వాహనం అనేది ఒకచోటు నుండి మరోచోటికి ప్రయాణించడానికి ఉపయోగించేదని సామాన్యార్ధం. నిజానికి వాహనం అంటే మోసేదని అ ర్ధం. దేవుడిని మోసేది దేవతా వాహనం. ఈ ఆత్మ ఆ పరమాత్మలో కలిసే వరకు మన శరీరం ఈ జీవాత్మకు వాహనం. ఉత్సవాల్లో దేవతా విగ్రహాలను ఊరేగిస్తారు. నిజానికి అది ఊరేగింపు కాదు. ఊరుకి ఎరిగింపు. దేవుడు వస్తున్నాడని ఊరుకు తెలియజేయడం. సాధారణంగా దేవతావాహనాలు ము ఖ్యంగా భక్తరూపాలే అయ్యుంటాయి. అవే ఆ దే వుళ్లకు ముఖ్యవాహనాలవుతాయి.
శివుడికి అధికారనంది, వృషభం... విష్ణువుకు గరుడుడు.. వినాయకుడికి మూషికం.. సుబ్రహ్మణ్యస్వామికి మయూరం.. అమ్మవారికి సింహవాహనం.. అయ్యప్పస్వామికి గజం.. ఇలా ఇవన్నీ జంతు ప్రవృత్తికి చెందినవైనా.. భగవంతుణ్ణి అఖండ భక్తిభావంతో కొలిచి.. చివరికి దేవుణ్ణి ఎక్కడికైనా తీ సుకెళ్లగలిగే శక్తి గల వాహనంగా మారారు. ‘భగవంతుని జయించడానికి భక్తికి మించిన ఆయుదం లేదు‘ అనే ఈ సత్యాన్ని ఊరుకి ఎరిగింపు చే యడానికి భగవంతుడు ఆ వాహనాలపై విచ్చేసి భక్తులకు దర్శనమిచ్చి వారి పూజలందుకుంటాడు.
ఆలయంలో ఉత్సవవేళలో దేవుడు సంచరించే వాహనాలన్నింటినీ ఓ మండపంలో ఉంచుతారు. దాన్ని వాహనసేవా మండపం అంటారు. ఆ మండపంలో వాహనాలన్నింటినీ దర్శించిన భక్తులకు మనసులో ఏదో తెలియని ఒక అనుభూతి కలుగుతుంది. సహజంగానే వాటికి నమస్కరిస్తారు. కాసేపు కూర్చుంటారు. అప్పుడు ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సింది భక్తిని అలవరచుకోవడం. ఏ ఆలయంలో వాహనాలన్నీ ఉండి..ఉత్సవాలన్నీ చక్కగా జరుగుతాయో.. ఆ ఆలయం మహిమాలయం అవుతుంది.
శివాలయంలో వృషభం, అధికారనంది, భూత, కైలాస, రావణ, పురుషమృగ, హంస, మకర, విమాన, రంగ, శిబికా మొదలైన వాహనాలుంటే.. విష్ణ్వాలయంలో గరుడ, ఆంజనేయ, శేష, సూర్యప్రభ, చంద్రప్రభ, అశ్వ, హంస, ఆందోళికా, గజ, హంస, కల్పవృక్ష, ముత్యాలపందిరి ఉంటాయి. ఇటువంటి వాహనాలసంఖ్య దాదాపు ఇరవైకి పైగా ఉంది. వాహనాలను దర్శించి.. భక్తిని అలవర్చుకుని..ఈ మానవజన్మను చరితార్థం చేసుకుందాం.
– కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య
ఆగమ, శిల్పశాస్త్ర పండితులు
Comments
Please login to add a commentAdd a comment