పక్కింటి హీరోయిన్‌ | anupama Parameswaran special interview for her birthday | Sakshi
Sakshi News home page

పక్కింటి హీరోయిన్‌

Published Sun, Feb 26 2017 12:36 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

anupama Parameswaran special interview for her birthday


కొంతమంది హీరోయిన్లను చూస్తే అలా అనిపిస్తుంది.
ఎలా అనిపిస్తుంది?
అదేనండీ... మన పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది.
అనుపమా పరమేశ్వరన్‌ అచ్చు అలానే అనిపిస్తుంది.
తెలుగింటి అమ్మాయిలా అనిపించకపోయినా కేరళ నుంచి వచ్చిన పక్కింటి అమ్మాయి అనిపిస్తుంది.
సాక్షితో ఎక్స్‌క్లూజివ్‌గా పిట్టగోడ కబుర్లు...



ఈ మధ్యే 21వ బర్త్‌డే జరుపుకున్నారు. ఏమైనా స్పెషల్‌ గిఫ్ట్స్‌ అందుకున్నారా?
అనుపమా పరమేశ్వరన్‌: ఈసారి నా పుట్టినరోజును కేరళలో మా ఫ్యామిలీతో ఫ్రెండ్స్‌తో జరుపుకు న్నాను. బర్త్‌డేకి గిఫ్ట్స్‌ రావడం మామూలే. నా దృష్టిలో పెద్ద గిఫ్ట్‌ అంటే నన్ను ఇష్టపడేవాళ్లు గుర్తుపెట్టుకుని విషెస్‌ చెప్పడం. ఆ గిఫ్ట్స్‌ చాలా అందుకున్నా.

ఇంతకీ వేలంటైన్స్‌ డేకి ఎన్ని గులాబీలు అందుకున్నారు..
ఏం అడుగుతున్నారో అర్థమైంది. వేలంటైన్స్‌ డేని ప్రేమికులే జరుపుకోవాల్సిన అవసరం లేదు. అభిమానం ఉన్న ఏ ఇద్దరు వ్యక్తులైనా చేసుకోవచ్చు. నా స్వీట్‌ ఫ్యాన్స్‌ నాకు బోల్డన్ని పువ్వులు, గ్రీటింగ్‌ కార్డులూ పంపించారు. అసలు నాకు ‘ఫ్యాన్స్‌’ అనే పదం ఇష్టం ఉండదు. నేను వాళ్లకు ‘వెల్‌ విషర్స్‌’ అని పేరు పెట్టాను. తెరపై నన్ను చూసి, అభిమానిస్తున్నారు. నాకు ఇంత క్రేజ్‌ రావడానికి కారణమవుతున్నారు. అందుకే ఆ పేరు పెట్టా.

జీవితంలో ‘బెస్ట్‌ డేస్‌’ రావాలంటే ‘బ్యాడ్‌ డేస్‌’తో ఫైట్‌ చేయాలి
జీవితంలో తప్పులనేవి ఉండవు.. పాఠాలే ఉంటాయి

మీ మలయాళీ అమ్మాయిలు తళతళ మెరిసిపోతుంటారు. జుత్తు సిల్కీగా ఉంటుంది. కొబ్బరి మహత్యమా?
కొంత కొబ్బరికి, కొంత కేరళ వాతావరణానికి ఇవ్వాలి. చాలా కూల్‌గా ఉంటుంది. పొల్యూషన్‌ తక్కువ. కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. మేం తలకి మాత్రమే కాదు.. వంటకి కూడా కొబ్బరి నూనె వాడతాం. మా తళతళలకు కారణం అదే (నవ్వుతూ). నిజానికి నా జుత్తు బాగుండేది. కేరళ నుంచి బయట అడుగుపెట్టనంతవరకూ నో ప్రాబ్లమ్‌. సినిమాలు చేయడం మొదలుపెట్టాక ఊళ్లు పట్టుకు తిరుగుతున్నాను కదా.. జుత్తు రాలిపోతోంది.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ‘నా హెయిర్‌ అంటే నాకు చాలా ఇష్టం.. మణిరత్నం అడిగినా కట్‌ చేయను’ అన్నారు.. ఇప్పుడూ అదే సమాధానమా?
క్యాజువల్‌గా మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చిన టాపిక్‌ అది. అందుకే నేనూ సీరియస్‌గా జవాబివ్వలేదు. కానీ, కొంతమంది సీరియస్‌ చేసేశారు. ఇప్పుడు మీరీ ప్రశ్న అడిగారు కాబట్టి చెబుతున్నా.. కట్‌ చేయను అనను. క్యారెక్టర్‌ బాగుంటే ఆలోచిస్తా.

మీలాంటి అందగత్తెలకు లవ్‌ లెటర్స్‌ రాకుండా ఉండవు..
అవును. చాలానే వచ్చాయి. చిన్న వయసులో వచ్చే ప్రేమలేఖలన్నీ చదవడానికి బాగుంటాయి. జీవితానికి పనికి రావేమో. ఎందుకంటే టీనేజ్‌లో ఎట్రాక్షన్‌ ఎక్కువ ఉంటుంది కదా.

మీరు ఎవరి మీదైనా మనసు పారేసుకున్నారా?
మనసు ఉన్నదే పారేసుకోవడానికి (నవ్వుతూ). చాలాసార్లు పారేసుకున్నాను. అయితే సీరియస్‌గా కాదు.

అసలు సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది?
చిన్నప్పుడే యాక్టింగ్‌ మీద ఇంట్రస్ట్‌ ఏర్పడింది. స్కూల్లో డ్రామాల్లో నటించేదాన్ని. అలాగే మా ఇంటి దగ్గర థియేటర్‌ ఆర్ట్స్‌కి సంబంధించిన స్కూల్‌ ఉంటే అందులో జాయిన్‌ అయ్యాను. నటన లో మనం మనలా కాకుండా వేరేవాళ్లలా జీవించాలి. అందుకే యాక్టింగ్‌ని కెరీర్‌గా ఎంపిక చేసుకున్నా.

మరి.. ఇంట్లోవాళ్లు ఏమీ అనలేదా?
సినిమా ఫీల్డ్‌ చాలా పెద్దది కాబట్టి ఎలా ఉంటుందో అనుకున్నారు. మలయాళ ‘ప్రేమమ్‌’కి అవకాశం వచ్చినప్పుడు అమ్మానాన్నలకు చాలా డౌట్స్‌ ఉండేవి. కానీ అల్ఫోన్స్, హీరో నివిన్‌.. ఇలా అందరితో పరిచయం అయ్యాక నమ్మకం కుదిరింది. నా మీద వాళ్లకు ఎలాంటి డౌటూ లేదు. ‘ప్రేమమ్‌’ తర్వాత నా మీద ఉన్న నమ్మకం బలపడింది.

రెండేళ్ల క్రితం మీరు నార్మల్‌ గర్ల్‌. ఇప్పుడు స్టార్‌.. ఎలా అనిపిస్తోంది?
రెండేళ్ల క్రితం వరకు నా కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్‌.. ఇలా కొద్దిమందికి మాత్రమే నేను తెలుసు. ఇప్పుడు కేరళతో పాటు తమిళ, తెలుగు రాష్ట్రాల్లోనూ వెల్‌ విషెర్స్‌ను సంపాదించుకోగలిగాను. మొన్నా మధ్య హైదరాబాద్‌లో ఓ షాపింగ్‌ మాల్‌కి వెళ్లాను. జస్ట్‌ కళ్లు, ముక్కు మాత్రమే కనిపించేట్లుగా డ్రెస్‌ చేసుకున్నాను. ఓ అబ్బాయి నన్ను అదే పనిగా చూడటం మొదలుపెట్టాడు. చివరికి ‘మీరు అనుపమా పరమేశ్వరన్‌ కదూ’ అనడిగాడు. షాక్‌ అయ్యి, ‘కాదు’ అన్నాను. ‘మీ కళ్లు మీరు అనుపమా అని చెప్పేస్తున్నాయ్‌’ అన్నాడు. ఎంత హ్యాపీ అనిపించిందో మాటల్లో చెప్పలేను.

‘హీరోయిన్‌’ అనే కొత్త హోదాని హ్యాండిల్‌ చేయడంలో ఏదైనా ఇబ్బంది ఉందా?
కొంచెం కష్టమే. నాలా ఓ మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయికి మా స్థాయికి మించి ఏ హోదా వచ్చినా అది హ్యాండిల్‌ చేయడం కష్టమే. అమ్మా–నాన్న–అన్నయ్య–నేను. చిన్న ప్రపంచం. ఇప్పుడు పెద్ద ప్రపంచంలోకి వచ్చేశాను. ఈ స్టేటస్‌ని ఎలా హ్యాండిల్‌ చేయాలనే విషయంలో చిన్న కన్‌ఫ్యూజన్‌ ఉంది. కాదనడంలేదు. ఈ కన్‌ఫ్యూజన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాను.

సంక్రాంతికి ‘శతమానం భవతి’ సక్సెస్‌తో ఫుల్‌ హ్యాపీ.. రెండు పండగలు చేసుకున్నారన్న మాట...
యాక్చువల్లీ ఒక్క పండగే చేసుకున్నానండీ. మా కేరళలో సంక్రాంతి పెద్దగా సెలబ్రేట్‌ చేసుకోం. అందుకని నాకా పండగ గురించి తెలియదు. అయితే ఇక నుంచి సంక్రాంతి అంటే నాకు ‘శతమానం భవతి’. ప్రతి సంవత్సరం జనవరి 14న అందరూ సంక్రాంతి పండగ చేసుకుంటే, నేను ‘శతమానం భవతి’ సక్సెస్‌ని తలుచుకుని పండగ చేసుకుంటా.

► పోటీలో రెండు పెద్ద సినిమాలు (‘ఖైదీ నం. 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’) నిలబడ్డాయి కదా.. భయం అనిపించలేదా?
ఆ సినిమాలతో మాకు పోటీ ఏంటి? మేం చిన్నవాళ్లం కలసి సినిమా చేశాం. అయితే మాది ఫ్యామిలీ సినిమా కాబట్టి కాన్ఫిడెంట్‌గానే ఉండేవాళ్లం. నేను ఆ రెండు సినిమాలు కూడా చూశాను.  ఏ సినిమా రేంజ్‌లో ఆ సినిమా బాగుంది. సంక్రాంతికి అందరం హ్యాపీ.

శర్వానంద్‌తో మీ కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయినట్టుంది...
(నవ్వేస్తూ) సినిమాలో ఉన్న సీన్స్‌ అలాంటివి. బావా–మరదల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్‌ అయితేనే ఆడియన్స్‌ కనెక్ట్‌ అవుతారు. ఓ 50 రోజులు కలసి పని చేశాం కాబట్టి మంచి ఫ్రెండ్స్‌ అయ్యాం. కెమిస్ట్రీ వర్కవుట్‌ కావడానికి అది కూడా ఓ రీజన్‌.

నేను–నా దర్శకులు
ఇప్పటివరకూ నేను తెలుగులో ముగ్గురు దర్శకులతో
పని చేశాను. వాళ్ల గురించి ఏం చెబుతానంటే..


త్రివిక్రమ్‌:  ‘అఆ’ ఒప్పుకున్నప్పుడు నాకు తెలుగు లాంగ్వేజ్‌ ఎలా ఉంటుందో చిన్న ‘క్లూ’ కూడా లేదు. దాంతో భయం అనిపించింది. సినిమా వదిలేద్దామంటే మళ్లీ ఇలాంటి క్యారెక్టర్‌ వస్తుందో రాదో అని భయం. హీరోయిన్‌ అవ్వాలనుకున్నప్పుడు నెగటివ్‌ షేడ్‌ క్యారెక్టర్‌ ఎప్పుడు వచ్చినా చేయాలనుకునేదాన్ని. లక్కీగా తెలుగులో మొదటి సినిమాకే అది కుదిరిం ది. త్రివిక్రమ్‌ వెరీ టాలెంటెడ్‌. నాతో ఆ క్యారెక్టర్‌ బాగా చేయించారు.

చందూ మొండేటి: ‘అఆ’ సినిమా చేసేటప్పుడే తెలుగు కొంచెం నేర్చుకున్నాను. దాంతో ‘ప్రేమమ్‌’ రీమేక్‌ ఈజీ అయింది. మలయాళంలో చేసిన పాత్రనే తెలుగు ‘ప్రేమమ్‌’లో చేశాను. ఒకే పాత్రను మళ్లీ చేయడం బోర్‌ అనిపించలేదు. యంగ్‌ టీమ్‌తో చేసిన సినిమా ఇది. చందూ మొండేటి మంచి ఫ్రెండ్‌లా అనిపించాడు.

సతీష్‌ వేగేశ్న: ‘అఆ’, ‘ప్రేమమ్‌’లో నావి చిన్న క్యారెక్టర్స్‌. ‘శతమానం భవతి’ హీరోయిన్‌గా ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేశాను. ఈ సినిమాలో నేను చేసిన నిత్య పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. వేగేశ్న సతీష్‌ వెరీ కూల్‌ పర్సన్‌. ఈ సినిమా కోసం 50 రోజులకు పైగా వర్క్‌ చేసి ఉంటాం. ఒక్క రోజు కూడా ఆయనలో నేను కోపం చూడలేదు. ఈ సినిమాని చాలా ఎంజాయ్‌ చేశాను.

మీరు లెంగ్త్‌ తక్కువ ఉన్న క్యారెక్టర్స్‌ చేసిన ‘అ ఆ’, ‘ప్రేమమ్‌’ హిట్‌. ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌గా చేసిన ‘శతమానం భవతి’ హిట్‌. అందుకే కొంతమంది మిమ్మల్ని గోల్డెన్‌ లెగ్‌ అంటున్నారు...
పెద్ద బిరుదు. ఇందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ‘అఆ’, ‘ప్రేమమ్‌’లో చేసిన పాత్రల లెంగ్త్‌ తక్కువ అయిన ప్పటికీ మంచి పేరు తెచ్చాయి. దాంతో మనం సరైన నిర్ణయమే తీసుకున్నామనిపించింది. ‘శతమానం భవతి’ నన్ను ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌గా ప్రమోట్‌ చేసి, కెరీర్‌కి ప్లస్‌ అయింది.

ప్లస్‌ల మధ్య చిన్న మైనస్‌లా రామ్‌చరణ్‌ సరసన నటించే ఛాన్స్‌ వచ్చి తప్పిపోయినట్టుంది...
అవునండి. ఆల్‌మోస్ట్‌ ఓకే అనుకుంటున్న సమయంలో చేజారిపోయింది. ఒక పెద్ద సినిమా మిస్‌ అయినప్పుడు బాధ ఉంటుంది. కానీ, ఏదీ మన చేతుల్లో ఉండదు కదా. ఆ సినిమా మిస్‌ అయినా ఆ చిత్ర దర్శక–నిర్మాతలతో నాకు మంచి అనుబంధమే ఉంది. రామ్‌చరణ్‌ మంచి పర్సన్‌. ఛాన్స్‌ ఇస్తే మంచివాళ్లు.. ఇవ్వకపోతే చెడ్డవాళ్లు అనుకునే టైప్‌ కాదు నేను.

భవిష్యత్తులో రామ్‌చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్‌ వస్తే..
తప్పకుండా చేస్తా. నాకింకా బోల్డంత కెరీర్‌ ఉంది. భవిష్యత్తులో చాలామంది హీరోలతో సినిమా చేసే ఛాన్స్‌ వస్తుంది. అందరితోనూ చేస్తాను.

ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిందనే టాక్‌ కూడా వినిపిస్తోంది?
అది నిజం కాదు. ఆ యూనిట్‌ వాళ్లెవరూ నన్ను సంప్రదించలేదు.

కేరళ నుంచి అసిన్, మీరా జాస్మిన్, నయనతార, నిత్యామీనన్‌ తెలుగులో స్టార్స్‌ అయ్యారు. ఇప్పుడు మీరు, నివేదా థామస్, అనూ ఇమ్మాన్యుయెల్‌.. ఇలా చాలామంది వస్తున్నారు..
తెలుగు పరిశ్రమకూ, ఇక్కడి  ప్రేక్షకులకూ ధన్యవాదాలు చెప్పాలి. మన భాష కాదు కదా మనం ఎందుకు ఎంకరేజ్‌ చేయాలి? అని వాళ్లు అనుకుని ఉంటే మేం ఇంతమందిమి కేరళ నుంచి ఇక్కడకు వచ్చేవాళ్లం కాదు. మాకన్నా ముందు వచ్చిన మలయాళీ అమ్మాయిలు తామేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు మా వంతు.

తెలుగుతో పోల్చితే మలయాళంలో తక్కువ పారితోషికం ఉంటుందనా ఇక్కడికొస్తున్నారు?
మిగతావాళ్ల సంగతి చెప్పలేను కానీ నా మటుకు నాకు ఇక్కడ మంచి పాత్రలు వచ్చాయి కాబట్టి చేస్తున్నాను. ఓ ఆర్టిస్ట్‌గా మంచి పాత్రలు చేయడానికి తపన పడుతుంటాను. ఒకవేళ ఇప్పుడు మంచి క్యారెక్టర్స్‌ చేయలేదనుకోండి.. పదేళ్ల తర్వాత ‘అయ్యో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇన్నేళ్లు ఏం చేశాం’ అని బాధపడాల్సి ఉంటుంది. ఆ సంగతి పక్కన పెడితే, నేనిప్పటివరకూ పారితోషికానికి ప్రాధాన్యం ఇచ్చి సినిమాలు ఒప్పుకున్నది లేదు. ఇకముందు కూడా అంతే.

‘ప్రేమమ్‌’లో మీ లవర్‌ని కలుసుకోవడానికి నాగచైతన్యతో నైస్‌గా మాట్లాడి, తన ఇల్లు వాడుకుంటారు.. రియల్‌ లైఫ్‌లో మిమ్మల్ని అలా నైస్‌ చేసినవాళ్లు ఉన్నారా?
చదువుకునే రోజుల్లో నేనిలాంటి సహాయాలు చాలా చేశాను. అయితే ఇంటిని వాడుకుంటామని ఎవరూ అడగలేదు. లవ్‌ లెటర్స్, గిఫ్ట్స్‌ చేరవేసేదాన్ని. ఓ అమ్మాయి తన లవర్‌కి గిఫ్ట్‌ ఇచ్చి పంపేది. నేను తీసుకెళ్లి ఇచ్చిన తర్వాత అటువైపు నుంచి ఏం రెస్పాన్స్‌ వస్తుందోనని ఎదురు చూసేది. అవన్నీ తలుచుకుంటే థ్రిల్‌గా ఉంది.

గ్లామరస్‌ రోల్స్‌ చేస్తారా? ఓన్లీ ట్రెడిషనలా?
గ్లామరస్‌ అంటే నా దృష్టిలో.. చిట్టి పొట్టి దుస్తులు వేసుకున్నప్పుడు హాట్‌గా కనిపించడం కాదు.. చుడీదార్‌ వేసుకున్నా అలా కనిపించడం. ఏదైనా సరే చూసే కళ్లను బట్టి ఉంటుంది. ఒకవేళ క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే నేను బురఖా వేసుకుని యాక్ట్‌ చేయడానికి కూడా రెడీ. క్యారెక్టర్‌ బాగుంటే గ్లామరస్‌ డ్రెస్సులు వేసుకోవడానికి వెనకాడను.

ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు?
అస్సలు లేదండి. నా వయసిప్పుడు 21. పెళ్లికి ఇంకా చాలా టైమ్‌ ఉంది కాబట్టి లైఫ్‌ పార్టనర్‌ గురించి ఆలోచించలేదు. అయినా నేను లైఫ్‌ని ప్లాన్‌ చేయను.

ఫైనల్లీ తెలుగులో కమిట్‌ అయిన కొత్త సినిమాల గురించి?
డిస్కషన్‌లో ఉన్నాయి. త్వరలో చెబుతా.
– డి.జి. భవాని

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement