
అంతే లేని కథ!
సుబ్బమ్మ, సుబ్బారావు దంపతులిద్దరికీ మతిమరుపు సమస్య. ఇద్దరూ కలిసి ఒక రోజు డాక్టర్ దగ్గరికి వెళ్లారు. తమ సమస్య గురించి చెప్పుకున్నారు. ‘‘ఏమీ లేదండీ సింపుల్. ఒక చిన్న నోట్ పాడ్ మీద చేయబోయే పనులు రాసుకోండి. ఇక మరచిపోవడం అనేది ఉండదు’’ అన్నారు డాక్టర్.
‘‘అలాగే’’ అన్నారు దంపతులు.
మరుసటి రోజు...
‘‘సుబ్బు...వంటగదిలోకి వెళ్లి కాఫీ చేసి తీసుకురా. అలాగే బిస్కట్‌లు ఒక పళ్లెంలో తీసుకురా...మరిచిపోతావేమో’’ అన్నది సుబ్బమ్మ.
‘‘చిన్న చిన్న వాటికి కూడా రాసుకోవడం సిల్లీగా ఉంటుంది. ఆ మాత్రం జ్ఞాపకం పెట్టుకోలేనా’’ అంటూ వంటగదిలోకి వెళ్లాడు సుబ్బారావు.
పది నిమిషాల తరువాత-
‘‘ఇదిగో నువ్వడిగిన పోపుల పెట్ట్టె. చీపురుకట్ట కూడా అడిగావు కదా... ఇదిగో తీసుకో’’ అంటూ ఇవ్వబోయాడు సుబ్బారావు.
‘‘నేను అడిగింది ఏమిటి? నువ్వు తెచ్చింది ఏమిటి? అందుకే నోట్ పాడ్ మీద రాసుకోమన్నాను’’ అన్నది సుబ్బమ్మ.
‘‘ఇంతకీ నువ్వు అడిగింది ఏమిటి?’’ ఆశ్చర్యపోయాడు సుబ్బారావు.
‘‘వేడి వేడిగా ఆమ్లెట్ వేసుకురమ్మన్నాను కదా’’ అన్నది సుబ్బమ్మ.
‘‘అవును కదా...’’ అంటూ వడివడిగా వెళుతున్న సుబ్బారావుతో-
‘‘నోట్‌పాడ్ మీద రాసుకో’’ అని సలహా ఇచ్చింది సుబ్బమ్మ.
‘‘ఈ మాత్రం దానికి కూడా రాయాలా?’’ అంటూ రాసుకోకుండానే వంటగదిలో అడుగుపెట్డాడు సుబ్బారావు.
అయిదారు నిమిషాల తరువాత-
‘‘ఇదిగో నువ్వు అడిగిన చల్లటి మజ్జిగ’’ అన్నాడు.
‘‘నేనడిగింది ఏమిటి, నువ్వు తెచ్చింది ఏమిటి?’’ అన్నాడు సుబ్బారావు.
‘‘ఆవకాయ జాడీ తీసుకురమ్మంటే మజ్జిగ తీసుకువచ్చావేమిటి?’’ అని గద్దించింది సుబ్బమ్మ.
‘‘సారీ’’ అంటూ వంటగదిలోకి వెళ్లాడు సుబ్బారావు.
గమనిక: సారీ... ఈసారి కూడా సుబ్బారావు నోట్‌పాడ్ మీద రాసుకోలేదు!