నా వయసు 19 ఏళ్లు. నాది పొడి చర్మం (డ్రై స్కిన్). ఇది చలి కాలం కాబట్టి ముఖానికి కోల్డ్ క్రీమ్ రాస్తున్నాను. ఇలా రాసినప్పుడు మాత్రం చర్మం బాగానే ఉంటుంది. కానీ ముఖం కడుక్కున్న వెంటనే అది బాగా డ్రైగా మారిపోతోంది. కోల్డ్ క్రీమ్ రాస్తున్నప్పటి నుంచి చర్మం కాంతి కోల్పోయి, ముఖం నిగారింపు తగ్గినట్లుగా కనిపిస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
పొడి చర్మం ఉన్నవారు చలికాలంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. వీరిలో రక్షణ కవచంలా ఉండాల్సిన స్కిన్ బ్యారియర్ డిస్టర్బ్ అయ్యి సమస్యలకు దారితీస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే... కోల్డ్ క్రీమ్స్ అనేవి అందరికీ సరిపడవు. ముఖానికి, శరీరానికి కూడా వేరువేరుగా క్రీమ్స్ ఫార్ములాలు అందుబాటులో ఉంటాయి. పొడి చర్మం ఉన్నవారు సిండెట్ బేస్ సబ్బు వాడితే మంచిది. డాక్టర్ల సూచించిన మాయిశ్చరైజర్స్ వాడటం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇవి స్కిన్ బ్యారియర్‌ను రిపేరు చేస్తాయి కాబట్టి మీకు సరిపడే మాయిశ్చరైజన్‌ను డాక్టర్ సలహా మీద వాడండి.
మళ్లీ మొటిమలు వస్తున్నాయి...
నా వయసు 34 ఏళ్లు. ఇటీవల తరచూ మొటిమలు వస్తున్నాయి. ముఖం కూడా డల్‌గా మారింది. అప్పట్లో నేను టీన్స్‌లో ఉన్నప్పుడు నాకు మొటిమలు విపరీతంగా వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ మొటిమలు వస్తుండటం చాలా ఎంబరాసింగ్‌గా ఉంది. నా సమస్యకు పరిష్కారాన్ని సూచించండి.
మొటిమలు మళ్లీ మళ్లీ రావడానికి కొన్ని కారణాలుంటాయి. ఉదాహరణకు మహిళల్లో హార్మోన్‌ల ప్రభావం, ప్రీ–మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ వంటి కారణాల వల్ల మొటిమలు వస్తుంటాయి. అంతేగాక... మన ఆహారపు అలవాట్లు కూడా ఈ సమస్యకు ఒక ప్రధాన కారణం కావచ్చు. అంటే మనం తీసుకునే ఆహారంలో నూనెలు, కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉండటం కూడా మొటిమలకు వచ్చేందుకు దోహదపడుతుంది. మీ విషయంలో మీకు ఏ కారణంగా మొటిమలు వచ్చాయన్న అంశంతో పాటు మరికొన్ని వ్యక్తిగత అంశాలను పరిగణనలోకి తీసుకొని, దానికి అనుగుణంగా చికిత్స సూచించాల్సి/చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి మీకు దగ్గర్లో ఉన్న కాస్మటాలజిస్ట్‌ను సంప్రదించండి.
చుండ్రు తీవ్రత ఎక్కువైంది...
నా వయసు 24 ఏళ్లు. నాది సాధారణ చర్మం. నేను గత ఆర్నెల్ల నుంచి చుండ్రు (డాండ్రఫ్)తో బాధపడుతున్నాను. ఈమధ్య ఈ సమస్య తీవ్రత మరింత పెరిగింది. బాగా దురదగా కూడా ఉంటోంది. జుట్టు రాలిపోవడం (హెయిర్‌ఫాల్) కూడా ఎక్కువైంది. ఎన్ని యాంటీ డాండ్రఫ్ షాంపూలు మార్చినా ఫలితం లేదు. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం సూచించండి.
చుండ్రు (డాండ్రఫ్) అనేక కారణాల వల్ల వస్తుంటుంది. చలికాలంలో దీని తీవ్రత పెరిగి మరింత ఇబ్బంది పెడుతుంది. షాంపూలు వాడినంతమాత్రాన మీ సమస్య తొలగిపోదు. దీనికి ప్రత్యేకించి యాంటీడాండ్రఫ్ లోషన్స్‌తో పాటు మెడికేటెడ్ షాంపూలు వాడాల్సి ఉంటుంది. అలాగే జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. మీ జుట్టు రాలడం సమస్యకు తగిన కారణాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని ఆరోగ్య పరీక్షలు కూడా చేయించాల్సి రావచ్చు. మీరు ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిది.
డాక్టర్ సుభాషిణి జయం,
చీఫ్ మెడికల్ కాస్మటాలజిస్ట్,
ఎన్‌ఛాంట్ మెడికల్ కాస్మటాలజీ క్లినిక్,
శ్రీనగర్‌కాలనీ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment