అందరూ నీవారే!
ప్ర : గురుదేవా, నా తల అనేక ఆలోచనలతో నిండిపోయి ఉంది. ఏం చేయాలో తెలియకుండా ఉంది. ఏదైనా సలహా చెప్పండి.
జ : నీ తల అనేక ఆలోచనలతో నిండిపోయి ఉంటే, నేలపై పడుకొని దొర్లు. నీ శరీరంలో రక్తప్రసరణ మెరుగవటం గమనిస్తావు. రక్తప్రసరణ మెరుగైనపుడు నీకు కొంచెం బాగా అనిపిస్తుంది. ఈ కారణం చేతనే పూర్వం శయన ప్రదక్షిణం (అంగ ప్రదక్షిణం) చేసేవారు. ఒకసారి అనుభవించి, నీ బుద్ధిలో కలిగే మార్పును గమనించు. నీలోని భయాలు, ఆందోళన అన్నీ మాయమౌతాయి.
ప్ర : యువత రాజకీయాలలోకి రావాలంటారా?
జ : తప్పకుండా రావాలి. నేను దీనిని సమర్థిస్తాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తరపున (ఒరిస్సాలోని) భువనేశ్వర్‌లో కాలేజ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (మెరుగైన పరిపాలనా దక్షతను నేర్పే కళాశాల) ప్రారంభించాము. రాజకీయాలలో చేరి దేశసేవ చేద్దామనుకునే యువత అందులో చేరవచ్చు. యువత ఆలోచనా పరిధిని పెంచి, దేశంకోసం మెరుగ్గా ఆలోచించేలా అక్కడ శిక్షణనిస్తారు.
ప్ర: గురుదేవా, అహంకారాన్ని వదిలేయడం ఎలా?
జ : అహంకారాన్ని వదిలేయాలని ఎందుకు అనుకుంటున్నావు. దాన్ని కేవలం ఒక పక్కన ఉంచు. దానితో పోట్లాడకు, అంతే! మనం చాలాసార్లు, మనకు బాధ కలిగిస్తుంది కాబట్టి అహంకారాన్ని వదిలేయాలనుకుంటాం. అయితే ఈ అహంకారాన్ని వదిలేయాలనే కోరిక అహంకారాన్ని మరింత పెంచుతుంది. అహంకారాన్ని జయించాలంటే సహజంగా ఉండటమే అత్యంత సులభమైన మార్గం. అందరూ నీవారే అని తెలుసుకో చాలు.
ప్ర : సమాజంలో నేడు మత్తుపానీయాల వాడకం చాలా హెచ్చుగా ఉంది. దీన్ని అరికట్టే మార్గం ఉందా?
జ: అంతకన్నా చాలా ఎక్కువ మత్తు కలిగించే సత్సంగానికి వారిని తీసుకురండి. వారి చెడు అలవాట్లు అన్నీ మరిచిపోయేంత మత్తును (ఆధ్యాత్మిక జ్ఞానాన్ని) నేను వారికి ఇస్తాను. ఆధ్యాత్మికమార్గంలోకి వచ్చిన అనేకమంది ధూమపానం, తాగుడు, ఇతర చెడు అలవాట్లను వదలి మంచి మార్గంలోకి మళ్ళారు. కాబట్టి అటువంటి అలవాట్లు ఉన్నవారిని అసహ్యించుకోకండి. వారిని బుజ్జగించి సత్సంగానికి తీసుకురండి. వారిలో తప్పక మార్పు రావటం మీరు చూస్తారు. ఒకసారి దైవం పట్ల భక్తి, గాఢమైన ప్రేమ కలిగినవారు ఇక వెనుకకు మళ్ళటమంటూ ఉండదు.
ప్ర : గురువుతో నా సంబంధం అనేక జన్మలవరకూ శాశ్వతంగా ఉంటుందా? అనేక జన్మలనుండీ మేము ఒకే గురువుతోనే ఉన్నామా?
జ: నీ ప్రయాణాన్ని ఈ ఒక్క జన్మతోనే ఎందుకు పూర్తిచేయవు? వాయిదా ఎందుకు వేస్తున్నావు? నన్ను బుట్టలో పడేద్దామని ఈ చిక్కుప్రశ్న అడిగావు. ఈ జన్మలో నువ్వు చేయాల్సిన పని సరిగ్గా పూర్తిచేయి. వచ్చే జన్మలో మరలా అవకాశం ఉంటుందిలే అని, ఈరోజు పనిని వాయిదా వేయకు. వచ్చే జన్మలో నీవు ఎలా పుడతావో ఎవరికి తెలుసు? ఏ పశువులకొట్టంలోనో ఆవుగా పుట్టవచ్చు. కాబట్టి వచ్చే జన్మకోసం పనులను వాయిదా వేయకు.
శ్రీశ్రీ రవిశంకర్
నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్