మహిళా రక్షణకు ఉక్కు కవచం | AP Disha Act Mandates Disposal Of Crimes Against Women Within 21 Day | Sakshi
Sakshi News home page

మహిళా రక్షణకు ఉక్కు కవచం

Published Sat, Dec 14 2019 12:12 AM | Last Updated on Sat, Dec 14 2019 5:08 AM

AP Disha Act Mandates Disposal Of Crimes Against Women Within 21 Day - Sakshi

విలన్‌లు ఉన్న చోట ఒక హీరో ఉండాలి. అలాంటి హీరో... ‘ఏపీ దిశ యాక్ట్‌’. చెల్లినెవరూ ఏడిపించకుండా ఒక అన్న ఉండాలి. అన్న లేని చెల్లెళ్లకు కూడా అన్న ‘ఏపీ దిశ యాక్ట్‌’. చెడుచూపు పడదన్న ధైర్యం ఒకటి ఉండాలి. ఆ.. ధైర్యం.. ధీమా.. భరోసా..   ‘ఏపీ దశ యాక్ట్‌’! మహిళల రక్షణకు ఉక్కు కవచం ఈ చట్టం!

ఆగ్రహం కుదిపేస్తుంది. ఆవేదన కదిలిస్తుంది. దిశ ఘటన దేశాన్ని కుదిపితే, ఏపీ అసెంబ్లీని కదిలించింది. ఫలితమే ఏపీ దిశా యాక్ట్‌–2019. శుక్రవారం ఏపీ అసెంబ్లీ ‘దిశ’ బిల్లును ఆమోదించడంతో రాష్ట్రానికి కొత్త మహిళా రక్షణ చట్టం ఒక కవచం అయింది. ఈ చట్టం రాష్ట్రంలోని మహిళలకు, బాలికలకు భద్రత కల్పిస్తుంది. వారిపై జరిగే నేరాల విచారణకు జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటవుతాయి. మహిళలపై అత్యాచారానికి, క్రూరమైన అకృత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష పడుతుంది. వారం రోజుల్లో దర్యాప్తు, పద్నాలుగు రోజుల్లో విచారణ, మూడు వారాల్లో తీర్పు పూర్తవుతాయి! పిల్లలపై లైంగిక నేరాలకు పది నుంచి పద్నాలుగేళ్ల వరకు శిక్ష! సోషల్‌ మీడియాలో మహిళల్ని కించపరిస్తే రెండు నుంచి నాలుగేళ్ల వరకు జైలు శిక్ష! మహిళలకు భరోసాను, భద్రతను ఇచ్చే ఇలాంటి ఒక శక్తిమంతమైన చట్టం దేశ చరిత్రలోనే మొట్ట మొదటిది.

ఆడపిల్లకు ఏదైనా జరిగితే ఆ తల్లిదండ్రులకు, తోడబుట్టినవాళ్లకు ఎంత పెయిన్‌ ఉంటుందో.. ఆ దుర్మార్గపు ఘటన సమాజంలోని మిగతా కుటుంబాలలో ఎంతటి కలవరం రేపుతుందో చెబుతూ.. బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు ఏపీ ముఖ్యమంత్రి ఎంతో భావోద్వేగంతో ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న దిశ చట్టంతో ‘నేరస్తులకు ఇక మూడినట్లే’ అని ముఖ్యమంత్రి స్పష్టమైన ఒక సంకేతం కూడా పంపారు. నిర్భయ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం నిర్భయ కేసుల్లో జైలు లేదా మరణ దండనను శిక్షగా విధిస్తుంటే.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం దోషికి మరణదండను తప్పనిసరి చేస్తోంది. నిర్భయ చట్టం ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు పూర్తయితే మరో రెండు నెలల్లో శిక్ష పడాలి. అంటే మొత్తం నాలుగు నెలల్లో దర్యాప్తు,  విచారణ పూర్తి కావాలి. దిశ చట్టంలో మొత్తమంతా కలిపి మూడు వారాల్లోనే దోషికి శిక్ష పడుతుంది. అత్యాచార ఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై జరిగే లైంగిక నేరాలన్నిటికి కూడా దిశ చట్టం శిక్షను తీవ్రం చేసింది.

కేంద్రం చేసిన ‘పోక్సో’ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు కనీసం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. అదే ఏపీలో దిశ చట్టాన్ని అనుసరించి జీవిత ఖైదు విధిస్తారు. అంటే పిల్లలపై ఇకపై ఎలాంటి లైంగిక నేరానికి పాల్పడినా జీవితాంతం జైల్లో ఉండటమో, లేక ఉరికంబం ఎక్కడమో శిక్ష అవుతుంది. సోషల్‌ మీడియా ద్వారా మహిళల్ని వేధించడం, వారిపై అసభ్యకరమైన పోస్టింగులు పెట్టడం వంటివి చేస్తే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం ఇప్పటి వరకు నిర్దిష్టంగా శిక్షలు లేవు. ఏపీ దిశ చట్టం.. మెయిల్స్‌ ద్వారా గానీ, సోషల్‌ మీడియా ద్వారా గానీ, డిజిటల్‌ విధానంలో గానీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే మొదటి తప్పుకు రెండేళ్లు, ఆ తర్వాతి తప్పుకు 4 ఏళ్లు శిక్ష విధించేలా ఒక కొత్త సెక్షన్‌ను తీసుకొచ్చింది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంతవరకూ మహిళలపై, పిల్లలపై నేరాల సత్వర విచారణకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టు లేదు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఈ నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఉన్నాయి.

ఏపీ దిశ చట్టం ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తోంది! అత్యాచారం, సామూహిక అత్యాచారం, ఆసిడ్‌ దాడులు, సోషల్‌ మీడియాలో అసభ్యంగా చూపించడం, వేధించడం వంటి నేరాలు, పోక్సో పరిధిలోకి వచ్చేవన్నీ జిల్లాల్లోని ఈ ప్రత్యేక కోర్టుల పరిధిలోకి వస్తాయి. మరి ఆ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లకుండా ఉంటారా? వెళ్తారు. అయితే అలా అప్పీలు చేసుకునే గడువు కాలం కేంద్ర ప్రభుత్వ చట్టంలో ఆరు నెలలు ఉండగా, ఆ కాలాన్ని ఏపీ పరిధిలో మూడు నెలలకు తగ్గించారు. ఇంకొక విషయం.. మహిళలు, పిల్లలపై నేరాల సత్వర విచారణ, శిక్షల విధింపు కోసం ప్రత్యేక పోలీసు బృందాలను, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లను, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర చట్టాల్లో ఇప్పటివరకు ఎటువంటి ఏర్పాట్లూ లేవు. ఏపీ దిశ చట్టం మాత్రం జిల్లా స్థాయిల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్‌ స్పెషల్‌ పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తోంది. ప్రతి కోర్టుకూ ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ని నియమించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం నేరస్థులను చట్టం ముందే కాకుండా, సమాజం ముందు కూడా నిలబెట్టబోతోంది.

అందుకోసం ఒక డిజిటల్‌ రిజిస్ట్రీని ఏర్పాటు చేయబోతోంది. మహిళలు, పిల్లలపై నేరాలను నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్‌ రిజిస్ట్రీని పెట్టింది కానీ ఆ రిజిస్ట్రీ ద్వారా డిజిటల్‌ పద్దతిలో డేటా బేస్‌ ఉన్నప్పటికీ.. జరిగిన నేరాలు, నేరస్తుల పేర్లు అందులో బహిర్గతం అయ్యే అవకాశం లేదు. అయితే ఏపీలో మాత్రం ఏ నేరస్తుడు ఏ నేరం చేశాడనే వివరాలను రిజిస్ట్రీలో ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రతిష్టాత్మక ‘దిశ’ చట్టాన్ని ‘ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా (సవరణ) చట్టం –2019 గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ఉద్వేగభరితమైన మాటల్ని బట్టి చెప్పాలంటే.. మహిళపై అఘాయిత్యం చేయాలనే ఆలోచన వస్తేనే వణుకు పుట్టించే చట్టం ఇది. ‘‘మహిళలపై అకృత్యాలకు పాల్పడితే మరణశిక్ష పడుతుందనే భయం కలగాలి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది. అప్పుడే నేరాలు తగ్గుతాయి’’అని ఆయన అన్నారు. ఆయన మాటలతో అన్ని వర్గాల్లోని ప్రముఖులు, సామాన్యులు  ఏకీభవిస్తున్నారు.
 

మంచి పరిణామం
సెక్సువల్‌ అస్సాల్ట్‌ను సీరియస్‌గా తీసుకున్నారు .. మంచి పరిణామం. ఇష్యూని వెంటనే టేకప్‌ చేసిన పద్ధతి బాగుంది. అయితే ఇప్పటి వరకు మహిళల మీద హింసకు సంబంధించి ఎలాంటి అధ్యయనాలు జరగలేదు. ఇలాంటి సీరియస్‌ చట్టాలున్నాయన్న అవగాహనా లేదు. వీటి మీదా దృష్టిపెట్టాలి. చట్టాల గురించి విస్త్రృత ప్రచారం సాగాలి. మహిళల మీద హింస జరగడానికి అవకాశాలున్న  అన్ని పరిస్థితులూ మారడానికి కృషిచేయాలి.
– కొండవీటి సత్యవతి, భూమిక  ఎడిటర్,

బ్యూటీఫుల్‌ యాక్ట్‌

జస్టిస్‌ డిలే అవడంలో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌నే తప్పుబట్టారు ఇన్నాళ్లు.  సత్వర న్యాయం జరగకపోవడానికి మౌలిక సదుపాయాల కొరత ప్రధాన కారణం. మొదటిసారి దీని మీద దృష్టిపెట్టింది ప్రభుత్వం. శుభపరిణామం. సరైన సాక్ష్యాధారాలున్న కేసుల్లో ఇన్విస్టిగేషన్‌ వేగవంతంగా.. అంటే 21 రోజుల్లో జరిగిపోవాలి అన్నది ఈ బిల్లులోని మరో బ్యూటీ. అంతేకాదు సోషల్‌ మీడియాలో మహిళలను వేధించే వారికీ కఠిన శిక్షలను పెట్టిందీ బిల్లు. ఇది కచ్చితంగా ఇంప్లిమెంట్‌ అవ్వాలి. న్యాయం అందించడంలో ఉన్న వైఫల్యాలను గుర్తించి.. సరిచేయడానికి ఈ బిల్లు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది.
–  సరిత, అడిషనల్‌ ఎస్‌పి సిఐడి,
ఎస్‌పి విమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ (ఏపీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌)

దేశానికే మార్గదర్శకం

ఏపీ దిశ– 2019 బిల్లు  చరిత్రాత్మకమైంది. దేశానికే మార్గదర్శకం. రేప్‌ వంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన వాళ్లకు 21 రోజుల్లోనే శిక్షపడేలా చేస్తోందీ బిల్లు. దీనివల్ల సాక్ష్యాలు తారుమారు కావడం ఉండదు. ఒత్తిళ్లకు గురికాకుండా వేగంగా విచారణ జరిగి సత్వర న్యాయం అందుతుంది. సోషల్‌మీడియాలో మహిళల మీద వేధింపులకు పాల్పడిన వారికీ కఠిన శిక్షలు పడేలా బిల్లు తెచ్చిన మొదటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి గారు.

ఏపీ దిశ – 2019 బిల్లును చూసిన తర్వాత ఈ తరహా చట్టలు తేవాలని దేశంలోని మిగతా చోట్లా ఒత్తిడి పెరుగుతుంది. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కూడా నిర్ణీత కాలవ్యవధి ఉండాలని కేంద్రం మీద కూడా ఒత్తిడి మొదలవుతుంది. రెండు విషయాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా ఉంటోంది. మొదటిది ఏపీ దిశ –2019 అయితే రెండవది దశలవారీగా మద్యపాన నిషేధం. మహిళల మీద జరిగే నేరాల్లో మద్యపానం పాత్ర గుర్తించకపోతే లాభంలేదు. ఏపీ ముఖ్యమంత్రి గుర్తించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కఠినంగా ఉండడం వల్ల కింది స్థాయిలో అలర్ట్‌నెస్‌ ఉంటుంది. మహిళల భద్రతకు సంబంధించి మరింత బాధ్యతతో వ్యవహరిస్తారు.
– వాసిరెడ్డి పద్మ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌

నిర్భయ కన్నా భిన్నమైనది
వందశాతం చరిత్రాత్మకమైనది. ఈ బిల్లు వల్ల  అబ్బాయి తప్పు చేస్తే ఆడపిల్లకు న్యాయం జరుగుతుంది. నిర్భయ కన్నా డిఫరెంట్‌ బిల్లు ఇది. అందులో మొత్తం నాలుగు నెలల కాలవ్యవధి. ఏపీ దిశ – 2019లో కేవలం 21 రోజుల్లో న్యాయం అందుతుంది. సాక్ష్యాలు మరుగున పడే అవకాశమే లేదు.
– నిర్మలత, సీనియర్‌ న్యాయవాది

దిశకు నివాళి
దిశ ఘటన అందరినీ కదిలించింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు. ఆడవాళ్ల భద్రతకు దిశ పేరుతో బిల్‌ రావడం నిజంగానే దిశకు నివాళి. ఆడపిల్లలకు భద్రత దొరుకుతుందనే ఆశ కనిపిస్తోంది.
– శ్రీధర్‌ రెడ్డి, దిశ తండ్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement