కన్నడ బుల్లితెర మీద వెలుగుతూ తమిళంలో తన దైన ముద్ర వేసుకున్న ఐశ్వర్య తెలుగు చిన్న తెరమీదా గుర్తింపు తెచ్చుకుంటున్న నటి. స్టార్ మాటీవీ ‘అగ్నిసాక్షి’ సీరియల్‌లోని ‘గౌరి’ పాత్రలో అందంగా ఇమిడిపోయిన ఐశ్వర్య చెబుతున్న విషయాలు..
తెలుగు ‘అగ్నిసాక్షి’ సీరియల్ కన్నడలో ‘సర్వమంగళ మాంగల్యే’పేరుతో వస్తుంది. ఈ రెండు సీరియల్స్‌లో ‘గౌరి’ పాత్ర నాదే. ఏడాదిన్నరగా ఈ సీరియల్స్‌లో నటిస్తున్నా. గౌరి పాత్రకు న్యాయం చేస్తున్నాను అని చాలా హ్యాపీగా ఉంది. గౌరీ–శంకర్‌ల రొమాన్స్ సీన్లు కూడా ఇందులో ఉంటాయి. భైరవి అల్లరిపిల్ల అనిపించుకుంటూనే ఏదైనా ఒక విషయం తన దృష్టికి వచ్చిందంటే వదిలేయని తత్వం గలదానిగా ఉంటుంది. అల్లరితో పాటు నేర్పు కూడా ఉంటుంది. ఉమన్ ఎంపవర్‌మెంట్ గురించి ఈ సీరియల్‌లో నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఈ క్యారెక్టర్ నుంచి చాలా నేర్చుకున్నాను.
నాటకం నుంచి టీవీకి
ఉండేది బెంగుళూరు. బాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ చేశాను. అమ్మ పుష్పాంజలి హౌజ్‌వైఫ్. మా అమ్మ వల్లే ఈ ఫీల్డ్‌కి వచ్చాను. నాన్నగారు అశ్వనికుమార్ అడ్వకేట్. అమ్మనాన్నలకు ఒక్కతే కూతురును. టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఒకసారి థియేటర్ క్లాస్‌కి వెళ్లాను. అంతకుముందు నాకు ఈ ఫీల్డ్ అంటే ఐడియా లేదు. అయితే, టీవీలో సీరియల్స్ చూసేదాన్ని. అందులోని క్యారెక్టర్స్‌ని ఇమిటేట్ చేస్తుండేదాన్ని. థియేటర్ ఆర్ట్స్ వల్ల కన్నడ సీరియల్ ‘అనురూప’లో అవకాశం వచ్చింది.’ తర్వాత రెండు కన్నడ సినిమాలోనూ నటించాను. ‘గిరిజా కళ్యాణ్’ అర్క మీడియాలో చేయడంతో ఇటు తెలుగుకు పరిచయం అయ్యాను.
తప్పులే మాట్లాడా!
ఇక్కడ భాష రాక మొదట్లో మాట్లాడడం కష్టం అనిపించేది. కానీ, త్వరగానే నేర్చేసుకున్నాను. భాష రాదు అనుకుంటే అస్సలు రాదు. తప్పులైనా పర్వాలేదు ఇక్కడ వాళ్లే కరెక్ట్ చేస్తారు అని మాట్లాడుతూ ఉండేదాన్ని. అలా తెలుగు నేర్చేసుకున్నా. తమిళ సీరియల్ చేసినప్పుడు అక్కడ తమిళ్ నేర్చుకున్నాను.
మంచి ప్లాట్ ఫామ్
ఇక్కడి ఆడియన్స్ బాగా సపోర్ట్ చేస్తుంటారు. ‘అగ్నిసాక్షి’లోని గౌరి క్యారెక్టర్ గురించి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో నాకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. మంచి ప్లాట్‌ఫామ్ దొరికింది. చక్కగా ఉపయోగించుకోవాలని అనుకుంటాను. బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివినప్పటికీ వ్యాపార ఆలోచనలేవీ లేవు. నా భవిష్యత్తు టీవీ ఇండస్ట్రీనే.
సపోర్ట్ చేస్తే చాలు
మన ప్రతి అడుగు దేవుడే డిసైడ్ చేస్తాడు అని నమ్ముతాను. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజిస్తాను. నాకు కాబోయే భర్తలో నా ప్రొఫెషన్‌ని సపోర్ట్ చేయడంతో పాటు ఇది ఎందుకు చేశావు అనకుండా ఉంటే చాలు అనుకుంటున్నాను. ఖాళీ సమయం దొరికితే షాపింగ్‌లో దూరిపోతాను. బట్టలను కొనుగోలు చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకాస్త ఖాళీ దొరికితే నిద్ర పోతాను.
స్పష్టత ముఖ్యం
ఈ రంగంలో నిలదొక్కుకోవాలంటే ‘ఎవరి ద్వారా వస్తున్నాం’ అనే స్పష్టత ఉండాలి. ఏం వర్క్ చేస్తున్నారో ఆ పని మాత్రమే చూసుకోవాలి. వర్క్‌లో ఎంత ఇన్‌వాల్వ్ అయి చేస్తామో అది అంతగా భవిష్యత్తుకు పనికి వస్తుంది. ముఖ్యంగా పొగరు చూపించకుండా ఉంటే ఇక్కడ మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ ఒక వారం, బెంగుళూరులో ఒక వారం సీరియల్ ప్రాజెక్ట్స్‌లో పాల్గొంటూ ఉంటాను. నాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
Comments
Please login to add a commentAdd a comment