’ సంస్థ ఆలోచనకు మంచి స్పందన లభించింది.
నాటక ప్రదర్శన పూర్తవ్వగానే తమ చుట్టుపక్కల ఆడపిల్లలకు జరిగిన అన్యాయాల గురించి ప్రజలు చెప్పుకొచ్చిన కథనాలే దానికి నిదర్శనం. అమ్మాయిలు లేకపోతే భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో నాటకరూపంలో చెప్పడంలో రంగస్థల నటులు నూటికి నూరుపాళ్లు విజయం సాధించారని ప్రభుత్వ అధికారులు కూడా ఒప్పుకున్నారు.