కార్డియాలజీ కౌన్సెలింగ్
ఏ స్టెంట్ వేయించుకోమంటారు?
నా వయసు 40 ఏళ్లు. ఇటీవలే ఒక ఆసుపత్రిలో యాంజియోగ్రామ్ చేయించుకున్నాను. రక్తనాళాల్లో రెండు చోట్ల అడ్డంకి (బ్లాక్) ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. దానికి ఆరోగ్యశ్రీలో ఇచ్చే ట్రీట్‌మెంట్ కంటే, అధిక ఖర్చుతో కూడుకున్న ‘కరిగిపోయే స్టెంట్’ వేయిస్తే మంచిదని చెప్పారు. నాకు అంత ఆర్థిక స్తోమత లేదు. కానీ ఎలాగైనా అదే అవసరం అంటే మా పొలమో, మరేదైనా ఆస్తి మాది కాదనుకొని చికిత్స తీసుకుంటాను. దయచేసి నాకు మంచి సలహా ఇవ్వండి.
- సోమేశ్వరరావు, కర్నూలు
మీ వయసు కేవలం 40 ఏళ్లే కాబట్టి మీకు ఆర్థికపరమైన ఇబ్బంది లేకుంటే ‘శరీరంలో కరిగే స్టెంట్స్ (బయో అబ్జార్బబుల్ స్కాఫోల్డ్) వేయించుకోగలిగితే మంచిదే. కానీ దానికోసం ఆర్థికపరమైన ఇతర ఇబ్బందులు తెచ్చుకోకండి. ఆరోగ్యశ్రీలో కూడా ఇటీవలే మందుపూత ఉన్న స్టెంట్స్ కూడా వేస్తున్నారు. కాబట్టి ఆ చికిత్స కూడా చేయించుకోవచ్చు. ఏ విధమైన స్టెంట్స్ వేసినా కూడా... ఆ తర్వాత డాక్టర్లు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడుతూ, యోగా, వాకింగ్ వంటి వ్యాయామాలు చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. కాబట్టి మీకు తగిన స్తోమత లేకపోతే ఆరోగ్యశ్రీలో మందుపూత ఉన్న స్టెంట్ వేయించుకోవడమూ అన్నివిధాలా మంచిదే.
నా వయసు 60 ఏళ్లు. నాకు గత కొద్దిరోజులుగా కాళ్లవాపులు వస్తున్నాయి. ‘హార్ట్ ఫెయిల్ అవ్వడం వల్లనే ఇలా జరుగుతుంది’ అని నా మిత్రుడు ఒకరు చెప్పారు. ‘హార్ట్ ఫెయిల్యూర్’ అంటే ఏమిటి? నాకు కాళ్ల వాపు ఎందుకు వస్తోంది?
- సుకుమార్, ఖమ్మం
రక్తాన్ని పంపింగ్ చేసే సామర్థ్యం తగ్గి, గుండె మీ శరీరంలోని అన్ని భాగాలకూ రక్తసరఫరా సరిగా చేయలేని కండిషన్‌ను ‘హార్ట్ ఫెయిల్యూర్’గా పరిగణిస్తారు. ఆ కండిషన్ వచ్చినప్పుడు ఆయాసం రావడం, కాళ్ల వాపులు రావడం జరుగుతుంది. కానీ మీకు ఆయాసం లేకుండా, కేవలం కాళ్ల వాపు మాత్రమే వస్తోంది. కాబట్టి దీనికి కారణమేమిటో నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాలైన బీపీ మందుల వల్ల (ఉదా: ఆమ్లోడెపిన్) కూడా కాళ్లవాపు రావచ్చు. మీ కాళ్లవాపునకు ఇదే కారణమైతే మందు మార్చిన కొద్దిరోజులకే వాపు కూడా తగ్గుతుంది. ఇలా కాకుండా ఒకవేళ నిజంగానే హార్ట్ ఫెయిల్యూర్ వల్లనే ఇలా జరుగుతోందని మీరు అనుమానిస్తుంటే... డాక్టర్‌ను కలిసి ఏ కారణం వల్ల గుండె సామర్థ్యం తగ్గిందో తెలుసుకొని దానికి తగిన మందులు తీసుకోవచ్చు. నిజంగానే గుండెసామర్థ్యం తగ్గినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీఆర్‌టీ, సీఆర్‌టీడీ అనే పేస్‌మేకర్స్ పరికరాలను అమర్చుకుని గుండె పంపింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మీరు ఆందోళన చెందకుండా వెంటనే గుండె వైద్య నిపుణుడిని కలవండి.