అనుప్రియ మహోదయ | Anupriya into Modi's Cabinet | Sakshi
Sakshi News home page

అనుప్రియ మహోదయ

Published Sun, Jul 10 2016 10:47 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

అనుప్రియ మహోదయ - Sakshi

అనుప్రియ మహోదయ

మోదీ కేబినెట్‌లోకి కొత్తమ్మాయ్ వచ్చింది. కొత్తమ్మాయే కాదు, కేబినెట్‌లో చిన్నమ్మాయ్ కూడా! ఆ కొత్తమ్మాయ్, చిన్నమ్మాయ్ అయిన అనుప్రియ ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది నేషన్’. ఎందుకంటే మోదీ ఈ అమ్మాయిని మంత్రి


వర్గంలోకి తీసుకున్న వెంటనే, బీజేపీ కూటమి ఫట్‌మని ఒక వికెట్‌ను కోల్పోయింది! అనుప్రియకు మంత్రి పదవి ఇచ్చినందుకు వచ్చిన తొలి రియాక్షన్ ఇది. ఇక రెండో రియాక్షన్... మోదీ నియోజకవర్గమైన వారణాసిలో ఆయనకు వ్యతిరేకంగా ఈ నెల 26 న మొదలవబోతున్న ‘బీజేపీ హఠావో... ఆరక్షణ్ బచావో’ ఉద్యమం. ఈ రియాక్షన్‌ల వల్ల మోదీకి వచ్చే నష్టం ఏమీ ఉండబోదు కానీ... అందుకు కారణమైన అనుప్రియ పొలిటికల్ పవర్‌పై జాతీయ నేతల దృష్టి పడకుండా మాత్రం ఉండదు. నాన్న రమ్మంటే పాలిటిక్స్‌లోకి అయిష్టంగా వచ్చి, అమ్మ పొమ్మంటే పార్టీలోంచి ఛాలెంజ్ చేసి మరీ వెళ్లిపోయిన ‘అప్నాదళ్’ చీలిక వర్గం లీడర్ అనుప్రియ... మోదీ ప్రధాన వ్యూహకర్తల్లో ఒకరిగా ఎదిగినా ఆశ్చర్యంలేదు.

 

‘‘ఐ ఫీల్ గ్రేట్. ఐ యామ్ రెడీ ఫర్ ఇట్.’’  ఎందుకు గ్రేట్‌గా ఫీలవడం? దేనికి రెడీ అవడం?  అసలు ఎవరిది ఈ మాట?  అనుప్రియ! ఎంపీగా రెండేళ్ల వయసు. మంత్రిగా ఆరు రోజుల వయసు. ఫస్ట్ టైమ్ ఎంపీ. ఫస్ట్ టైమ్ మినిస్టర్.  ‘‘ఐ ఫీల్ గ్రేట్. ఐ యామ్ రెడీ ఫర్ ఇట్’’ - తనే ఈ మాట అన్నది.  35 ఏళ్ల వయసుకే కేంద్ర మంత్రి అవడం గ్రేట్ అనేనా ఆమె ఉద్దేశం? కాకపోవచ్చు. బహుశా.. మోదీజీ ఫస్ట్ హాఫ్‌లో ఇవ్వకుండా, సెకండ్ హాఫ్‌లో ఇంత పెద్ద బాధ్యతను తనకు అప్పగించడాన్ని అనుప్రియ గర్వంగా భావిస్తూ ఉండి వుండొచ్చు. సహాయ మంత్రి పదవి.. మంత్రిపదవి కన్నా చిన్నదే. కానీ మోదీ కేబినెట్‌కు సహాయంగా ఉండడం చిన్న విషయమేమీ కాదు.

 

ఇక... రెడీ అవడం!
యుద్ధానికి సిద్ధం అవుతున్నారా ఏమిటీ అనుప్రియ?! అవును యుద్ధమే! వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ఆర్థికంగా వెనుకబడిన వర్గమైన కూర్మీల ఓట్లున్నాయి. కూర్మీలు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ చేతుల్లో ఉన్నారు. ఆయనదీ కూర్మీ కులమే. ఆయన చేతుల్లోంచి యు.పి.లోని కూర్మీల ఓట్లను లాక్కోవాలంటే ఇంకో కూర్మీ కావాలి. అందుకే బీజేపీ.. కూర్మీ అయిన అనుప్రియను పిలిచింది. పట్టం కట్టింది. కేంద్రంలో ఇప్పుడామె హెల్త్ అండ్ ఫ్యామిలీ మినిస్టర్.

 

‘‘నాకు ఇష్టం లేదు నాన్నా..’’
ఎవరో వె నక నుంచి నెడితే రాజకీయాల్లోకి వచ్చి పడ్డారు అనుప్రియ! సో.. అనుప్రియ పొలిటికల్ బయోగ్రఫీ ఆ ‘ఎవరో’తో ప్రారంభం అవుతుంది. ఎందుకంటే.. అనుప్రియకు పాలిటిక్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. ‘‘నాకు ఇష్టం లేదు నాన్నా’’ అంది! ఆయన నవ్వారు. అప్పటికే ఆయన యు.పి.లో పేరున్న పొలిటీషియన్. సోనే లాల్ పాటిల్! ఆయనది పేరున్న పార్టీ. అప్నా దళ్. సోనే లాల్ ‘కుర్మీ’ లీడర్. దళితనేత కాన్షీరామ్‌కు సన్నిహితుడు. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక బృందంలో సోనే లాల్ కూడా ఉన్నారు. తర్వాత్తర్వాత కాన్షీరామ్ మాయావతికి ప్రాధాన్యం ఇవ్వడంతో నచ్చని సోనే లాల్ పార్టీ బయటికి వచ్చేశారు. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అదే... అప్నాదళ్. ఇంతకీ అనుప్రియను పాలిటిక్స్‌లోకి తెచ్చిన ఆ ‘ఎవరో’ ఎవరు? ఇంకెవరు? విధి!

 

అనుప్రియ, అప్నాదళ్...అక్కాచెల్లెళ్లు
అనుప్రియ పుట్టిన 14 ఏళ్లకు అప్నాదళ్ పుట్టింది. తర్వాత పదిహేనేళ్ల పాటు అనుప్రియ, అప్నాదళ్ కలిసి పెరిగాయి. చెల్లెలంటే అక్కకు ఇష్టం లేకపోవడం ఏమిటి? ‘‘నువ్వు పార్టీలోకి వస్తే బాగుంటుందిరా’’ అన్నారు సోనేలాల్ ఓ రోజు కూతురితో మురిపెంగా. అప్పుడు అనుప్రియ అన్నదే.. ‘‘నాకు ఇష్టం లేదు నాన్నా’’ అన్న మాట. ఆయన నవ్వి ఊరుకున్నారు. అదే చివరి నవ్వు. 2009 అక్టోబర్ 17న డాక్టర్ సోనే లాల్ పటేల్ కారు ఆక్సిడెంట్‌లో చనిపోయారు! అప్పటికి అనుప్రియకు పెళ్లయి వారం దాటింది అంతే! కాళ్ల పారాణైనా ఆరలేదు అంటాం కదా అలా. అప్నాదళ్ బాధ్యతను అనుప్రియ తల్లి కృష్ణ తీసుకున్నారు. అనుప్రియ, ఆమె భర్త చెరో చెయ్యీ వేశారు. అదే నచ్చలేదు పార్టీ ప్రెసిడెంట్ కృష్ణకీ, పార్టీ కేడర్‌కీ. చెయ్యి వెయ్యడాన్ని... చేజిక్కించుకోడానికి చేసిన ప్రయత్నం అనుకున్నారు వాళ్లు.

 

‘‘నీ ముఖం నాకు చూపించకు ఫో’’
ఆరేళ్లు గడిచాయి. ఈ ఆరేళ్లలో అనుప్రియ అప్నాదళ్ ఎమ్మెల్యే అయ్యారు. అప్నాదళ్ ఎంపీ అయ్యారు. 2014 ఎన్నికల్లో ఎంపీగా ఆమె గెలుపునకు భారతీయ జనతా పార్టీ సాయం చేసింది. చేసిన సాయానికి ప్రతిఫలంగా ‘మీ పార్టీని మా పార్టీలో కలిపేద్దాం’’ అనే సంకేతం పంపారు మోదీ. అది నచ్చలేదు అనుప్రియకు. అయినా మోదీ ప్రయత్నాలు ఆగలేదు. అదంతా చూస్తున్న తల్లికి... ‘పిల్లగానీ అటువైపు వెళుతుందా’ అన్న అనుమానం వచ్చింది. ‘‘మీ అనుమానం నిజమే’’ అని ఒకరిద్దరు పార్టీ సన్నిహితులు తల్లి చెవిలో ఊదారు. అనుప్రియతో పాటు మరో ఆరుగురు పార్టీ నాయకులను అప్నాదళ్ నుంచి బయటికి పంపించారు కృష్ణ పటేల్. అందుకు ఆమె చూపిన కారణం... పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు! పార్టీలోంచి బయటకి వచ్చిన ఈ ఏడాది వ్యవధిలో అనుప్రియ చీలిక వర్గం నాయకురాలిగా ఉన్నారు! ఇప్పుడు క్యాబినెట్‌లోకి వచ్చేశారు. మోదీజీ రెండోసారి కలిపిన 19 పవర్ ముక్కల్లో.. చిన్నారి మినిస్టర్ అనుప్రియే. యంగెస్ట్!

 

మంత్రి అయిందని తల్లికి కోపం
‘‘ఐ యామ్ రెడీ ఫర్ ఇట్’’ అని అనుప్రియ అనడాన్ని మనం ఇంకోలా కూడా అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆమె తన ప్రత్యర్థులతో తలపడడానికి ముందు తల్లి విసిరే ముష్టి ఘాతాలను తప్పించుకోవలసి ఉంటుంది. ఇప్పటికే ఆమె ఒక అస్త్రాన్ని సంధించారు. కూతురికి మంత్రి పదవి ఇచ్చినందుకు నిరసనగా బీజీపీ కూటమి నుంచి బయటికి వచ్చారు.

 
అనుప్రియ మంత్రి అవడం ఆమె తల్లి కృష్ట పటేల్‌కు ఇష్టం లేదు. తన కూతురికి మంత్రి పదవి ఇస్తే బీజేపీతో తెగతెంపులు చేసుకుంటానని ఆమె ఇదివరకే ప్రకటించారు. ఇక అనుప్రియకు మంత్రి పదవి రావడం ఇష్టంలేని ఇంకో వ్యక్తి హరివంశ్ సింగ్. లోక్‌సభకు ఉన్న ఇద్దరే ఇద్దరు అప్నాదళ్ ఎంపీల్లో హరివంశ్ ఒకరు (ఇంకొకరు అనుప్రియ). హరివంశ్.. అనుప్రియ తల్లికి విధేయుడు. దాంతో బీజేపీ ఒక ఎంపీని కోల్పోయింది. అయితే కోల్పోయే దానికన్నా, రాబట్టుకోబోయే ఎక్కువని భావిస్తున్నందు వల్లే మోదీ.. అనుప్రియను క్యాబినెట్‌లోకి తీసుకున్నారు.

 

అనుప్రియ... ఆకర్షణ
అనుప్రియ యాక్టివ్. పార్లమెంటులో ఆమె స్పీచ్ ఇస్తుంటే సీనియర్లు ముచ్చటగా చూస్తుంటారు. నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు కూడా ఆమె మాట్లాడే తీరు ఆకట్టుకుంటుంది. ఏ ప్రాంతంలో ఆ ప్రాంతపు మాండలికంలోకి సులువుగా వెళ్లిపోతారు. ఆమె స్వభావమే అంత. అయితే పాలిటిక్స్ అర్థం చేసుకోడానికి మాత్రం ఆమె చాలా కష్టపడవలసి వచ్చింది.


అనుప్రియ ఎమ్మెల్యే అవడానికి ముందు... యు.పిలో కుల సమీకరణలను అవగాహన చేసుకోవడం అంత తేలికైన పని కాదని గ్రహించారు. రోజూ ఏదో ఒక కొత్త కోణం కనిపించేది. ఆ ప్రకారం తన ప్రసంగ పాఠానికి అప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవలసి వచ్చేది. పైగా ఆమె పోటీ చేస్తున్న రొహానియా నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన హిందీ భాష ఉండేది. ఆ భాషలో అక్కడి వారితో మాటామంతీ జరపడం కాస్త తడబాటుగా ఉండేది. ఇవన్నీ కూడా ఆమె శక్తిని హరించేవే. అయితే ఓటర్లతో మాట్లాడుతున్నప్పుడు ముఖంపై ఆ చిరునవ్వు మాత్రం అలాగే నిలిచి ఉండేది. అది ప్లస్ పాయింట్ అయింది అనుప్రియకు. మున్ముందు మోదీకి అది ప్లస్ ప్లస్ పాయింట్ అవొచ్చు. అనుప్రియ నేడో, రేపో.. తను బి.జె.పి.లో చేరుతున్నట్లు ప్రకటించే అవకాశాలున్నాయి.

 

 

అనుప్రియ పటేల్ (36), కేంద్ర మంత్రి
జన్మదినం      :      28 ఏప్రిల్ 1981
జన్మస్థలం      :      కాన్పూర్ (యు.పి)
తల్లిదండ్రులు   :      సోనే లాల్ పటేల్, కృష్ణ పటేల్
తోబుట్టువులు  :      చెల్లెలు పల్లవి (అప్నాదళ్ వై.ప్రె.), ఒక తమ్ముడు.
చదువు    :      బి.ఎ. లేడీ శ్రీరామ్ కాలేజ్ (ఢిల్లీ) ఎం.ఎ. సైకాలజీ, (అమిటీ వర్శిటీ, నోయిడా)  ఎం.బి.ఎ. (కాన్పూర్ వర్శిటీ)
ఆసక్తి ఉన్న రంగాలు :      బోధన, సంఘసేవ, రాజకీయాలు
భర్త :      ఆశిష్ కుమార్ సింగ్


నాన్న రమ్మన్నాడు... అమ్మ పొమ్మంది!
ప్రాతినిధ్యం     :      ఎం.పి. మీర్జాపూర్ (యు.పి)
ప్రత్యర్థి    :      సముద్ర బింద్ (బి.ఎస్.పి)
మెజారిటీ :      2.19 లక్షల ఓట్లు! (2014 ఎ.)
తొలి ప్రాతినిధ్యం      :      ఎమ్మెల్యేగా 31 ఏళ్ల వయసులో.
నియోజకవర్గం :      రొహానియా, వారణాసి
తొలి పార్టీ :      అప్నాదళ్
రాజకీయరంగ ప్రవేశం      :      2009 (తండ్రి మరణంతో)
పార్టీ బహిష్కారం     :      2015 (తల్లి ఆగ్రహంతో)
కృషి చేస్తున్న రంగాలు    :      నీటి పారుదల, గిరిజన సంక్షేమం ఉన్నత విద్య, గ్రామీణ అభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement