కొత్త పరిశోధన
యాంజియోగ్రామ్ చేసే సమయంలో కాలి నుంచి కాథెటర్‌ను గుండెకు పంపే బదులు చేతి నుంచి గుండెకు పంపడమే చాలా మంచిదని డచ్ అధ్యయనం పేర్కొంటోంది. యాంజియోగ్రామ్ ద్వారా గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటాయా అన్న అంశాన్ని తెలుసుకుంటారన్న విషయం తెలిసిందే. దీన్ని సాధారణంగా ఫీమోరల్ అప్రోచ్ అనే విధానంలో తొడ భాగం (గ్రోయిన్) నుంచి గుండె వరకు ఒక క్యాథెటర్ (పైప్)ను పంపుతారు. ఇక మరికొన్ని సందర్భాల్లో చేతి నరం నుంచి కూడా పంపుతారు. దీన్నే రేడియల్ అప్రోచ్ విధానంగా పేర్కొంటారు. హార్ట్‌ఎటాక్‌కు గురైన 8,404 మందిపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో సగం మందికి కాలి నుంచి మిగతా సగానికి చేతి నుంచి గుండె వరకు క్యాథెటర్ పంపారు.
అయితే కాలి నుంచి క్యాథెటర్ పంపినవారిలో 429 మందిలో కొన్ని దుష్పరిణామాలు సంభవించగా చేతి నుంచి పంపిన వారిలో కేవలం 369 మందిలోనే ఇలాంటి అవాంఛిత దుష్పరిణామాలు సంభవించాయి. వీరు మినహా మిగతావారిలో ఎలాంటి దుష్పరిణామాలూ సంభవించలేదు. కాబట్టి కాలి నుంచి యాంజియోగ్రామ్ చేయడం కంటే చేతి నుంచి చేయడమే సురక్షితమని డచ్ డాక్టర్లు... అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో నిర్వహించిన ఒక సైంటిఫిక్ సదస్సులో పేర్కొన్నారు. ఇదే విషయం ‘ద లాన్సెట్’ అనే మెడికల్ జర్నల్‌లోనూ ప్రచురితమైంది.
‘యాంజియో’లో చేతి నుంచి గుండెకు చేరడమే బెస్ట్!
Published Mon, Jul 13 2015 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM
Advertisement