లండన్ : వాయు కాలుష్యం మానవాళి ఆయుఃప్రమాణాన్ని గణనీయంగా తగ్గిస్తోందని తాజా అథ్యయనం హెచ్చరించింది. కాలుష్యంతో ప్రపంచ జనాభా జీవనప్రమాణ కాలం రెండేళ్లు తగ్గుతోందని స్పష్టం చేసింది. కాలుష్యం కోరలు చాచడంతో అమెరికా, యూరప్‌ల్లో ప్రస్తుతం జన్మించే చిన్నారుల జీవనకాలం సగటున నాలుగు నెలలు తక్కువ కాగా, భారత్, ఈజిప్ట్ వంటి దేశాల్లో రెండేళ్ల వరకూ ఉంది. భారత రాజధాని న్యూఢిల్లీ, ఈజిప్ట్ రాజధాని కైరో ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
గతంలో చేపట్టిన పరిశోధనలు వాయు కాలుష్యంతో ఎంతమంది మరణించారనే దానిపై దృష్టి సారించగా, జీవనకాలంపై అంచనా వేయడం ఈ పరిశోధన ప్రత్యేకమని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ బృందం వెల్లడించింది. పీఎం 2.5 నుంచి వాయుకాలుష్యంపై అథ్యయన బృందం పరిశోధనలు చేపట్టింది. వాయు కాలుష్యం కారణంగా విడుదలయ్యే ధూళి శరీర భాగాల్లోకి చేరడంతో ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యంపై పెనుప్రభావం చూపుతాయని, ఆస్త్మా వంటి వ్యాధులతో బాధపడేవారి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని అథ్యయనం వెల్లడించింది.
ఈ తరహా కాలుష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది మృత్యువాతన పడుతున్నారని డబ్ల్యూహెచ్‌ఓ అంచనాలు వెల్లడిస్తున్నాయి. వాయుకాలుష్యాన్ని తగ్గించడం ద్వారా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్‌లను నివారించి జీవనకాలం పెంచవచ్చని పరిశోధకలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment