‘మేరీ జిందగీ’ రాక్ బ్యాండ్ వ్యవస్థాపకురాలు జయా తివారి (మధ్యలో), బృంద సభ్యులు
రాక్ బ్యాండ్ అనగానే వాయిద్య పరికరాలతో స్టెయిల్‌గా అబ్బాయిలు కళ్లముందు నిలిస్తే నిలిచారు గానీ.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన జయ తివారీ ‘మేరీ జిందగీ’ పేరుతో తొమ్మిదేళ్ల క్రితమే మహిళా రాక్ బ్యాండ్‌ను ఏర్పాటు చేశారు. జయతో పాటు మరో నలుగురు బృందంగా కలిశారు. మహిళల సమస్యల మీద మహిళలే సాహిత్యాన్ని సంగీతంతో జత కలిపి జయహో అనిపిస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటి మహిళా మిషన్ బ్యాండ్‌గా పేరొందిన ఈ షీ రాక్ టీమ్ త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వబోతోంది.
మహిళల సామాజిక సమస్యలపై జయ బృందం సంధిస్తోన్న అస్త్రం ‘మేరీ జిందగీ’. రాక్ సాంగ్స్‌తో ప్రజల్లో చైతన్యం తెస్తోంది. ‘మేం పాట ద్వారా చూపే సమస్యలు మహిళలనే కాదు, మగవారినీ ప్రభావితం చేస్తాయి. అందుకే మా బృందానికి చాలా మంది పురుష మద్ధతుదారులూ ఉన్నారు. మా బృందం ఆశయం లింగసమానత్వం ఒక్కటే కాదు. అణచివేతలను సమాజంలోంచి పూర్తిగా తొలగించడం కూడా’ అంటోంది ఈ రాక్ బ్యాండ్. ఇందులోని వారంతా సాధారణ మధ్యతరగతి మహిళలే. తెల్లవారుఝామునే మేల్కొని ఉదయం ఏడున్నర లోపు తమ రాక్‌బాండ్ సెషన్‌ను ముగించుకుంటారు. ఆ తర్వాత ఉద్యోగాలు, కాలేజీలంటూ ఎవరి పనుల్లో వాళ్లు పరిగెడతారు.
రాక్‌తో షేక్
ఉన్న సమయంలోనే తమ కోసం కొంత కేటాయించుకొని రాక్‌బ్యాండ్‌తో పాటకు ప్రాణం పోస్తారు జయ అండ్ కో. ఆ పాటలు ఫేస్‌బుక్, యూ ట్యూబ్ ద్వారా రిలీజై అత్యంత ప్రజాదరణను పొందుతున్నాయి. ‘మైరి మేరా బైహ్ నా రాచన...’ అనే పాటలో కూతుళ్లు పెరిగే దశలోనే పెళ్లి అనకుండా వారి కలలకు అవకాశం ఇవ్వమని తల్లులను తమ పల్లవులతో అడుగుతారు. ‘డ్రీమింగ్ కే ప్రెజర్ కుక్కర్ కి సీతీ కో బజ్నే దో..’ అనే పాట అమ్మాయిలను తమను తాము నమ్ముకోమని చెబుతుంది.
భ్రూణ హత్యలపై ‘తేరి గాలియోన్ మెయిన్ నా అయేంగే కబీ ఈజ్ రాత్ కే బాద్, మా, మేరీ మా..’ అనే వారి హృదయ స్పందన విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ పాట మహిళా సాధికారత కోసం పనిచేస్తున్న రాష్ట్ర మహిళా సమాఖ్య, యునిసెఫ్, బిబిసి మీడియా యాక్షన్, బ్రేక్ త్రూ, వాటర్ ఎయిడ్ ఇండియా.. వంటి సంస్థల నుండి ఆహ్వానాలు అందుకునేలా చేసింది. ఈ ప్రోత్సాహంతో ‘మేరీ జిందగీ’ త్వరలోనే దేశవ్యాప్త ప్రదర్శనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
వంట గిన్నెలే వాయిద్యాలు!
సంగీతం అంటే ప్రాణం పెట్టే నిహారికా దుబే జయ బృందంలో ఒకరు. ‘‘మొదట్లో నేను జయను కలిసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉండేది. మ్యూజిక్ నేర్చుకునేవారంతా బాలికలే. కానీ, ఒకే ఒక్క గిటార్ ఉండేది. మ్యూజిక్ క్లాస్‌కు వచ్చే వారంతా స్పూన్లు, గిన్నెలు, గ్లాసులు, ప్లేట్లు, పట్టుకారు.. ఇలాంటి వాటితోనే ప్రాక్టీస్ చేసేవాళ్లం. కానీ అమ్మాయిలెవరూ ఒక్క రోజు కూడా క్లాస్ మిస్ చేసేవాళ్లు కాదు. పార్కుల్లోనూ ప్రాక్టీస్ ఉండేది. నెమ్మదిగా ప్రజలు మా బృందాన్ని గమనించడం ప్రారంభించారు’’ అని చెబుతుంది నిహారిక.
బాలికల విద్యకు సహకారం
‘‘ఇంతవరకు ఇలా మహిళల కోసం పనిచేసే బృందం నాకు మరొకటి కనిపించలేదు. మహిళల కోసం మహిళలే కదిలే ఈ బృందంతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అంటోంది పదిహేడేళ్ల అనామిక ఝుంఝున్‌వాలా. అత్యంత పిన్నవయస్కురాలైన డ్రమ్మర్‌గా అనామిక పేరొందింది. అనామిక ఎనిమిదేళ్ల వయసు నుంచి ఈ బృందంతో కలిసి డ్రమ్స్ వాయిస్తోంది. గిటారిస్ట్ పూర్వి మాల్వియా, గాయకురాలు సౌభాగ్య, స్వస్తిక వంటి ఇతర సంగీతకారులూ ఈ బృందంలో ఉన్నారు.
ఈ ముగ్గురూ ఇటీవలే పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో చేరారు. అయినా ‘మేరీ జిందగీ’ బృందంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ మహిళా పోలీసు విభాగానికి 70 పాటలను కంపోజ్ చేసింది ఈ షి రాక్ బ్యాండ్. రాక్ బ్యాండ్ షోస్ ద్వారా వచ్చే డబ్బుతో వీరు నిరుపేద బాలికల విద్యకు సహకారాన్ని అందిస్తున్నారు. ‘‘మహిళా లోకాన్ని జాగృతం చేయగలం అనే నమ్మకాన్ని ఈ బ్యాండ్ మాకు కలిగించింది. ఇక ఇదే మా జీవితం అంటోంది’’ దృఢంగా ఈ సంగీత, సాహిత్య, సంఘహిత బృంద సభ్యులు.
– ఆరెన్నార్
మొదటన్నీ ఖాళీ కుర్చీలే
తొలినాళ్లలో ఇంటి మేడ పైనే సృజనాత్మక చర్చలు : ‘మేరీ జిందగీ’ టీమ్
2010లో లక్నోలో మొదటిసారి జయ ఈ రాక్‌బ్యాండ్‌ను ప్రారంభించినప్పుడు.. ఎవరూ దీనిని పట్టించుకోలేదు. ప్రదర్శనకు ప్రేక్షకులను రాబట్టడమే పెద్ద కష్టమైందని అంటారు ఆమె. ‘‘ఖాళీ కుర్చీలు మమ్మల్ని వెక్కిరించేవి. చాలా బాధగా అనిపించేది. బాధ్యతను భుజానికెత్తుకున్నప్పుడు అది ఎంత బరువైనా దించకూడదు అనుకున్నాం. బ్యాండ్‌కు అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడానికి డబ్బులేదు. కానీ, మేం మా ఆశను కోల్పోలేదు. ఒక్కో వాయిద్య పరికరాన్ని కొనుగోలు చేసుకుంటూ వచ్చాం. తొమ్మిదేళ్లుగా మేం చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు మహిళా విద్య, సమానత్వం, గృహహింస, భ్రూణ హత్యలను పాటలుగా ఎలుగెత్తి పాడే ఏకైక రాక్ బ్యాండ్ ‘మేరీ జిందగీ’ అయినందుకు చెప్పలేనంత సంతోషంగా ఉన్నాం’’ అంటారు జయ తివారి. సంగీతంలో పీహెచ్‌డీ చేసిన జయ ఐదేళ్లుగా రేడియో జాకీగానూ కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment