ఆపిల్ ఐవాచ్ వచ్చేసింది!
ఊహాగానాలకు తెరపడింది
ఐపాడ్, ఐఫోన్, ఐప్యాడ్‌ల మాదిరిగా ప్రభంజనం సృష్టిస్తుందో...
ఇతర స్మార్ట్‌వాచ్‌ల వరదలో ఉసూరు మనిపిస్తుందో తెలియదుగానీ...
మొత్తానికి ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న
ఆపిల్ కంపెనీ ఐవాచ్ మార్కెట్‌లోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది.
ఏమున్నాయి దీంట్లో? ఎలాంటి సౌకర్యాలు తేనుందీ గాడ్జెట్?
ఏమేం పనులు చేయవచ్చు...?
మణికట్టుకు తగిలించుకునే ఐవాచ్‌తో ఫోన్ చేయడం ఒక్కటే ప్రయోజనం కాదు. ఇంకా చాలానే ఉన్నాయి. ఐఫోన్‌ను బయటకు తీయకుండానే అందులోని చాలా ఫీచర్లను పనిచేయించవచ్చు. ఇంకోలా చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్లలోని ఆప్స్‌ను నేరుగా వాడుకునేందుకు వాచ్ దగ్గరి దారన్నమాట. ఫేస్‌బుక్, నైక్ + రన్నింగ్, షాజామ్, వీచాట్ వంటి అప్లికేషన్లు ఇప్పటికే అందుబాటులో ఉండగా మరిన్ని వచ్చి చేరనున్నాయి. ఇష్టమైన స్పోర్ట్స్ వార్తలను తెలుసుకోవడంతోపాటు, స్టాక్ ఎక్స్ఛేంజ్ ఒడిదుడుకులను కూడా ఎప్పటికప్పుడు స్క్రీన్‌పైనే చూసుకోవచ్చు.
ఆపిల్ పే: గత ఏడాది అక్టోబర్‌లో ఈ సర్వీస్ ప్రారంభమైంది. ఇప్పటివరకూ అమెరికాలోని దాదాపు 2500 బ్యాంకులు ఈ ఫీచర్ ద్వారా ఆపిల్ వినియోగదారులు చెల్లింపులు జరిపేందుకు అంగీకరించాయి. దీంతోపాటు దాదాపు 40 వేల కోకో కోలా యంత్రాల ద్వారా సాఫ్ట్ డ్రింక్ కొనుగోలు చేసేందుకు కూడా ఒప్పందం కుదిరింది. ఉబర్‌ట్యాక్సీని బుక్ చేసేందుకు, అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానాల్లో చెక్ ఇన్‌అయ్యేందుకు హనివెల్ లిరిక్ థెర్మోస్టాట్‌ను రిమోట్‌గా నియంత్రించేందుకు కూడా ఆపిల్ వాచ్ ఉపయోపడుతుంది. ఆపిల్ పే ఆప్‌ను మీ డెబిట్, క్రెడిట్‌కార్డుగా వాడుకోవచ్చు కూడా. ఏదైనా హోటల్‌కు వెళితే అక్కడ మనకు కేటాయించే రూమ్‌కు తాళంగా కూడా ఐ వాచ్‌ను వాడుకోవచ్చు.
కంపాటబిలిటీ:
ఐఓఎస్ 8.2 లేదా మరింత అధునాతనమైన ఆపరేటింగ్ సిస్టమ్‌లున్న ఐఫోన్ 5, 5సీ, ఐఫోన్ 5 ఎస్, ఐఫోన్ 6, 6+ ఫోన్లతో కలిసి పనిచేయగలదు ఐవాచ్.
అదనంగా...
కచ్చితమైన టైమ్.: యూనివర్సల్ టైమ్ స్టాండర్డ్‌ను కేవలం 50 మిల్లీసెకన్ల తేడా వరకూ కచ్చితంగా చూపేలా దీన్ని తయారు చేశారు. అయితే ఐఫోన్‌తో ఎంత తరచుగా సింక్ అవుతుందన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది.
టాప్టిక్ ఫ్యీడ్‌బ్యాక్
సున్నితమైన టాప్‌తో రకరకాల ఫీచర్లను నియంత్రించగలగడం ఆపిల్ ఐవాచ్‌లోని ముఖ్యమైన ఫీచర్. స్క్రీన్‌పై చిన్నగా ముట్టుకుంటే చాలు.. కొత్త మెయిళ్ల నోటిఫికేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా మ్యూజిక్ వాల్యూమ్, ఛానెల్స్, సాంగ్స్‌ను ఎంచుకునేందుకు, ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు పంపేందుకు, చూసేందుకు, కాల్స్ రిసీవ్ చేసుకునేందుకు, మాటలనే టెక్ట్స్ రూపంలో మెసేజ్‌గా పంపేందుకు కూడా ఈ హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్ ఉపయోగపడుతుంది.
రీసెర్చ్ కిట్:
ఐవాచ్‌తోపాటు ఆపిల్ కంపెనీ సోమవారం రీసెర్చ్ కిట్ ఒకదాన్ని విడుదల చేసింది. మధుమేహం, గుండెజబ్బులు, పార్కిన్‌సన్స్, ఆస్తమా, బ్రెస్ట్ కేన్సర్లకు సంబంధించి నాణ్యమైన, విసృ్తత సమాచారం సేకరించేందుకు ఈ కిట్ పనికొస్తుందని అంచనా. వినియోగదారులు ఐవాచ్‌తోపాటు దీన్ని వాడాల్సి ఉంటుంది. అయితే భవిష్యత్తులో ఎవరైనా ఈ కిట్ తాలూకూ సాఫ్ట్‌వేర్‌ను వాడుకుని, ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్లతో పనిచేయగల కిట్‌లను అభివృద్ధి చేయవచ్చు. శరీర బరువు, రక్తపోటు, రక్తంలో చక్కెరల మోతాదు వంటి అంశాలను గుర్తించగల హెల్త్‌కిట్‌ను ఆపిల్ ఇప్పటికే అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. రీసెర్చ్ కిట్ ఈ అప్లికేషన్‌తో కలిసి పనిచేస్తుందన్నమాట. వాచ్‌లో వాడే యాక్సిలరోమీటర్, మైక్రోఫోన్, గైరోస్కోప్, జీపీఎస్‌లను ఉపయోగించుకుంటూ వినియోగదారుడి నడక తీరు, కదలికలను గుర్తిస్తుంది. తదనుగుణంగా ఫిట్‌నెస్‌ను అంచనా వేస్తుంది. టచ్ స్క్రీన్‌ను ముట్టుకోవాల్సిన అవసరం లేకుండా, జూమ్ ఇన్, ఔట్‌ల కోసం, హోమ్ స్క్రీన్ కోసం డిజిటల్ బటన్
ఐ వాచ్ వినియోగదారులను గుర్తించేందుకు, కనెక్ట్ అయ్యేందుకు ఫ్రెండ్స్ బటన్. నీలం రాళ్ల స్ఫటికాలపై ఏర్పాటు చేసిన తెర సున్నితమైన స్పర్శను, పీడనాన్ని గుర్తించి తదనుగుణంగా పనిచేస్తుంది. ఇన్ఫ్రారెడ్ ఎల్‌ఈడీ సెన్సర్లు గుండెచప్పుడును గుర్తించగలవు. వ్యాయామం, నడక, నిలుచుని ఉన్న సమయాలను కూడా లెక్కగట్టి చెబుతాయీ సెన్సర్లు