Angiogram
-
గుండెపోటు.. పరీక్షలు
మనలోని ప్రతి అవయవానికి నిరంతరం రక్తం సరఫరా అయి తీరాలి. గుండెకు కూడా. గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో ఏదైనా అకస్మాత్తుగా మూసుకుపోతే గుండె కండరానికి రక్తసరఫరా నిలిచిపోయి రక్తం ద్వారా అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందవు. దాంతో గుండె కండరం దెబ్బతినడం మొదలవుతుంది. అలాంటప్పుడు ఆరు నుంచి పన్నెండు గంటల్లో దానికి అందాల్సిన పాళ్లలో రక్తసరఫరాను పునరుద్ధరించలేకపోతే... ఇకపై మళ్లీ ఎప్పటికీ కోలుకోలేనంతగా శాశ్వతంగా గుండె కండరం చచ్చుబడిపోతుంది. ఒకసారి గుండెకండరం శాశ్వతంగా చచ్చుబడితే... దాని వల్ల శరీరంలోని మిగతా అన్ని అవయవాలకూ రక్తం అందకుండాపోయిన మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎంత త్వరగా గుండెకు రక్తసరఫరాను పునరుద్ధరించగలిగితే అంత మంచిది. ఎంత త్వరగా గుండె కండరాన్ని చచ్చుబడకుండా చూస్తే అంత సమర్థంగా రోగికి మరణాన్ని తప్పించినట్లవుతుంది. అందుకే గుండెపోటును నిర్ధారణ చేసే పరీక్షలు వెంటనే చేయించాలి. హార్ట్ ఎటాక్ నిర్ధారణకు పరీక్షలు... ఈసీజీ: ఛాతీ నొప్పి వచ్చిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్ష ఇది. గుండెపోటు అయితే 80, 90 శాతం కేసుల్లో ఆ విషయం నిర్ధారణ అవుతుంది. అంతేకాదు... గతంలో వారికి గుండెపోటు వచ్చి ఉండి, ఆ విషయం రోగికి తెలియకున్నా ఈ పరీక్షతో గతంలో వచ్చిన గుండెపోటునూ గుర్తించవచ్చు.అయితే కొన్నిసార్లు చాలా చిన్న గుండెపోటును ఈసీజీ గుర్తించలేకపోవచ్చు. అయితే ఈసీజీ గతంలోని గుండెజబ్బుల విషయంలో కొన్ని క్లూస్ ఇస్తుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అది ఇచ్చే క్లూస్ అన్నీ నూరు శాతం కచ్చితం కాకపోవచ్చు. అయినప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయకుండా, వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే గుండెపోటు వచ్చిన వెంటనే ఈసీజీ తీయించినా గుండెపోటు వల్ల కలిగే మార్పులను ఈ పరీక్ష వెంటనే నమోదు చేయలేకపోవచ్చు. అందుకే గుండెనొప్పి / ఛాతీనొప్పి వచ్చాక 45 నిమిషాల తర్వాత కనీసం 2 లేదా 3 ఈసీజీలను తీశాక కూడా అందులో మార్పులు లేవంటే అప్పుడు గుండెపోటు రాలేదని 99 శాతం కచ్చితత్వంతో చెప్పవచ్చు. ఎకో పరీక్ష : గుండెస్పందనల్లోని మార్పులు, గుండె కండరంలో వచ్చిన మార్పులను ఎకో పరీక్ష తెలుపుతుంది. ఇక గుండెపోటు వచ్చినప్పుడు గుండెస్పందనల్లో మార్పులు రావచ్చు కాబట్టి గుండెపోటు నిర్ధారణ కోసం ఎకో పరీక్షపైనా ఆధారపడవచ్చు. పైగా గుండెజబ్బు వల్ల ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ఆ విషయం తెలుసుకునేందుకు ఎకో పరీక్షలో అవకాశాలు 95 శాతం కంటే ఎక్కువ. కాకపోతే ఈ పరీక్ష ఈసీజీ కంటే కాస్తంత ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. కాకపోతే దీన్ని తప్పనిసరిగా ఎకో పరీక్ష నిర్వహించడంలో తర్ఫీదు పొందిన నైపుణ్యం కలిగిన కార్డియాలజిస్టులే నిర్వహించాలి. హైసెన్సిటివిటీ ట్రోపోనిన్‌లు : గుండెపోటు వచ్చిన 4 గంటల లోపే రక్తంలో హైసెన్సిటివిటీ ట్రోపోనిన్ల పాళ్లు పెరుగుతాయి. ఈ పరీక్ష ద్వారా ఆ విషయం నిర్ధారణ అయితే, ఎంత చిన్న గుండెపోటు అయినప్పటికీ అది తప్పనిసరిగా గుండెపోటే అన్న విషయం కచ్చితంగా నిర్ధారణవుతుంది. యాంజియోగ్రామ్: గుండెపోటు అని సందేహం కలిగినప్పుడు వ్యాధి నిర్ధారణ కచ్చితంగా చేయగలిగే మరో పరీక్ష యాంజియోగ్రామ్. కొన్నిసార్లు ఈసీజీ మార్పులు స్పష్టంగా లేకపోయినా, ఎకో పరీక్ష మనకు సరైన క్లూస్ ఇవ్వలేకపోయినా ఈ పరీక్ష వాటిని సమకూరుస్తుంది. దాంతోపాటు గుండె రక్తనాళాల స్థితి, అందులోని అడ్డంకుల వంటివి కచ్చితంగా తెలుస్తాయి. అయితే ఈసీజీ, ఎకోలతో పోలిస్తే ఈ పరీక్షకు అయ్యే ఖర్చు ఎక్కువ. యాంజియోగ్రామ్‌లో వచ్చే ఫలితాలు 99 శాతం కంటే ఎక్కువగా నమ్మదగినవి. -డాక్టర్ అనుజ్ కపాడియా సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ ,బంజారాహిల్స్ హైదరాబాద్. -
‘యాంజియో’లో చేతి నుంచి గుండెకు చేరడమే బెస్ట్!
కొత్త పరిశోధన యాంజియోగ్రామ్ చేసే సమయంలో కాలి నుంచి కాథెటర్‌ను గుండెకు పంపే బదులు చేతి నుంచి గుండెకు పంపడమే చాలా మంచిదని డచ్ అధ్యయనం పేర్కొంటోంది. యాంజియోగ్రామ్ ద్వారా గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటాయా అన్న అంశాన్ని తెలుసుకుంటారన్న విషయం తెలిసిందే. దీన్ని సాధారణంగా ఫీమోరల్ అప్రోచ్ అనే విధానంలో తొడ భాగం (గ్రోయిన్) నుంచి గుండె వరకు ఒక క్యాథెటర్ (పైప్)ను పంపుతారు. ఇక మరికొన్ని సందర్భాల్లో చేతి నరం నుంచి కూడా పంపుతారు. దీన్నే రేడియల్ అప్రోచ్ విధానంగా పేర్కొంటారు. హార్ట్ఎటాక్కు గురైన 8,404 మందిపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో సగం మందికి కాలి నుంచి మిగతా సగానికి చేతి నుంచి గుండె వరకు క్యాథెటర్ పంపారు. అయితే కాలి నుంచి క్యాథెటర్ పంపినవారిలో 429 మందిలో కొన్ని దుష్పరిణామాలు సంభవించగా చేతి నుంచి పంపిన వారిలో కేవలం 369 మందిలోనే ఇలాంటి అవాంఛిత దుష్పరిణామాలు సంభవించాయి. వీరు మినహా మిగతావారిలో ఎలాంటి దుష్పరిణామాలూ సంభవించలేదు. కాబట్టి కాలి నుంచి యాంజియోగ్రామ్ చేయడం కంటే చేతి నుంచి చేయడమే సురక్షితమని డచ్ డాక్టర్లు... అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో నిర్వహించిన ఒక సైంటిఫిక్ సదస్సులో పేర్కొన్నారు. ఇదే విషయం ‘ద లాన్సెట్’ అనే మెడికల్ జర్నల్‌లోనూ ప్రచురితమైంది. -
కార్డియాలజీ కౌన్సెలింగ్
ఏ స్టెంట్ వేయించుకోమంటారు? నా వయసు 40 ఏళ్లు. ఇటీవలే ఒక ఆసుపత్రిలో యాంజియోగ్రామ్ చేయించుకున్నాను. రక్తనాళాల్లో రెండు చోట్ల అడ్డంకి (బ్లాక్) ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. దానికి ఆరోగ్యశ్రీలో ఇచ్చే ట్రీట్మెంట్ కంటే, అధిక ఖర్చుతో కూడుకున్న ‘కరిగిపోయే స్టెంట్’ వేయిస్తే మంచిదని చెప్పారు. నాకు అంత ఆర్థిక స్తోమత లేదు. కానీ ఎలాగైనా అదే అవసరం అంటే మా పొలమో, మరేదైనా ఆస్తి మాది కాదనుకొని చికిత్స తీసుకుంటాను. దయచేసి నాకు మంచి సలహా ఇవ్వండి. - సోమేశ్వరరావు, కర్నూలు మీ వయసు కేవలం 40 ఏళ్లే కాబట్టి మీకు ఆర్థికపరమైన ఇబ్బంది లేకుంటే ‘శరీరంలో కరిగే స్టెంట్స్ (బయో అబ్జార్బబుల్ స్కాఫోల్డ్) వేయించుకోగలిగితే మంచిదే. కానీ దానికోసం ఆర్థికపరమైన ఇతర ఇబ్బందులు తెచ్చుకోకండి. ఆరోగ్యశ్రీలో కూడా ఇటీవలే మందుపూత ఉన్న స్టెంట్స్ కూడా వేస్తున్నారు. కాబట్టి ఆ చికిత్స కూడా చేయించుకోవచ్చు. ఏ విధమైన స్టెంట్స్ వేసినా కూడా... ఆ తర్వాత డాక్టర్లు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడుతూ, యోగా, వాకింగ్ వంటి వ్యాయామాలు చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. కాబట్టి మీకు తగిన స్తోమత లేకపోతే ఆరోగ్యశ్రీలో మందుపూత ఉన్న స్టెంట్ వేయించుకోవడమూ అన్నివిధాలా మంచిదే. నా వయసు 60 ఏళ్లు. నాకు గత కొద్దిరోజులుగా కాళ్లవాపులు వస్తున్నాయి. ‘హార్ట్ ఫెయిల్ అవ్వడం వల్లనే ఇలా జరుగుతుంది’ అని నా మిత్రుడు ఒకరు చెప్పారు. ‘హార్ట్ ఫెయిల్యూర్’ అంటే ఏమిటి? నాకు కాళ్ల వాపు ఎందుకు వస్తోంది? - సుకుమార్, ఖమ్మం రక్తాన్ని పంపింగ్ చేసే సామర్థ్యం తగ్గి, గుండె మీ శరీరంలోని అన్ని భాగాలకూ రక్తసరఫరా సరిగా చేయలేని కండిషన్‌ను ‘హార్ట్ ఫెయిల్యూర్’గా పరిగణిస్తారు. ఆ కండిషన్ వచ్చినప్పుడు ఆయాసం రావడం, కాళ్ల వాపులు రావడం జరుగుతుంది. కానీ మీకు ఆయాసం లేకుండా, కేవలం కాళ్ల వాపు మాత్రమే వస్తోంది. కాబట్టి దీనికి కారణమేమిటో నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాలైన బీపీ మందుల వల్ల (ఉదా: ఆమ్లోడెపిన్) కూడా కాళ్లవాపు రావచ్చు. మీ కాళ్లవాపునకు ఇదే కారణమైతే మందు మార్చిన కొద్దిరోజులకే వాపు కూడా తగ్గుతుంది. ఇలా కాకుండా ఒకవేళ నిజంగానే హార్ట్ ఫెయిల్యూర్ వల్లనే ఇలా జరుగుతోందని మీరు అనుమానిస్తుంటే... డాక్టర్‌ను కలిసి ఏ కారణం వల్ల గుండె సామర్థ్యం తగ్గిందో తెలుసుకొని దానికి తగిన మందులు తీసుకోవచ్చు. నిజంగానే గుండెసామర్థ్యం తగ్గినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీఆర్టీ, సీఆర్టీడీ అనే పేస్‌మేకర్స్ పరికరాలను అమర్చుకుని గుండె పంపింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మీరు ఆందోళన చెందకుండా వెంటనే గుండె వైద్య నిపుణుడిని కలవండి.