‘పద్మ భూషణ్’ సానియా, సైనా | Padma Bhushan for Sania, Saina; Deepika to get Padma Shri | Sakshi
Sakshi News home page

‘పద్మ భూషణ్’ సానియా, సైనా

Published Tue, Jan 26 2016 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM

‘పద్మ భూషణ్’ సానియా, సైనా

‘పద్మ భూషణ్’ సానియా, సైనా

ఇద్దరు మేటి క్రీడాకారిణులకు
దేశ మూడో అత్యున్నత పురస్కారం 
ఆర్చర్ దీపిక కుమారికి ‘పద్మశ్రీ’

 న్యూఢిల్లీ: గతేడాది తమ అద్వితీయ ఆటతీరుతో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన భారత స్టార్ క్రీడాకారిణులు సానియా మీర్జా (టెన్నిస్), సైనా నెహ్వాల్ (బ్యాడ్మింటన్)లకు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో మూడోదైన ‘పద్మ భూషణ్’ను ఫ్రకటించింది. వీరిద్దరితోపాటు గత సంవత్సరం నిలకడగా రాణించిన మహిళా ఆర్చర్ దీపిక కుమారికి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో... సైనా నెహ్వాల్ మంగళవారం మొదలయ్యే సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో పాల్గొంటున్నారు. ఇప్పటికే తమ కెరీర్‌లో అర్జున అవార్డు, పద్మశ్రీ, రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర పురస్కారాలను సంపాదించిన ‘హైదరాబాద్ క్రీడా ఆణిముత్యాలు’ సానియా, సైనాల ఖాతాలో మరో గౌరవం చేరడం విశేషం.
 
 జైత్రయాత్ర...
 గత సంవత్సరం సానియా మీర్జా తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించింది. ఏకంగా 10 డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకుంది. స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం మార్టినా హింగిస్‌తో జతకట్టిన తర్వాత ఈ హైదరాబాదీ మహిళల డబుల్స్‌లో అప్రతిహత విజయాలు సాధించింది. బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి ఒక టైటిల్‌ను సాధించిన సానియా... హింగిస్‌తో కలిసి తొమ్మిది టైటిల్స్‌ను చేజిక్కించుకుంది. ఇందులో రెండు గ్రాండ్‌స్లామ్ (వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టైటిల్స్ కూడా ఉండటం విశేషం. ఓవరాల్‌గా గతేడాది సానియా 65 మ్యాచ్‌ల్లో గెలిచి, కేవలం 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
 
 సూపర్ సైనా...
 ఇక బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్ కూడా గతేడాది చిరస్మరణీయ విజయాలు దక్కించుకుంది. సొంతగడ్డపై సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్‌తో సీజన్‌ను ప్రారంభించిన ఈ హైదరాబాదీ ఆ తర్వాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో తొలిసారిగా ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌గా నిలిచింది. స్వదేశంలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సైనా మొదటిసారి చాంపియన్‌గా అవతరించింది. ఈ విజయంతో సైనా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అనంతరం ఎంతోకాలంగా అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్ని సైనా తన ఖాతాలో వేసుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో సైనా ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని సంపాదించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది.
 
 అదిరిన ‘గురి’
 ఆర్చరీలో దీపిక కుమారి కూడా గొప్ప విజయాలు సాధించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తన సహచరులు రిమిల్ బురులీ, లక్ష్మీరాణిలతో కలిసి దీపిక టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు రజత పతకాన్ని అందించింది. దాంతోపాటు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. జార్ఖండ్‌కు చెందిన దీపిక వరల్డ్ కప్ ఫైనల్లో రజతం, వరల్డ్ కప్ స్టేజ్-2 టోర్నీలో, ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు గెలిచింది.
 
 పద్మ భూషణ్ లభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. భవిష్యత్‌లో మరిన్ని
 గొప్ప విజయాలు సాధించేందుకు ఈ పురస్కారం ప్రేరణగా
  నిలుస్తుంది.        -సానియా
 
ఈ పురస్కారాన్ని నేనూహించలేదు. ఈ వార్త నన్ను ఆశ్చర్యంతోపాటు ఆనందాన్ని కలిగించింది. 25 ఏళ్లకే ఈ అవార్డును పొందిన నేను భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించేందుకు
 ఉత్సాహాన్నిస్తుంది.    -సైనా
 
 పద్మశ్రీ రావడం నమ్మలేకపోతున్నాను. ఈ పురస్కారాన్ని నా కుటుంబ సభ్యులకు, కోచ్‌లకు అంకితం ఇస్తున్నాను. 2012లో అర్జున అవార్డు వచ్చినపుడు నాన్నతో కలిసివెళ్లి పురస్కారాన్ని అందుకున్నాను. ఈసారి నా తల్లిదండ్రులిద్దరినీ వెంట తీసుకెళతాను.                    -దీపిక
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement