వీరబాల | Anandiben Patel Special Story! | Sakshi
Sakshi News home page

వీరబాల

Published Mon, Aug 8 2016 12:25 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

వీరబాల

వీరబాల

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పదవీకాలం నిన్నటితో ముగిసింది. కొత్త ముఖ్యమంత్రిగా ఆ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు విజయ్ రూపానీ నిన్న ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి ఆనందీబెన్‌కు ఇంకా 15 నెలల పదవీకాలం మిగిలే ఉంది. కానీ ఆమె దిగిపోయారు. రూపానీ చొరవ ఉన్న నాయకుడు కాదు. కానీ ఆయన ఎదిగిపోయారు! బాల్యంలో అసమాన క్రీడా ప్రతిభను కనబరిచి ‘వీర్ బాల’ అవార్డు అందుకున్న ఆనందీబెన్‌ను... ఈ రాజకీయ క్రీడా పరిణామాలు ఏ మాత్రం నివ్వెరపరచలేవని పదవి బదలాయింపులో ఆమె ప్రదర్శించిన పెద్దరికాన్ని బట్టి స్పష్టమవుతోంది. 
 
ఇద్దరూ మహిళా ముఖ్యమంత్రులే కావడం మినహా ఏ పోలికా, పొంతన లేని రాష్ట్రాలు కశ్మీర్, గుజరాత్. అయితే అవే రాష్ట్రాలు ఇప్పుడు అశాంతికి, అస్థిరతకు అక్కాచెల్లెళ్లు అయ్యాయి! అక్కడ ఉగ్రవాదం, ఇక్కడ ఆగ్రహవాదం. కశ్మీర్‌ను పొరుగు దేశం నుంచి కాపాడుకోవాలి. గుజరాత్‌ను పార్టీ తప్పిదాల నుంచి గట్టెక్కించుకోవాలి. నిజానికి కశ్మీర్ కన్నా, గుజరాతే ప్రస్తుతం నరేంద్ర మోదీకి పెద్ద సమస్య! వచ్చే ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో గెలవడానికి మోదీ కదిపిన మొట్ట మొదటి పావు ఆనందినీబెన్. పటేళ్ల రిజర్వేషన్‌ల గొడవను ఆపలేకపోయారని, ‘ఉనా’లో దళితుల రక్తం పార్టీపై చిందకుండా జాగ్రత్త వహించలేకపోయారని ఆమెపై ప్రధాన ఆరోపణ.. ప్రధాని ఆరోపణ కూడా!
 
రమ్మందీ ఆయనే... పొమ్మందీ ఆయనే
ఆనందీబెన్.. బీజేపీలో సీనియర్ నాయకురాలు. లేదా ‘నిజమైన నాయకులలో’ సీనియర్. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ఆమె చెప్పిన కారణం కూడా ఈ సీనియారిటీనే! ‘‘డెబ్బయ్ ఐదేళ్లు వచ్చిన వాళ్లు కీలక బాధ్యతల నుంచి వైదొలగాలన్నది పార్టీ అభిమతం. అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని ఆమె తన రాజీనామాకు ముందు ప్రకటించారు. (వాస్తవానికి ఈ ఏడాది నవంబరుకు గానీ ఆనందీబెన్ 75లోకి అడుగుపెట్టరు). దేశ ప్రధాని అయ్యాక, తన స్థానంలో గుజరాత్‌కు ఆనందీబెన్‌ను ముఖ్యమంత్రిగా సూచించిందీ మోదీనే, ఇప్పుడు ఆమెను దించేయమన్న సంకేతాలు పంపిందీ మోదీనే.
 
బెన్‌దీ, మోదీదీ ఒకే స్కూలు!
మోదీ కన్నా సీనియర్ ఆనందీబెన్. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. విస్‌నగర్ (మెహ్‌సానా)లోని ఎన్.ఎం.హైస్కూల్ అది. ఇద్దరికీ వయసులో పదేళ్లు తేడా. అదే సీనియారిటీ ఆమె ఆలోచనా విధానంలోనూ కనిపిస్తుంది. మోదీది రాజకీయ చతురత. ఆనందీబెన్‌ది రాజకీయాలకు అతీతమైన పరిణతి. రాజకీయాల్లోకి రాకముందు, వచ్చాక కూడా ప్రధానంగా ఆమె స్త్రీల విద్య, అభివృద్ధి కోసమే శ్రమించారు. గుజరాత్ విద్యాశాఖ మంత్రిగా ఆనందీబెన్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, చూపిన చొరవ కారణంగానే ఆ రాష్ట్రంలో 2001లో 37గా ఉన్న బాలికల డ్రాపవుట్స్ (మధ్యలో చదువు మానేసేవారు) శాతం 2013 నాటికి 2 శాతానికి తగ్గిపోవడం అప్పట్లో దేశానికే ఒక ఆదర్శ పరిణామం అయింది.
 
700 మందిల్లో ఒకే ఒక అమ్మాయి!
ఆనందీబెన్ చదివిన ప్రాథమిక పాఠశాలలో నాల్గవ తరగతి వరకు ఆమె ఒక్కతే అమ్మాయి. మిగతా 700 మందీ అబ్బాయిలు! ఆ వయసులోనే ఆమెకది అసహజంగా కనిపించింది. బడి టైమ్‌లో బడిలో లేకుండా ఈ ఆడపిల్లలంతా ఎక్కడ ఉన్నట్టు? అనే ప్రశ్న ఆమెను వేధించింది. తండ్రిని అడిగింది. ‘‘ఇంకెక్కడ? ఇంట్లో’’ అని అన్నారు ఆయన. ఎందుకు ఇంట్లోనే ఉండిపోవాలి? మళ్లీ ఇంకో ప్రశ్న. హైస్కూల్లోనూ అంతే. తనతో కలిపి ముగ్గురు విద్యార్థినులు. బియస్సీలో అయితే తనొక్కతే ఆడపిల్ల. ఈ పరిస్థితి మార్చాలని ఆనాడే నిర్ణయించుకున్నారు ఆనందీబెన్. టీచర్‌గా చేతనైనంత చేశారు. చేతికి పవర్ వచ్చాక ఎవరూ చేయనంత చేశారు. 
 
అనుకోకుండా ఓ రోజు!
1987 వరకు ఆనందీబెన్ టీచర్‌గానే ఉన్నారు. ఆ ఏడాది ఓ రోజు స్కూల్ పిల్లలతో కలిసి పిక్నిక్‌కి వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తూ ఇద్దరు విద్యార్థినులు సర్దార్ సరోవర్ రిజర్వాయర్‌లో పడిపోయారు. నీళ్లలోంచి వాళ్ల ఆక్రందనలు, ఒడ్డున మిగతా పిల్లలు, టీచర్ల హాహాకారాలు! ఆనందీబెన్ చురుగ్గా కదిలి రిజర్వాయర్‌లోకి దూకేశారు. ఈత కొట్టుకుంటూ వెళ్లి ఆ పిల్లలిద్దర్నీ క్షేమంగా గట్టుపైకి తెచ్చారు. ప్రాణాలకు తెగించి ఆమె చూపిన సాహసానికి ఆనందీబెన్‌కి రాష్ట్రపతి ధీరవనిత (బ్రేవరీ) అవార్డు వచ్చింది. ఆ వెంటనే బి.జె.పి. ఆమెను పార్టీలోకి ఆహ్వానించి, ఆమెను ఏకంగా గుజరాత్ మహిళా మోర్చాకు అధ్యక్షురాలిని చేసింది. 
 
డైనమిజం.. ఆమె నైజం
1992లో విరామ్‌గ్రామ్ జిల్లాలో ‘బర్డ్‌ఫ్లూ’ ప్రబలింది. ఎవరికైనా బర్డ్‌ఫ్లూ సోకిందని తెలిస్తే చాలు ఆ దరిదాపుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడే మనస్తత్వం కూడా ప్రబలింది. అలాంటి భయానక వాతావరణంలో ఆనందీ పార్టీ వ్యవహారాలను పక్కనపెట్టి జనం మధ్యే ఉండిపోయారు. అధికార యంత్రాంగానికీ, స్థానిక ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా నిద్రాహారాలు మాని మరీ పనిచేశారు! అది ఆమెకు పార్టీలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ ఏడాది కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు పార్టీ నిర్వహించిన ‘ఏక్తాయాత్ర’లో నాటి అగ్రనేత మురళీ మనోహర్ జోషి పక్కన ఆనందిబెన్ ఒక్కరికే స్థానం లభించింది. రెండేళ్ల తర్వాత 1994లో ఆమె రాజ్యసభ సభ్యురాలయ్యారు. ఎంపీ హోదాలో 1995లో చైనాలోని బీజింగ్‌లో జరిగిన ‘నాల్గవ ప్రపంచ మహిళా సదస్సు’లో భారతదేశ ప్రతినిధిగా పాల్గొని వచ్చారు. 
 
ఆశించనవీ, ఊహించనివే అన్నీ!
ఆనందీబెన్ రాజకీయ జీవితంలో ప్రతి పరిణామం అనుకోకుండా, ఆశించకుండా, ఊహించకుండా జరిగిందే! 31 ఏళ్ల పాటు పిల్లలకు పాఠాలు బోధించిన ఈ ఉపాధ్యాయురాలు... దాదాపు అంతేకాలం రాజకీయాల్లో ఒక విద్యార్థినిగా ఎన్నో పాఠాలను నేర్చుకునే ఉంటారు. పిల్లలకు మంచేదో, చెడేదో చెప్పగలిగిన ఒక టీచర్... ప్రజలకు ‘మంచిది కాని దాన్ని’ చెయ్యకుండా ఉండడానికి మాత్రం ఎందుకు వెనకాడతారు? అది పార్టీ అభీష్టానికి వ్యతిరేకమే అయినా ఎందుకు తన ఆత్మప్రబోధానుసారం నడుచుకోకుండా ఉంటారు? అలా చేసినందుకే, ఓటు బ్యాంకు అనుకున్న పటేళ్ల ఉద్యమాన్ని అణిచివేసినందుకే, ‘ఉనా’ హింసాకాండలో హిందూత్వ వాదులను వెనకేసుకు రాకుండా తన మౌనంతో దళితుల పక్షాన నిలిచినందుకే... గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆమె తన 75వ పుట్టినరోజును జరుపుకునే అవకాశాన్ని కోల్పోయారు. అయితే ఆమె పంజాబ్ గవర్నర్‌గా తన బర్త్‌డే ని జరుపుకునే అవకాశాలూ లేకపోలేదు.
 
ఆనందీబెన్ భర్త మఫత్ లాల్ పటేల్ (79): విద్యారంగంలో, రాజకీయాలలో తన భార్య ఎదుగుదలను జీర్ణించుకోలేకపోయిన మఫత్‌లాల్ గత 30 ఏళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నారు. ఆమెకు వ్యతిరేకంగా గతంలో ఆయన అనేకసార్లు మోదీకి, అద్వానీకి లేఖలు కూడా రాశారు.  
 
ఆనందిబెన్ పటేల్ (74) 
నిన్నటి దాకా 
గుజరాత్ ముఖ్యమంత్రి
పూర్తి పేరు : ఆనందిబెన్ మఫత్‌లాల్ పటేల్
జననం : 21 నవంబర్ 1941
జన్మస్థలం : ఖరోద్, గుజరాత్
భర్త : మఫత్‌లాల్సై ,కాలజీ ప్రొఫెసర్ (వివాహం 29 మే 1962), విడిగా జీవనం (1985 నుంచి)
సంతానం : అనార్ (కూతురు), సంజయ్ (కొడుకు)
మనవడు, మనవరాలు : ధర్మ్, సంస్కృతి
చదువు : బి.ఎస్సీ.  (1960 బ్యాచ్) తర్వాత విరామాలతో... ఎమ్మెస్సీ, బి.ఇడి, ఎం.ఇడి.
తొలి ఉద్యోగం   :    సైన్స్, మ్యాథ్స్ టీచర్
రాజకీయరంగ ప్రవేశం   :   1987 (46 ఏళ్ల వయసులో)
 
వీరబాల
* ఆనందిబెన్ స్థానికంగా ఉండే ఎన్.ఎం. హైస్కూల్‌లో చదువుకున్నారు. ఆ స్కూల్లో ఆనంది సహా ముగ్గురే విద్యార్థినులు! 
ఆనంది మంచి అథ్లెట్. జిల్లా స్థాయిలో వరుసగా మూడేళ్లు ఛాంపియన్‌గా నిలబడ్డారు.
మెహ్‌సానా జిల్లా మొత్తం మీద చురుకైన క్రీడాకారిణిగా  ‘వీర్‌బాల’ అవార్డు అందుకున్నారు. 
 
ఇవి కాక...
అత్యంత ప్రభావశీలురైన తొలి 100 మంది వ్యక్తులలో ఒకరిగా ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ అవార్డు (2014).
ఉత్తమ ఉపాధ్యాయినిగా గవర్నర్ అవార్డు (1988)
ఉత్తమ ఉపాధ్యాయినిగా, ధీరవనితగా రాష్ట్రపతి అవార్డు (1989)
సర్దార్ పటేల్ అవార్డు (పటేల్ జాగృతి మండల్) 1999
విద్యా గౌరి అవార్డు (శ్రీ తపోధన్ బ్రహ్మణ్ వికాస్ మండల్) 2002
ధరతి వికాస్ మండల్ స్త్రీ జనోద్ధరణ అవార్డు
  
పెళ్లయ్యాకే పెద్ద డిగ్రీలన్నీ!
‘మహిళా వికాస్ గృహ్’లో 50 మంది వితంతువులకు ఒకేషనల్ కోర్సులో పాఠాలు చెప్పారు. 
భర్తతో కలిసి 1965లో అహ్మదాబాద్ వెళ్లి సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 
ఆనంది మెట్టినిల్లు పెద్దది. ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే, బి.ఇడి. పూర్తి చేశారు. తర్వాత ఎమ్మెస్సీ చేశారు.
ఎమ్మెస్సీలో గోల్డ్ మెడల్ సాధించారు.
1967-1970 మధ్య అహ్మదాబాద్‌లోని మొిహ నిబా కన్యా విద్యాలయలో సైన్స్, మ్యాథ్స్ టీచర్‌గా పనిచేశారు. అదే స్కూల్‌కి ప్రిన్సిపల్ అయ్యారు!
 
చేపట్టిన బాధ్యతలు
విద్య, సాంకేతిక విద్య, స్త్రీ శిశు సంక్షేమం; క్రీడలు, యువజన, సాంస్కృతిక మంత్రిత్వశాఖలు (1998-2007).
రెవిన్యూ, విపత్తు నిర్వహణ; రోడ్లు, భవనాలు, స్త్రీ,శిశు సంక్షేమం (2007-2014).
గుజరాత్ తొలి మహిళాముఖ్యమంత్రిగా 22 మే 2014 నుంచి - 7 ఆగస్టు 2016 వరకు.
1998లో రాజ్యసభకు రాజీనామా చేసి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొని మండల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు తర్వాత వరుసగా 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. 2014లో గుజరాత్ సి.ఎం.అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement