
మగ టీటీఈ డ్యూటీ చేసినప్పటికంటే మహిళలు డ్యూటీ చేసిన రోజు పెనాల్టీలు 66 శాతం పెరగడాన్ని అధికారులు గుర్తించారు! మహిళలు నిజాయితీగా ఉద్యోగం చేస్తారనడానికి ఇదొక నిదర్శనం.
ఇటీవలే ముంబైలోని మాతుంగ రైల్వేస్టేషన్ మొత్తం మహిళా ఉద్యోగులతో వార్తల్లోకొచ్చింది. అలాగే జైపూర్‌లోని గాంధీనగర్ రైల్వేస్టేషన్. అక్కడ కూడా అంతా మహిళా సిబ్బందే. ఇప్పుడు మరో మెట్టు. అహ్మదాబాద్ – ముంబయి మధ్య తిరిగే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఇకనుంచీ టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్)లందరూ మహిళలే ఉండబోతున్నారు. రానున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నుంచి ఈ నిర్ణయాన్ని అధికారికంగా అమలులోకి తేబోతోంది ఇండియన్ రైల్వే.
పెనాల్టీలు పెరగాలంటే మహిళలు ఉండాల్సిందే
ఒక రూట్‌లో టీటీఈలందరూ మహిళలే ఉండాలనే నిర్ణయానికి కారణం వారిలోని నిజాయితీనే అంటున్నారు పశ్చిమ రైల్వే సీనియర్ డివిజినల్ కమిషనర్ ఆర్తి సింగ్. అహ్మదాబాద్– ముంబై రూట్‌లో టికెట్ లేకుండా ప్రయాణించేవాళ్లు, జనరల్ టికెట్‌తో రిజర్వేషన్‌లో ప్రయాణించేవాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. టికెట్ చూపించమని అడిగితే మొండికేసే ప్రయాణికులు కూడా ఎక్కువే. అయితే ఈ రూట్‌లో మగ టీటీఈ డ్యూటీ చేసినప్పటికంటే మహిళలు డ్యూటీ చేసిన రోజు పెనాల్టీలు 66 శాతం పెరగడాన్ని అధికారులు గుర్తించారు! ‘‘మహిళలు నిజాయితీగా ఉద్యోగం చేస్తారనడానికి ఇదొక నిదర్శనం’’ అని ఆర్తి సింగ్ అంటున్నారు. ట్రయల్ రన్‌లో ఇది నిరూపణ అయింది కూడా. అలాగే, టికెట్ లేని ప్రయాణికుడికి వంద రూపాయలు చలాన్ రాయాల్సిన చోట యాభై రూపాయలు జేబులో వేసుకుని చూసీ చూడనట్లు వెళ్లే మగ టీటీఈల అవినీతిని అరికట్టడానికి కూడా ఈ నిర్ణయం తోడ్పడుతుందనే అభిప్రాయం కూడా ఉంది.
షిఫ్టుకి ఇద్దరే ఇప్పుడు ఇక నుంచి ఆరుగురు!
ఇంతవరకు ‘శతాబ్ది’లో ఆరుగురిలో షిఫ్ట్‌కి ఇద్దరే మహిళా టీటీఈలు ఉండేవారు. ఇక నుంచి మొత్తం మహిళలే ఉంటారు. ప్రస్తుతానికి ఒక షిఫ్ట్.. అంటే ఆరున్నర గంటల టైమ్ మాత్రమే మొత్తం మహిళా టీటీఈలు డ్యూటీలో ఉండగలుగుతారు. ఈ సంఖ్యను ఇంకా పెంచాలనే ఉద్దేశంలో ఉన్నారు అధికారులు. టికెట్ లేకుండా ప్రయాణించడానికి అలవాటు పడిన కరడుగట్టిన ప్రయాణికులతో మగ టీటీఈలకు తరచూ గొడవలు కూడా వస్తుంటాయి. అదే ఆడవాళ్లయితే వాదన పెంచకుండా చలాన్ రాసి డబ్బు కట్టమంటారు. కట్టకపోతే రైల్వే పోలీస్‌కి సమాచారం ఇస్తారు. దాంతో సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుంది.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment