భక్తజన సందోహం మధ్య శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ప్రభోత్సవం
సాక్షి నెట్‌వర్క్: ‘హరహర మహాదేవ.. శంభోశంకరా..’ అంటూ మంగళవారం రాష్ట్రం ప్రతిధ్వనించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముక్కంటి దర్శనానికి రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఏ నోట విన్నా శివనామ స్మరణే వినిపించింది. అభిషేకాలతో భక్తవశంకరుడిని ప్రసన్నం చేసుకున్నారు. పలుచోట్ల పరమేశ్వరుడిని మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేదీప్యమానంగా జరిగాయి. శ్రీగిరి క్షేత్రం జనసంద్రమైంది. నల్లమల కొండలు శివనామ స్మరణతో పరవశించాయి. మల్లన్న, భ్రామరీలకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మంగళవారం రాత్రి శివపార్వతుల కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పరిమళభరిత పుష్పాలతో అలంకరించిన స్వామి, అమ్మవారు.. వేదమంత్రాల నడుమ ఒక్కటయ్యారు. ఆదిదంపతుల కల్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు హరోంహరా.. శంభో.. శివశంకరా అంటూ పరవశించారు.
నీలకంఠుడికి పాగాలంకరణ
శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో శివుడి లింగోద్భవ సమయంలో నిర్వహించే పాగాలంకరణ ప్రత్యేకం. రాత్రి 10 గంటల నుంచి పాగాలంకరణ ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన చేనేత కార్మికుడు పృధ్వీ వెంకటేశ్వర్లు పాగాలంకరణ చేశారు. పండితులు, ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా జ్యోతిర్లింగ మల్లికార్జునుడికి లింగోద్భవకాల మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకానికి శ్రీకారం చుట్టారు. వెంటనే దేదీప్యకాంతులతో కనువిందుచేసిన విద్యుద్దీపాలను ఆపేశారు. క్షణాల్లో శంభో శివశంభో.. ఓం నమఃశివాయ అంటూ భక్తుల శివనామస్మరణ నలుమూలల నుంచి మిన్నంటింది.
పృధ్వీ వెంకటేశ్వర్లు స్వామి గర్భాలయ విమాన గోపురాన్ని, ముఖమండపంపై ఉన్న 14 నందులను కలుపుతూ పాగాలంకరణ చేశారు. అనంతరం వెలిగిన విద్యుద్దీపాల కాంతుల్లో పాగాలంకరణ భక్తులను కనువిందు చేసింది. అనంతరం కల్యాణోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం నిర్వహించిన ప్రభోత్సవం కనులపండువగా సాగింది. లక్షలాదిగా భక్తులు వచ్చిన వాహనాలతో శ్రీశైలంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఔటర్ రింగ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు నిండిపోవడంతో అనేక వాహనాలను రోడ్డుమీదే నిలపాల్సి వచ్చింది. దీంతో మంగళవారం రాత్రి 7 గంటల నుంచి తెలంగాణలోని మన్ననూరు ఫారెస్ట్ చెక్‌పోస్ట్ నుంచి శ్రీశైలానికి వచ్చే వాహనాలను నిలిపేశారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో..
శ్రీకాళహస్తీశ్వరాలయం మంగళవారం తెల్లవారుజామున మూడుగంటల నుంచే భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి రాత్రి వరకు శాస్త్రోక్తంగా అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవారు ఇంద్రవిమానం–చప్పరంపై ఊరేగారు. రాత్రి స్వామి నంది వాహనంపై, అమ్మ సింహ వాహనంపై నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మంగళవారం అర్ధరాత్రి తరువాత ఒంటిగంట నుంచే దేవస్థానంలో లింగోద్భవ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం పదిగంటలకు రథోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
భక్తజనసంద్రంగా కోటప్పకొండ
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ భక్తులతో పోటెత్తింది. త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. 17 భారీ విద్యుత్ ప్రభలు తరలివచ్చాయి. స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పట్టువస్త్రాలు, వెండిప్రభను సమర్పించారు. త్రికోటేశ్వరస్వామిని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సోమయాజులు, జస్టిస్ కృష్ణమనోహర్, జస్టిస్ పద్మావతి దర్శించుకున్నారు. పంచారామమైన అమరావతిలోని శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో స్వామికి ఏక రుద్రాభిషేకాలను, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు.
రామతీర్థంలో..
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థానికి భక్తులు పోటెత్తారు. వైష్ణవాలయమైనా ఏటా మాదిరే శివరాత్రికి భక్తులు హాజరై శ్రీరాముడిని, పక్కనే ఉన్న ఉమాసదాశివుడిని పూజించారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బోడికొండపై శిఖరజ్యోతి వెలిగించారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగంలో భక్తులు పోటెత్తారు. వైఎస్సార్ జిల్లాలోని శైవక్షేత్రాల్లో అభిషేకాలు, పూజలు చేశారు.
పంచారామక్షేత్రాల్లో..
ఉభయ గోదావరి జిల్లాల్లోని పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామ, భీమారామ, క్షీరారామ, కుమారభీమారామాల్లో పరమశివుడిని, అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో శ్రీ ఉమాకుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవిలను, శక్తిపీఠమైన పురుహూతిక అమ్మవారికి భక్తులు పూజలు చేశారు. వీరంపాలెంలోని శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠంలో స్పటిక లింగానికి నిర్వహించిన పూజల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి పాల్గొన్నారు.
విశాఖలో మహాకుంభాభిషేకం
మహా శివరాత్రిని పురస్కరించుకొని టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖ సాగరతీరంలో మంగళవారం 37వ మహాకుంభాభిషేకం ఘనంగా జరిగింది. శారదా పీఠా«ధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచామృతం, సుగంధద్రవ్యాలు, పళ్లరసాలతో కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు మహాకుంభాభిషేకం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment