ఉసిరి కొసిరి కొసిరి వడ్డించండి | Amla Can Give Physical Health | Sakshi
Sakshi News home page

ఉసిరి కొసిరి కొసిరి వడ్డించండి

Published Sat, Nov 9 2019 3:26 AM | Last Updated on Sat, Nov 9 2019 3:26 AM

Amla Can Give Physical Health - Sakshi

కార్తీక మాసం ఉత్సవ మాసం. ఒకవైపు నాలుకపై శివనామ స్మరణం.. మరోవైపు జిహ్వకు ఉసిరి భోజనం... ఆధ్యాత్మికత మానసిక ఆరోగ్యం ఇస్తుంది. ఉసిరి సిరి శారీరక ఆరోగ్యం ఇస్తుంది జిహ్వకు సరికొత్త సత్తాని కూడా ఇసు ్తంది... అందుకే కొసిరి కొసిరి వడ్డించండి...

ఆమ్ల గోలీ
కావలసినవి: ఉసిరి కాయలు – పావు కేజీ; బెల్లం – 150 గ్రా.; వాము – పావు టీ స్పూను; వేయించిన జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఆమ్‌చూర్‌ పొడి – అర టీ స్పూను; నల్ల ఉప్పు – ఒక టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; పంచదార పొడి – 2 టేబుల్‌ స్పూన్లు; నెయ్యి – కొద్దిగా.

తయారీ:
►శుభ్రంగా కడిగిన ఉసిరికాయలకు తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఉడికించాలి
►రెండు విజిల్స్‌ వచ్చాక దింపి, చల్లారాక నీళ్లు వేరు చేయాలి
►ఉసిరికాయల నుంచి గింజలు వేరు చేసి, కాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
►స్టౌ మీద పాన్‌ వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక, ఉసిరికాయ ముద్దను వేసి కలపాలి
►బెల్లం పొడి జత చేసి సుమారు ఐదు నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి
►వాము, ఇంగువ, వేయించిన జీలకర్ర పొడి, ఆమ్‌చూర్‌ పొడి, నల్ల ఉప్పు, ఉప్పు జత చేసి బాగా కలిపి దింపేయాలి
►కొద్దిగా చల్లారాక గోళీలుగా చేసి, పంచదార పొడిలో దొర్లించి, బాగా ఆరిన తరవాత గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి.

ట్రెజర్‌ హంట్‌
కావలసినవి
మైదా పిండి – 50 గ్రా.; జొన్న పిండి – 50 గ్రా.; ఉసిరికాయ తురుము – పావు కప్పు, బెల్లం తురుము – అర కప్పు; తేనె – పావు కప్పు ; వెనిగర్‌ – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – కొద్దిగా; బేకింగ్‌ పౌడర్‌ – అర టీ స్పూను; బేకింగ్‌ సోడా – అర టీ స్పూను; ఎగ్‌లెస్‌ కేక్‌ పౌడర్‌ – 2 టేబుల్‌ స్పూన్లు (సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతుంది); కొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు; ఆలివ్‌ ఆయిల్‌ – పావు కప్పు; పాలు – అర కప్పు; నీళ్లు – అర కప్పు.

తయారీ
►ఒక పాత్రలో అన్ని పదార్థాలను వేసి ఎక్కువసేపు బాగా కలపాలి
►ఈ మిశ్రమాన్ని కేక్‌ కంటెయినర్‌లో పోసి, సమానంగా పరవాలి
►అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్‌ చేయాలి
►కేక్‌ కంటెయినర్‌ను అందులో ఉంచి, సుమారు అర గంట సేపు బేక్‌ చేశాక తీసి, చల్లారాక కట్‌ చేసి అందించాలి.

ఆమ్ల గ్రీన్‌ చిల్లీ పికిల్‌
కావలసినవి: ఉసిరి కాయలు – పావు కేజీ; తాజా పచ్చి మిర్చి – పావు కేజీ; ఆవ పొడి – ఒక కప్పు; ఆవ నూనె – ఒక కప్పు; ఉప్పు – తగినంత, పసుపు – 2 టీ స్పూన్లు
ఇంగువ – ఒక టీ స్పూను.

తయారీ: 
► ఒక పాత్రలో తగినన్ని నీళ్లు పోసి ఉసిరికాయలు, పచ్చి మిర్చి కాయలను శుభ్రంగా కడగాలి
►పచ్చి మిర్చిని మధ్యకు కట్‌ చేయాలి (గుత్తి వంకాయ మాదిరిగా)
►కుకర్‌లో అర గ్లాసు నీళ్లు, ఉసిరి కాయలు వేసి మూత ఉంచి, స్టౌ మీద పెట్టి, ఒక విజిల్‌ వచ్చాక దింపేయాలి
►బాగా చల్లారాక ఉసిరి కాయలలోని గింజలను వేరు చేయాలి
►తరిగిన పచ్చి మిర్చి, ఉసిరి ముక్కలు, పసుపు, ఆవ పొడి, ఉప్పు ఒక పాత్రలో వేసి బాగా కలపాలి
►స్టౌ మీద బాణలిలో ఆవ నూనె వేసి కాగాక ఇంగువ వేసి బాగా కలిపాక, సిద్ధంగా ఉన్న ఉసిరి పచ్చడి మీద పోసి, బాగా కలియబెట్టాలి
►ఈ మిశ్రమాన్ని రెండు రోజులు ఎండబెట్టాలి ∙గాలి చొరని జాడీలోకి తీసుకోవాలి
►వేడి వేడి అన్నంలో, కమ్మటి నువ్వుల నూనెతో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది.

ఆమ్ల స్వీట్‌ అండ్‌ హాట్‌ పికిల్‌
కావలసినవి: ఉసిరి కాయ ముక్కలు – పావు కేజీ; బెల్లం పొడి – ఒక టేబుల్‌ స్పూను; నువ్వు పప్పు నూనె – ఒక కప్పు; ఉప్పు – తగినంత; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5; ఇంగువ – పావు టీ స్పూను; పసుపు – ఒక టీ స్పూను; వెల్లుల్లి రేకలు – 10; కరివేపాకు – 3 రెబ్బలు; మిరప కారం – 2 టేబుల్‌ స్పూన్లు; మెంతులు – అర టీ స్పూను.

తయారీ:
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, బెల్లం పొడి, ఉసిరి ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు కలపాలి
►తడి బయటకు వస్తుంటే, మంట బాగా తగ్గించి, మరో రెండు నిమిషాలు ఉడికించి, మరోపాత్రలోకి తీసుకోవాలి
►స్టౌ మీద మరో బాణలిలో నువ్వుల నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి, ఇంగువ, పసుపు, వెల్లుల్లి రేకలు వేసి బాగా కలపాలి
►కరివేపాకు జత చేసి మరోమారు వేయించాక, ఎండు మిర్చి జత చేసి కలిపి దింపేయాలి
►సిద్ధంగా ఉన్న ఉసిరి పచ్చడిలో ఈ మిశ్రమం, ఉప్పు, మిరపకారం వేసి బాగా కలపాలి
►ఒక గంట తరవాత వేడి వేడి అన్నంలోకి తింటే రుచిగా ఉంటుంది
►రోటీలలోకి కూడా బాగుంటుంది.

ఆమ్ల క్యారట్‌ జ్యూస్‌
కావలసినవి: క్యారట్‌ – పావు కేజీ; ఉసిరి కాయలు – 4, అల్లం తురుము – అర టీ స్పూను, తాజా నిమ్మ రసం – 2 టీ స్పూన్లు; తేనె – ఒక టేబుల్‌ స్పూను; నీళ్లు – తగినన్ని; ఐస్‌ క్యూబ్స్‌ – తగినన్ని.

తయారీ:
►క్యారట్‌లను శుభ్రంగా కడిగి, పైన తొక్క తీసి, కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్‌ చేయాలి
►మిక్సీలో క్యారట్‌ ముక్కలు, అల్లం తురుము, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టి, వడ కట్టి, రసం వేరు చేయాలి
►ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి, గింజలను వేరు చేసి, కాయలను సన్నగా తురమాలి
►తగినన్ని నీళ్లు, ఉసిరి కాయ తురుములను మిక్సీలో వేసి మెత్తగా చేసి, వడకట్టి, నీరు వేరు చేసి పక్కన ఉంచాలి
►ఒకపెద్ద పాత్రలో క్యారట్‌ రసం, ఉసిరి రసం పోసి, తేనె జత చేసి బాగా కలపాలి
►ఐస్‌ క్యూబ్స్‌ జత చేసి చల్లగా అందించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement