స్థానికేతర నేతల కర్మభూమిగా యూపీ
సోనియా, మాయా నుంచి స్మృతీ దాకా
ఎందరో స్థానికేతరుల రాజకీయ అరంగేట్రం
కేంద్రంలో, రాష్ట్రంలో అత్యున్నత పదవులు
దిగ్గజాల వంటి లోకల్ నేతలు ఎందరో ఉండొచ్చు. మేం మాత్రం పక్కా నాన్ ‘లోకల్’! పుట్టి పెరిగింది ఎక్కడన్నది మాకనవసరం. మేమెక్కడ ల్యాండైతే అదే మాకు ‘లోకల్’! ‘తగ్గేదే లే...’ అంటున్నారు మహిళా రాజకీయ వలస పక్షులు. వీరిలో చాలామంది ఉత్తరప్రదేశ్‌ను తమ రాజకీయ కర్మభూమిగా మార్చుకోవడం విశేషం. అతి పెద్ద రాష్ట్రమైన యూపీకి అత్యధిక సంఖ్యలో నాన్ లోకల్ నాయికలకు రాజకీయ భిక్ష పెట్టిన రికార్డు కూడా ఉంది. అలా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ రాజకీయ అరంగేట్రం చేసినవారిలో ఏకంగా రాష్ట్రాన్నే ఏలిన వారొకరు. కేంద్రంలో చక్రం తిప్పినవారు ఇంకొకరు. ఈ వలస పక్షుల్లో సినీ తారలూ ఉన్నారు...
డింపుల్ ‘భాభీ’...
డింపుల్ యాదవ్ స్వస్థలం ఉత్తరాఖండ్. సమాజ్‌వాదీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్యగా యూపీలో అడుగుపెట్టారు. 2009 ఫిరోజాబాద్ ఉప ఎన్నికలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కానీ కాంగ్రెస్ నేత రాజ్‌బబ్బర్ చేతిలో ఓటమి చవిచూశారు. 2012లో కనౌజ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో విజయం సాధించారు. 2019లో మళ్లీ ఓడినా 2022లో ములాయం సింగ్ యాదవ్ మరణం తర్వాత మెయిన్‌పురి ఉప ఎన్నికలో గెలుపొందారు. ‘వికాస్ కీ చాబీ.. డింపుల్ భాభీ..’ అంటూ సమాజ్‌వాదీ కార్యకర్తల నినాదాల నడుమ రెట్టించిన ఉత్సాహంతో ఈసారీ మళ్లీ మెయిన్‌పురిలో బీజేపీతో తలపడుతున్నారు.
మీరా.. షీలా.. సుచేతా...
బిహార్‌కు చెందిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ కూడా యూపీ నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. 1985లో బిజ్నోర్ ఉప ఎన్నికలో విజయంతో ఆమె ప్రస్థానం ఆరంభమైంది. కానీ తర్వాత ఆమె యూపీ నుంచి మళ్లీ పోటీ చేయలేదు. 2017లో యూపీఏ రాష్ట్రపతి అభ్యరి్థగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవిద్ చేతిలో ఓడారు. ఢిల్లీ సీఎంగా సుదీర్ఘకాలం చక్రం తిప్పిన పంజాబ్ పుత్రి షీలా దీక్షిత్ కూడా కాంగ్రెస్ తరఫున 1994లో తొలిసారి యూపీలోని కనౌజ్ నుంచే గెలిచారు. యూపీ తొలి మహిళా సీఎంగా చరిత్రకెక్కిన ప్రముఖ స్వాతంత్య్ర యోధురాలు సుచేతా కృపలానీ స్వస్థలం పంజాబ్!
రాజకీయాల్లోనూ జయప్రదం
రాజమండ్రిలో పుట్టిన తెలుగుతేజం జయప్రద. అసలు పేరు లలితారాణి. తెలుగు సినిమాల్లో వెలుగు వెలగడమే గాక బాలీవుడ్‌లోనూ రాణించారు. ఏడెనిమిది భాషల్లో నటించి ఎనలేని స్టార్‌డం సొంతం చేసుకున్నారు. ఎనీ్టఆర్ ప్రోద్బలంతో 1994లో టీడీపీలో చేరడం ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. పారీ్టతో విభేదించి సమాజ్‌వాదీ పారీ్టలో చేరడం ద్వారా యూపీలో అడుగు పెట్టారు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి విజయం సాధించారు. అనంతరం సమాజ్‌వాదీతోనూ పొసగక రా్రïÙ్టయ లోక్‌మంచ్ పేరిట సొంత పార్టీ పెట్టి విఫలమయ్యారు. చివరికి 2019లో బీజేపీ గూటికి చేరారు.
మాయావతి.. యూపీ క్వీన్
ఈ ‘బెహన్ జీ’ పుట్టింది, చదివింది ఢిల్లీలో అయినా దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగింది మాత్రం యూపీ నుంచే. 1984లో కాన్షీరాం స్థాపించిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో వ్యవస్థాపక సభ్యురాలిగా చేరిన మాయావతి 1989లో తొలిసారి యూపీ నుంచే ఎంపీగా గెలిచారు. తర్వాత ఆమె రాజకీయ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. రాష్ట్రంలోనే గాక దేశ రాజకీయాల్లోనూ తిరుగులేని దళిత నేతగా ఎదిగారు. 1995లో కాన్షీరాం ఆశీస్సులతో అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. దేశంలో తొలి దళిత మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. నాలుగుసార్లు యూపీ సీఎంగా చేశారు. ఆమె రాజకీయ ప్రస్థానాన్ని ప్రజాస్వామ్య సంచలనంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అభివరి్ణంచారు.
స్మృతీ ఇరానీ.. జెయింట్ కిల్లర్
ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ సీరియల్ ‘క్వీన్’ బుల్లితెర నటిగా దేశవ్యాప్తంగా అభిమానుల మనసు దోచారు. 2003లో బీజేపీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో పోటీ చేసిన ఓడినా వెనకడుగు వేయలేదు. రాజ్యసభకు నామినేటయ్యారు. 2014లో అమేథీలో రాహుల్‌తో పోటీ పడటం ద్వారా యూపీ గడ్డపై కాలుమోపారు. తొలి ప్రయత్నంలో ఓడినా 2019లో రాహుల్‌ను ఓడించడంతో జెయింట్ కిల్లర్‌గా ఆమె పేరు దేశమంతటా మారుమోగింది. తనను ‘అమేథీ కీ బిటియా (అమేథీ బిడ్డ)’గా అభివరి్ణంచుకుంటూ అక్కడే స్థిరపడిపోయారు. ఈసారీ అమేథీ బరిలో నిలచి, దమ్ముంటే తనతో తలపడాలంటూ రాహుల్‌కు సవాలు విసురుతున్నారు.
హేమమాలిని... మథుర ‘గోపిక’
అందం, నటనతో దేశాన్ని ఉర్రూతలూపిన బాలీవుడ్ డ్రీమ్‌గాళ్ హేమమాలిని స్వస్థలం తమిళనాడు. తమిళ సినిమాల నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టి బంపర్‌హిట్లతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ముంబైలో స్థిరపడిన హేమ 2011లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. తర్వాత బీజేపీలో చేరి యూపీ బాట పట్టారు. 2014లో మథుర నుంచి 3 లక్షల పై చిలుకు మెజారిటీతో గెలుపొందారు. 2019లోనూ అక్కడి నుంచే గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తన స్థానికతపై విపక్షాల విమర్శలను, ‘‘కృష్టుడిని ఆరాధించే గోపికగా మథురను నా స్వస్థలంగా మార్చుకున్నాను. పదేళ్లుగా ఇక్కడి ప్రజలకు సేవలందిస్తూ వారి మనసు గెలిచా. మళ్లీ గెలుపు నాదే’ అంటూ దీటుగా తిప్పికొడుతున్నారీ ‘బసంతి’!
ధీశాలి... మేనక
ఇందిర చిన్న కొడుకు సంజయ్ భార్యగా గాం«దీల కుటుంబంలో అడుగుపెట్టిన మేనక భర్త మరణాంతరం ఆ కుటుంబానికి పూర్తిగా దూరమయ్యారు. ఆమె స్వస్థలం ఢిల్లీ. 26 ఏళ్ల వయసులో రా్రïÙ్టయ సంజయ్ మంచ్ పేరుతో పార్టీ స్థాపించి 1984లో యూపీలోని అమేథీ నుంచి ఏకంగా రాజీవ్‌నే ఢీకొట్టి ఓడారు. 1989లో పిలిభిత్ నుంచి లోక్‌సభకు వెళ్లారు. 2004లో బీజేపీలో చేరారు. పిలిభిత్ నుంచి ఆరుసార్లు గెలిచారు. కేంద్ర మంత్రిగా రాణించారు. గత ఎన్నికల్లో సుల్తాన్‌పూర్ నుంచి గెలిచిన ఈ జంతు ప్రేమికురాలు ఈసారీ అక్కడి నుంచే బరిలో ఉన్నారు.
ఇటలీ టు ఢిల్లీ.. వయా యూపీ
యూపీకి రాజకీయంగా వలస వచ్చి దేశంలోనే పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా ఎదిగిన మహిళల్లో అగ్రతాంబూలం సోనియా గాం«దీదే. ఇటలీలో పుట్టి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని పెళ్లాడి, భారత్‌ను మెట్టినింటిగా చేసుకున్న సోనియా రాజకీయ రంగప్రవేశం చేసింది యూపీ నుంచే. గాం«దీల కంచుకోటైన అమేథీ నుంచే 1999 లోక్‌సభ ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. 2004లో రాయ్ బరేలీ నుంచి గెలిచి దేశ రాజకీయాల్లో సూపర్‌స్టార్‌గా మారారు. యూపీఏ చైర్‌పర్సన్‌గా పదేళ్లు సంకీర్ణ ప్రభుత్వంలో చక్రం తిప్పారు. 2019 దాకా రాయ్‌బరేలీ నుంచే లోక్‌సభకు ఎన్నికవుతూ వచ్చారు. తాజాగా సోనియా రాజ్యసభకు వెళ్లడంతో ఈసారి కూతురు ప్రియాంక బరిలో దిగొచ్చని భావిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment