పాదముద్రలు | Ambedkar birth anniversary today | Sakshi
Sakshi News home page

పాదముద్రలు

Published Fri, Apr 14 2017 12:18 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

పాదముద్రలు

పాదముద్రలు

నేడు అంబేడ్కర్‌ జయంతి

1891:    ఏప్రిల్‌ 14న రామ్‌జీ శక్పాల్‌ – భీమాబాయిలకు 14వ సంతానంగా అంబేడ్కర్‌ జన్మించారు. తండ్రి రామ్‌జీ మిలిటరీ పాఠశాలలో టీచర్‌.

1904:    రామ్‌జీ శక్పాల్‌ తన కుటుంబాన్ని సతారా నుంచి ముంబాయికి మార్చారు.

1907:    భీమ్‌రావు మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అదే సంవత్సరం రమాబాయితో వివాహం.

1911:    మహారాజా సాయాజీరావు గైక్వాడ్‌ అంబేడ్కర్‌ కళాశాల విద్య కొనసాగించటం కోసం నెలకు రూ.25 ఇవ్వడానికి వాగ్దానం చేశాడు.

1912:    డిసెంబర్‌ 12న అంబేడ్కర్‌ పెద్ద కుమారుడు యశ్వంత్‌ జన్మించాడు.

1913: ముంబయి విశ్వవిద్యాలయం నుండి అంబేద్కర్‌ బిఏ పరీక్ష పాసయ్యి బరోడా ఎకౌంటెంట్‌ జనరల్‌ ఆఫీసులో ఉద్యోగిగా చేరాడు.   బరోడా మహారాజు అంబేడ్కర్‌ విదేశాల్లో చదువుకునేందుకు సంవత్సరానికి 230 పౌండ్ల ఉపకార వేతనాన్ని మంజూరు చేశాడు. ఉన్నత విద్య అనంతరం బరోడా రాష్ట్రంలో పదేళ్ళపాటు ఉద్యోగం చేయాలన్న నియమంపై అంబేడ్కర్‌ సంతకం చేశాడు. న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రంలో అంబేడ్కర్‌కు ప్రవేశం లభించింది.

1916:    కొలంబియా యూనివర్శిటీలో అంబేడ్కర్‌  ‘భారతదేశంలో కులాలు’  అనే ఆలోచనా ప్రేరక వ్యాసాన్ని సమర్పించారు అంబేడ్కర్‌ అమెరికా వదిలి (మే నెల) లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పాలిటిక్స్‌లో ఎంఎస్సీ, డిఎస్సీలు చదవటానికి (అక్టోబర్‌) ఇంగ్లండ్‌ చేరుకున్నాడు. కొలంబియా విశ్వవిద్యాలయానికి డాక్టరేట్‌ డిగ్రీకి సమర్పించిన ‘భారత జాతీయ ఆర్థిక వనరులు, చారిత్రక విశ్లేషణ’ అనే పరిశోధనా వ్యాసానికి అనుమతి లభించింది.

1917:    బరోడా ప్రభుత్వం ఇస్తున్న ఉపకార వేతనం కాలపరిమితి అయిపోయినందున అంబేడ్కర్‌ చదువును మధ్యంతరంగా ఆపివేసి భారత్‌ వచ్చేశాడు.  మహారాజా సాయాజీరావుని కలుసుకుని బరోడా ఎకౌంటెంట్‌ జనరల్‌ ఆఫీసులో ఉద్యోగంలో చేరాడు. అస్పృశ్యత సృష్టించిన అవమాన సంఘటనలతో అనతికాలంలోనే ఉద్యోగం వదిలివేసి అంబేడ్కర్‌ ముంబయి రావలసి వచ్చింది.

1923:    హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించారు.

1927:    ఫిబ్రవరి 18న ముంబయి శాసనసభ సభ్యుడిగా అంబేడ్కర్‌ ప్రమాణ స్వీకారం చేశాడు.

1930:    అక్టోబరు 4న అంబేద్కర్‌ మొదటి రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు లండన్‌ వెళ్ళాడు. సమావేశంలో ఆయన అస్పృశ్యుల ప్రతనిధిగా నమోదయ్యాడు.

1931:    ముంబయిలోని మణిభవన్‌లో అంబేడ్కర్‌ గాంధీజీని మొట్టమొదటిసారిగా కలిశాడు. గాంధీజీతో అంబేడ్కర్‌ ‘నాకు స్వదేశం ఉందని మీరంటున్నారు. మళ్ళీ చెబుతున్నాను. నాకు స్వంత దేశం లేదు. మమ్మల్ని పిల్లులు, కుక్కలకన్నా హీనంగా చూస్తుంటే ఇది నా దేశమని, ఇది నా మతమని ఎలా అనుకుంటారు. నేనే కాదు కొద్దిపాటి ఆత్మకౌరవమున్న ఏ అస్పృశ్యుడూ ఈ నేలను చూసి గర్వపడలేడు’ అన్నారు.

1935:    అంబేడ్కర్‌ భార్య శ్రీమతి రమాబాయి అంబేడ్కర్‌ మే, 27న ముంబయిలో మరణించారు.

1942:    భారత్‌ వైస్రాయ్‌ గారి కార్యనిర్వాహక వర్గంలో డా. అంబేడ్కర్‌కు స్థానం కల్పించారు. అంత పెద్ద పదవిని పొందిన తొలి అస్పృశ్యుడు ఆయనే.

1946:    రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం జరిగింది. డా. రాజేంద్రప్రసాద్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంది.

1948:    రాజ్యాంగ ముసాయిదా ప్రతిని అంబేడ్కర్‌ రాజ్యాంగ పరిషత్తులో చర్చ కోసం సమర్పించారు. అదే సంవత్సరం డా.సవితతో వివాహం.

1950:    స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా అంబేడ్కర్‌ ప్రమాణ స్వీకారం.

1956:    డిసెంబర్‌ 6వ తేదీన ఢిల్లీ అలీపూర్‌ రోడ్డులోని 26 నంబర్‌ ఇంటిలో డా. అంబేడ్కర్‌ తుదిశ్వాస విడిచారు. లక్షలాది ప్రజల దర్శనం... బొంబాయి – దాదర్‌ సముద్ర తీరంలో బౌద్ధమత ఆచారాలతో కుమారుడు యశ్వంత్‌చే అంతిమ సంస్కారాలు.

1990:    డాక్టర్‌ అంబేడ్కర్‌కు మరణానంతరం భారత  అత్యున్నత పౌర సత్కారం ‘భారతరత్న’ ప్రదానం జరిగింది. రాష్ట్రపతి ఆర్‌. వెంకట్రామన్‌ చేతుల మీదుగా అంబేడ్కర్‌ సతీమణి డా.సవిత (మాయి) ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement