ఇక్కడ అంతా వింతే!
చదివింత
భూటాన్ రాజకుమారుడు పుట్టినప్పుడు... ఆ దేశస్థులంతా మొక్కలు నాటి కొత్త తరహాలో తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. ఆ రోజున వాళ్లు మొత్తం లక్షా ఎనిమిది వేల మొక్కలు నాటారట. పర్యావరణం పట్ల ఇంత శ్రద్ధ ఉండబట్టే భూటాన్ ప్రపంచంలోనే ‘మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ కంట్రీ’గా గుర్తింపు పొందింది!
ఉక్రెయిన్‌లో కొందరు మహిళలు కలిసి అస్గర్దా అనే గ్రూప్‌గా ఏర్పడ్డారు. వీళ్ల లక్ష్యం ఒక్కటే... మగవాళ్లతో ఎటువంటి సంబంధం లేకుండా, వాళ్ల మీద ఆధార పడకుండా జీవించడం. అందుకే వీళ్లంతా ఒక కొండ ప్రాంతానికి వెళ్లి పోయి నివసిస్తున్నారు. తమ రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఇటలీలో విగనెల్లా అనే ప్రదేశం ఉంది. దాని చుట్టూ ఉన్న కొండల కారణంగా చలికాలంలో 83 రోజుల పాటు సూర్యకాంతి లేక ఊరంతా చీకటిగా అయిపోతుంది. దాంతో అక్కడి ప్రజలంతా కలిసి కొండ అంచున ఓ పెద్ద అద్దాన్ని అమర్చి, సూర్యకాంతి దానిపై పడి ఊరి మీదికి రిఫ్లెక్ట్ అయ్యేలా ఏర్పాటు చేసుకున్నారు.
మెక్సికోలోని పల్మిటాస్ పట్టణానికి చెందిన యువత... తమ టౌన్‌ని అందంగా మార్చేందుకు అనుమతి ఇవ్వమంటూ వెళ్లి ప్రభుత్వాన్ని అడిగింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రెండు వందలకు పైగా ఇళ్లకు గ్రాఫిటీ ఆర్ట్‌తో కొత్త రంగులు అద్దింది. ఫలితంగా ఆ పట్టణం ఇప్పుడిలా ఉంది.
అమెరికాకు చెందిన స్టీవ్ ఫ్యుగేట్ అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు. ఒకరేమో ఆత్మహత్య చేసుకుంటే... మరొకరు మితిమీరి డ్రగ్స్ తీసుకోవడం వల్ల మరణించారు. ఆ బాధ తట్టుకోలేని స్టీవ్, మరెవరి విషయంలోనూ అలా జరగకూడదన్న ఉద్దేశంతో ‘లవ్ లైఫ్’ (జీవితాన్ని ప్రేమించు) అన్న బోర్డు పట్టుకుని పన్నెండేళ్లుగా అమెరికా అంతటా సంచరిస్తూనే ఉన్నాడు.
1961లో అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ వాళ్లు నార్త్ కరొలినా ప్రాంతంలో పొరపాటున రెండు న్యూక్లియర్ బాంబుల్ని జారవిడిచారు. ఇవి ఒక్కోటీ హిరోషిమా బాంబు కంటే 250 రెట్ల విధ్వంసక శక్తి ఉన్నవి. అయితే అదృష్టవశాత్తూ అవి పేలలేదు. దాంతో పడినచోటే వాటిని భూస్థాపితం చేసేశారు. ఘోర ప్రమాదం తప్పింది కదా!
అయామ్ సెమానీ అనేది అరుదైన కోడి జాతి. ఈ కోళ్లు అత్యంత నల్లగా ఉంటాయి. ఒంట్లో తెలుపన్నదే కనిపించదు. ఈకలు, చర్మం మాత్రమే కాదు... వాటి మాంసం, ఎముకలు, రక్తంతో పాటు అవి పెట్టే గుడ్లు కూడా నల్లగానే ఉంటాయి!
మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌కి బ్లూ కలర్ ఎందుకు పెట్టాడో తెలుసా? అతనికి కలర్ బ్లైండ్‌నెస్ ఉంది. ఎరుపు, ఆకుపచ్చ అస్సలు కనబడవు. నీలిరంగు అయితే బాగా కనిపిస్తుంది. అందుకే కావాలని ఫేస్‌బుక్‌కి ఆ రంగు పెట్టాడట. ఈ విషయాన్ని అతనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
టర్కీ కోడి తెలుసుగా? దీన్ని మనం టర్కీ కోడి అంటాం. టర్కీ వాళ్లేమో ‘హిందీ’ అంటారు. అరేబియాలో దీని పేరు గ్రీక్ చికెన్. గ్రీకులేమో దీన్ని ఫ్రెంచ్ చికెన్ అంటారు. ఫ్రెంచ్‌వాళ్లు ఇండియన్ చికెన్ అంటారు. దాంతో పాపమది ఏ ప్రాంతానికి చెందినదో ఎవరికీ తెలియకుండా పోయింది.
1986లో విడుదలైన ‘స్టాండ్ బై మి’ అనే ఆంగ్ల చిత్రంలో ఓ పిల్లాడు సిగరెట్ తాగే సన్నివేశాలు ఉన్నాయి. వాటిని చూసి చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తర్వాత నిజం తెలిసి చల్లబడ్డారు. ఆ నిజం ఏమిటంటే... ఇలాంటి వ్యతిరేకత ఎదురవుతుందని ముందే ఊహించిన దర్శకుడు క్యాబేజీ ఆకులతో సిగరెట్ తయారు చేయించి, దాన్ని కాల్పించాడట.