ఆటలో మనమే మేటి | andhra pradesh play key role in indian sports | Sakshi
Sakshi News home page

ఆటలో మనమే మేటి

Published Sat, Jan 18 2014 1:02 AM | Last Updated on Sat, Aug 18 2018 4:18 PM

ఆటలో మనమే మేటి - Sakshi

ఆటలో మనమే మేటి

 కాస్త బడ్జెట్ పెంచితే...
 ప్రస్తుతం రాష్ట్రంలో క్రీడల బడ్జెట్ రూ.22 కోట్లు మాత్రమే. ఇది జీతాలకు, ఇతర నిర్వహణ ఖర్చులకే సరిపోతోంది. ఇప్పుడు కీర్తి ప్రతిష్టలు తెస్తున్న వారంతా... ఆర్థికంగా ఆటంకాలను అధిగమిస్తూ సొంతంగా ఎదిగినవారే. ప్రభుత్వం నుంచి కూడా వీరికి ప్రోత్సాహం లభిస్తే... ఇక ఫలితాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించండి..!ప్రపంచంలో ఎక్కడ ఏ క్రీడ జరిగినా... అందులో భారత్‌కు పతకం వచ్చిందంటే... కనీసం 60 శాతం ఫలితాల్లో అవి తెలుగు వారి నుంచి వచ్చినవే అవుతున్నాయి. కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.

 ప్రస్తుతం రాష్ట్రం నుంచి రకరకాల క్రీడల్లో సుమారు 70 మంది అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత క్రీడాంశాల్లో ఏపీ క్రీడాకారులకు ఎదురులేదు. సైనా నెహ్వాల్, సానియా మీర్జాలే కాదు... వీళ్లను మించిన నైపుణ్యంతో యువతారలు దూసుకొస్తున్నారు. రాష్ట్రంలో క్రీడల పట్ల అవగాహన పెరగడం, సౌకర్యాలు మెరుగు కావడం దీనికి కారణం. అభినందించదగ్గ విషయం ఏమిటంటే... ప్రభుత్వం నుంచి సహాయం లేకపోయినా ప్రపంచమంతా క్రీడల్లో తెలుగు వెలుగులు ప్రసరించడం.
 
 టాప్‌‘లిఫ్టింగ్’
 
 వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్ర ప్రదేశ్ లిఫ్టర్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా జూనియర్, యూత్ విభాగాల్లో మన ఆటగాళ్లు వరుస విజయాలు సొంతం చేసుకుంటున్నారు. కామన్వెల్త్, ఆసియా చాంపియన్‌షిప్‌లో అనేక పతకాలు నెగ్గి వారు సత్తా చాటారు. ముఖ్యంగా ఈ క్రీడకు హకీంపేటలోని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్ (ఏపీఎస్‌ఎస్) కేంద్రంగా ఉంటోంది.

ఈ స్కూల్‌కు చెందిన రాగాల వెంకట రాహుల్ చక్కటి విజయాలతో దూసుకు పోతున్నాడు. అతనితో పాటు చైతన్య, దీక్షిత, శిరీష ఇటీవల కామన్వెల్త్ చాంపియన్ షిప్‌లో అద్భుత విజయాలు సాధించారు. మరో అమ్మాయి మత్స్య సంతోషి కూడా తీవ్రంగా సాధన చేస్తోంది.  ఇదే జోరును సీనియర్ విభాగంలోనూ కొనసాగించా లని వీరు పట్టుదలగా ఉన్నారు.
 
 గురి కుదిరింది
 కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో భారత్ పతకాలు నెగ్గే అవకాశం ఉన్న మరో క్రీడ ఆర్చరీ. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రితుల్ ఛటర్జీ, చిట్టి బొమ్మ జిజ్ఞాస్, చరణ్ రెడ్డి ఇప్పటికే అనేక పతకాలు గెలుచుకున్నారు. మహిళల కాంపౌండ్ విభాగంలో ఏపీ అమ్మాయి జ్యోతి సురేఖ జాతీయ నంబర్‌వన్‌గా ఉంది. జంషెడ్‌పూర్ టాటా అకాడమీ తర్వాత మన రాష్ట్రంనుంచే ఎక్కువ మంది ఆర్చర్లు వెలుగులోకి వస్తున్నారు.

 ముఖ్యంగా రాష్ట్రంలో ఆర్చరీకి గుర్తింపు తీసుకు రావడంలో  విజయవాడలోని ఓల్గా అకాడమీ కీలక పాత్ర పోషించింది. హకీంపేటలోని ఏపీ స్పోర్ట్స్ స్కూల్ ఆర్చర్లు కూడా జూనియర్ విభాగాల్లో రాణిస్తున్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ఆర్చర్లు మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది.
 
 అదరగొట్టే పంచ్...
 గ్వాంగ్‌జౌలో జరిగిన గత ఆసియా క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంతోష్ కుమార్ పతకం నెగ్గి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు భారత జట్టు శిబిరంలో ఉన్న అతను మళ్లీ ఈ ఏడాది కామన్వెల్త్, ఆసియా క్రీడలపై దృష్టి పెట్టాడు. వైజాగ్ బాక్సింగ్ అకాడమీ అనేక మంది కుర్రాళ్ళను తీర్చి దిద్దుతోంది. సంతోష్‌కు తోడు ఇటీవల పొలిపల్లి ప్రసాద్ కూడా నిలకడైన ఆటతీరుతో జూనియర్ స్థాయిలో ఇంటర్నేషనల్ మెడల్ గెలుచుకున్నాడు.

 ఇక మహిళల బాక్సింగ్‌లో కొత్త కెరటం నిఖత్ జరీన్ దూసుకొచ్చింది. జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఈ అమ్మాయి ఇటీవలే సీనియర్ స్థాయిలోనూ సత్తా చాటింది. మరో బాక్సర్ మారతమ్మ కూడా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. ఈ విజయాలు బాక్సింగ్ క్రీడలోనూ మన పవర్ పంచ్‌ను చూపిస్తున్నాయి.
 
 మిగిలిన క్రీడల్లోనూ...
 టేబుల్ టెన్నిస్‌లో కూడా రాష్ట్ర ప్యాడ్లర్లు చక్కటి విజయాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా బాలికల విభాగంలో నైనా జైస్వాల్, నిఖత్ బాను, ఆకుల శ్రీజ తదితరులు నిలకడగా రాణిస్తున్నారు. శ్రీజ కేడెట్ విభాగంలో ఈ ఒక్క ఏడాదే 12 అంతర్జాతీయ పతకాలు గెలుచుకుంది. రెజ్లింగ్‌లో దేవీసింగ్, వరంగల్ అకాడమీలో జిమ్నాస్ట్‌లు, షూటింగ్‌లో గగన్‌తో పాటు యువ కెరటాలు... ఇలా రాష్ట్రం నుంచి పలు క్రీడల్లో నిలకడగా రాణిస్తున్న వారికి కొదవలేదు.
 
 చదరంగంలో తిరుగులేదు

 ఒలింపిక్ క్రీడలను మినహాయిస్తే మన రాష్ట్రంనుంచి ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఆట చదరంగం. అండర్-10 నుంచి సీనియర్ స్థాయి వరకు రాష్ట్రానికి చెందిన ప్లేయర్లు చెస్‌లో అద్భుత విజయాలు సాధిస్తున్నారు. సీనియర్లు హరికృష్ణ, హంపి, హారిక, లలిత్ బాబుల బాటలో అనేక మంది చెస్‌ను పూర్తి స్థాయి ప్రొఫెషన్‌గా ఎంచుకుంటున్నారు.  ఎక్కువ సంఖ్యలో రాష్ట్రంలో టోర్నీలు జరుగుతుండటం, ప్రైవేట్ అకాడమీలు కూడా ఉండటం రాష్ట్రంలో చెస్ పురోగతికి తోడ్పడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement