
సాక్షి, న్యూఢిల్లీ : యోగాతో ఒనగూరే ప్రయోజనాలపై పలు అథ్యయనాలు వెల్లడించగా తాజాగా రోజూ యోగా చేస్తే వీర్యకణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఎయిమ్స్ నిర్వహించిన అథ్యయనం పేర్కొంది. ఎయిమ్స్‌కు చెందిన శరీరనిర్మాణ శాస్త్ర విభాగం నిపుణులు చేపట్టిన ఈ సర్వే నేచర్ రివ్యూ యూరాలజీ పత్రికలో ప్రచురితమైంది. వీర్యకణాల డీఎన్‌ఏ దెబ్బతినడంతో సంతాన సాఫల్యంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనిచ్చేందుకు వీర్యకణాల్లో జన్యుపరమైన నాణ్యత కీలకమని ఎయిమ్స్, అనాటమీ విభాగానికి చెందిన డాక్టర్ రీమా దాదా పేర్కొన్నారు.
డీఎన్‌ఏ దెబ్బతినేందుకు శరీరంలోనిఆక్సిజన్ సామర్ధ్యం, రాడికల్ లెవెల్స్‌ల మధ్య సమతుల్యత లోపించడంతో ఆక్సిడేటివ్ ఒత్తిడికి దారితీయడమే కారణమని విశ్లేషించారు. జీవనశైలి మార్పుల ద్వారా వీటిని నిరోధించవచ్చని చెప్పారు. నిత్యం యోగా చేయడం ద్వారా పురుషుల్లో సంతానలేమిని తగ్గించవచ్చన్నారు. యోగాతో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించుకోవచ్చని, డీఎన్‌ఏ దెబ్బతినకుండా కాపాడుకోవచ్చన్నారు.
ఆరు నెలల పాటు యోగ అభ్యసించిన 200 మంది పురుషుల పై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయన్నారు. వీరిలో డీఎన్‌ఏ నాణ్యత మెరుగుపడినట్టు, ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గుముఖం పట్టినట్టు తాము గమనించామన్నారు. నిత్యం యోగా చేసే వారిలో కుంగుబాటు, ఒత్తిడి, ఉద్వేగాల తీవ్రత అదుపులోకి వచ్చినట్టు గుర్తించామని ఆమె చెప్పారు. ఫ్రీ రాడికల్ స్థాయిలను తగ్గించి డీఎన్‌ఏ విచ్ఛినం కాకుండా యోగా నిరోధిస్తుందని తెలిపారు.