కడుపు చల్లగా అన్న'మ్మ' | Annamma Providing Food To Poor People For Low Price In Kurnool | Sakshi
Sakshi News home page

కడుపు చల్లగా అన్న'మ్మ'

Published Wed, Feb 12 2020 12:43 AM | Last Updated on Wed, Feb 12 2020 12:43 AM

Annamma Providing Food To Poor People For Low Price In Kurnool - Sakshi

అవ్వ లక్ష్మీదేవి

అవ్వ కావాలా.. బువ్వ కావాలా అంటుంటారు.. ఏదో ఒకటే.. అనే అర్థంలో. కర్నూలు పాతబస్తీలోని ఓ హోటల్‌లో మాత్రం అవ్వే స్వయంగా బువ్వ వడ్డిస్తుంది. నాణ్యమైన బియ్యంతో చేసిన అన్నం, పప్పు, సాంబారు, కూర, పచ్చడి, మజ్జిగ మధ్యాహ్న భోజనంగా అందిస్తోన్న ఆ అవ్వ పేరు లక్ష్మీదేవి. కడుపు మాడ్చుకునే నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఈమె పదిహేనేళ్లుగా చవగ్గా అన్నం పెడుతోంది. అలాగని ధనవంతురాలేమీ కాదు.. ఆస్తిపాస్తులు అసలే లేవు. ఆమె అనుభవాలే ఆమెను ‘అన్న’మ్మగా మార్చాయి.

అవ్వ భర్త తిప్పన్న. రైతుల పొలాలకు పేడను సరఫరా చేసేవారు. యాభై ఐదు ఏళ్ల క్రితం వీళ్ల వివాహం అయింది. ఐదేళ్లకు కొడుకు పుట్టాడు. పెళ్లయ్యాక పదేళ్లు ఆ కుటుంబం సుఖంగానే ఉంది. అప్పటివరకు ఆకలి బాధేంటో అవ్వకు తెలీదు. ఆ సమయంలో భర్త హటాత్తుగా మరణించడంతో అవ్వ జీవితం అంధకారం అయింది. అవ్వ ఓ గచ్చు గానుగలో పనికి కుదిరింది. రాత్రింబవళ్లు కష్టపడినా కూలీడబ్బులు వారానికి యాభై రూపాయలు మాత్రమే. పెద్ద పడఖానాలో వాళ్లుండే ఆ ఇరుకింటిలోనే జీవనం. వర్షానికి కారుతున్నా మరమ్మతులకు డబ్బులుండేవి కావు. కనీసం టీ తాగడానికి డబ్బులు ఉండేవి కావు. ఇంతటి ఆర్థిక కష్టాన్ని సైతం ఆమె ఎదురీదుతూ కుమారుడిని ఏడో తరగతి దాకా చదివించుకుంది. కొన్నాళ్లకు గానుగలకు డిమాండ్‌ పడిపోయింది. అవ్వ ఉపాధి కోల్పోయింది. జైన మందిరంలో నెలకు తొమ్మిది వందల రూపాయలకు పనిలో చేరింది. అక్కడ పదిహేనేళ్లు పనిచేస్తే జీతం ఐదొందలు పెరిగింది. 1994లో తన కొడుకు మద్దయ్య కు కర్నూలుకే చెందిన సుభద్రతో పెళ్లి చేసింది.

ఆకలిని చూడలేక
ఇద్దరికి ముగ్గురయ్యారు కాబట్టి సొంతంగా ఏదైనా చెయ్యాలనుకుంది అవ్వ. మండీబజార్‌లో ఆరొందల రూపాయలకు ఓ చిన్నగదిని అద్దెకు తీసుకుంది. కొడుకు సాయంతో మొదట ఉగ్గాణి, బజ్జి వంటి టిఫిన్‌ పదార్థాలను చేసి అమ్మింది. మండీబజార్‌కు దూర ప్రాంతాల నుంచి సరుకుల లారీలు వస్తుంటాయి. నగరంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన హమాలీలు లారీల్లోంచి సరుకుల బస్తాలు దింపుతుంటారు. మధ్యాహ్న సమయంలో భోంచేయడానికి ఇళ్ల వద్ద నుంచి చద్దిమూట తెచ్చుకునే వారు. తెల్లవారు జామునే వారు తెచ్చుకున్న అన్నం పాచిపోయేది. పప్పు వాసన కొట్టేది. చేతిలో డబ్బులేక వారు బజ్జీ తిని కాలం వెళ్లబోసుకునే వారు. అలా వారి ఆకలి నకనకలను అవ్వ అతి సమీపం నుంచి చూసింది. ఏదో ఒక రీతిలో వారికి సాయం చేయాలనే సంకల్పానికి వచ్చింది. తను బజ్జీలమ్మే గదిలోనే నాణ్యమైన బియ్యంతో అన్నం తయారు చేసి పది రూపాయలకే విక్రయించింది. ధర చౌకగా ఉండటం వల్ల హమాలీలు రావడం మొదలు పెట్టారు. ఆ పది రూపాయలకే అన్నంతో పాటు పప్పు, సాంబారు, పచ్చడి, మజ్జిగలను వడ్డించేది. 
వడ్డనలో అవ్వ కోడలు సుభద్ర 

వరదల్లో నష్టం
2009లో కర్నూలుకు వరదలు వచ్చాయి. నిల్వ ఉంచుకున్న కొన్ని బియ్యం బస్తాలు, ఇతర ఆహార దినుసులు పాడైపోయాయి. పుంజుకోవడానికి సమయం పట్టింది. అయినా అవ్వ అధైర్య పడలేదు. అన్నం వడ్డింపునకు అంతరాయం కలిగించలేదు. భోజన ధరను పదిహేను రూపాయలు చేసింది. స్థలం చాలడం లేదని 2014లో ఎదురుగా ఉండే షాపులోకి తన హోటల్‌ను మార్చింది. కొడుకు, కోడలు అవ్వకు తోడుగా నిలిచారు. హమాలీలతో పాటు షాపుల్లో పనిచేసే గుమస్తాలు, పనిమీద నగరానికి వచ్చిన వారు, రైతు బజార్‌ రైతులు, నిరుపేదలు వస్తుండటంతో అవ్వ అన్నానికి క్రమేపీ గిరాకీ పెరిగింది. భోజనం పెట్టే వేళలను కూడా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పొడిగించింది. బియ్యం ధర కేజీ యాభై రూపాయలు ఉన్న ప్రస్తుత రోజుల్లోనూ అవ్వ ఇరవై ఐదు రూపాయలకే భోజనం వడ్డిస్తుండటం విశేషం
– ఎస్‌. సర్దార్‌బాషా ఖాద్రి, సాక్షి, కర్నూలు ఫొటోలు : డి.హుసేన్‌ 

సేవతో సంతృప్తి  
హోటల్‌ని మేమే స్వయంగా నిర్వహించుకుంటాం కాబట్టి మాకు పనివాళ్ల అవసరం ఉండదు. వేతనాల చెల్లింపుల ఖర్చు అసలే ఉండదు. బియ్యం లూజుగా కొంటే ధర ఎక్కువ. మేం ఒకేసారి ఐదారు బస్తాలు కొనేస్తాం. చౌకధరకు లభిస్తాయి. లాభం కోసం హోటల్‌ని నడపడం లేదు. పేదలకు సైతం కడుపు నింపుకునే అవకాశం కల్పించడం నాకు, మా కుటుంబానికి ఎంతగానో సంతృప్తినిస్తోంది. ఇటీవలే కంటి ఆపరేషన్‌ చేసుకున్నా. అయినా ఇంట్లో ఉండలేకపోయా. నా పేరుతోనే హోటల్‌ నడుస్తుంది కాబట్టి పనిలోకి వెంటనే వచ్చేశా.
– అవ్వ (కురువ లక్ష్మీదేవి) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement