వయసును గెలవండి...
నిత్యం యవ్వనంతో ఉండటం కంటే మరో వరం లేదు. ముఖ్యంగా వయసు తెలిసిపోయేది చర్మంతోనే. తెల్లబడే తలకు రంగు వేసైనా వృద్ధాప్యాన్ని కనిపించకుండా ఆపవచ్చేమోగాని, ముడుతలు పడే చర్మానికి ఏం చేసి వృద్ధాప్య లక్షణాలను ఆపగలం? చర్మంపై త్వరగా వృద్ధాప్య లక్షణాలు కనబడటానికి కారణాలు, వాటిని నివారించేందుకు తీసుకువాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకే ఈ కథనం.
చర్మం మన దేహంలోని అతి పెద్ద అవయవం. సూర్యుడి హానికారక కిరణాలనుంచి, వాతావరణంలోని వేడిమి/చలి నుంచి, అనేక సూక్ష్మక్రిములనుంచి రక్షణ కల్పిస్తుంది చర్మం. అదే లేకపోతే ఏ జీవి మనుగడా సాధ్యం కాదు. ఇలా రక్షణ కల్పించే ప్రక్రియలో దానికి అయ్యే హానిని అదే తొలగించుకుని, దానికి అయ్యే గాయాలను అదే చక్కబరచుకుంటుంది. ఎప్పటికప్పుడు తనను తాను రిపేర్ చేసుకుంటుంది. అయితే కాలం గడుస్తున్న కొద్దీ చర్మంలో వయసు తాలూకు అనేక మార్పులు కనిపిస్తాయి. చర్మంపై కాల ప్రభావాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది అంతర్గతంగా వచ్చే మార్పుల (ఇంట్రిన్సిక్) తాలూకు కారణాలు, రెండోది బాహ్య కారణాలు (ఎక్స్ట్రిన్సిక్).
వయసు పైబడటానికి అంతర్గత (ఇంట్రిన్సిక్) కారణాలు
కాలం గడుస్తున్న కొద్దీ చర్మంలో వచ్చే మార్పులకు ప్రధాన కారణం జన్యువుల్లో ఉంటుంది. కొందరు... ముఫ్ఫైలలో ఉన్నా టీన్స్‌లో ఉన్నట్లే కనబడతారు. దానికి కారణం వారి జన్యువులే. ఇలా అంతర్గత కారణాలతో జరిగే వయసు మార్పులను ‘స్వాభావిక వయసు మార్పులు’ (నేచురల్ ఏజింగ్) అంటారు. మన చర్మం బిగుతుగా ఉండటానికి కారణం... అందులో కొలాజెన్ అనే పదార్థం. ఈ కొలాజెనే చర్మం కణాలను పట్టి ఉంచినట్లుగా బిగుతుగా ఉంచడానికి సపోర్ట్ ఇస్తుంది. అయితే కాలం గడుస్తున్న కొద్దీ కొలాజెన్ ఉత్పత్తి మందగిస్తూ పోతుంటుంది. అలా మందగిస్తున్నకొద్దీ... చర్మాన్ని సాగదీసినప్పుడు మళ్లీ యథాస్థితికి వచ్చే గుణం (ఎలాస్టిసిటీ) తగ్గి వదులుగా మారుతుంది. ఇక చర్మంపైన మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోయి, ఆ స్థానంలో మళ్లీ కొత్త కణాలు పుడుతుంటాయి. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ మృతకణాల స్థానాన్ని తీసుకునే కొత్త కణాల ఉత్పత్తి కూడా మందగిస్తుంటుంది. ఈ మార్పులన్నీ 20 తర్వాత నుంచి కనిపిస్తుంటాయి కాబట్టి ఏజింగ్ ఆ వయసు నుంచే మొదలవుతుంది. వయసు పెరగడంతో వచ్చే స్వాభావిక మార్పులివి...
చాలా సూక్ష్మమైన ముడుతలు (సాధారణంగా నుదుటిమీదపై ప్రస్ఫుటంగా కనిపిస్తాయి) ఈ చర్మం క్రమంగా పారదర్శకం కావడం
చర్మం కింద ఉండే కొవ్వు క్రమంగా తగ్గిపోతుండటంతో చెంపల భాగంలో గుంటలు పడటం. అలాగే కంటి చుట్టుపక్కల ఉన్న చర్మం కింది కొవ్వు కూడా తగ్గుతూ పోతుంది. అలాగే అరచేతుల వెనక భాగంలో, మెడ దగ్గర చర్మం వదులవుతూ ఉంటుంది
కాలక్రమంలో ఎముక కాస్తంత కురచగా మారడంతో ఎముక చుట్టూ ఉండే చర్మం వదులవుతుంది
పొడిగా ఉండే చర్మంలో దురదలు వస్తాయి. (అక్కడి గ్రంథుల సంఖ్య తగ్గడం వల్ల).
స్వేదగ్రంథుల సంఖ్య తగ్గడంతో చెమటలు తగ్గి శరీరాన్ని చల్లబరిచే గుణం క్రమంగా తగ్గుతుంది
శరీరంపై ఉండే వెంట్రుకలు క్రమంగా తెల్లబడతాయి. హార్మోనల్ మార్పుల వల్ల తలపై (మాడు భాగంలోని) వెంట్రుకలు క్రమంగా పలచబడతాయి. ఈ మార్పు స్త్రీ, పురుషులిద్దరిలోనూ చోటుచేసుకుంటుంది
ఇక స్త్రీలలో అవాంఛనీయమైన వెంట్రుకల పెరుగుదల ఎక్కువవుతుంది. (ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల)
గోళ్ల చివర అర్థచంద్రాకారంలో ఉండే తెల్లటి భాగం క్రమంగా మాయమైపోయి, గోళ్లపై చిన్న చిన్న గాట్ల వంటివి ఏర్పడుతుంటాయి.
అయితే పై మార్పులు కొందరిలో ఇరవైలలో కాకుండా నలభైల్లోకి వచ్చే వరకూ ప్రారంభం కావు.
ఇక కొందరిలో వయసు పెరగడం అనే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. దీనికీ జన్యువులే కారణం. ఈ కండిషన్‌ను ‘వీనర్స్ సిండ్రోమ్’ అంటారు. ఈ సిండ్రోమ్‌తో బాధపడేవారిలో వెంట్రుకలు టీనేజ్లోనే తెల్లబడతాయి. ముప్ఫయిలలో క్యాటరాక్ట్ వస్తుంది. వారి బతికేది గరిష్ఠంగా 40 ఏళ్ల వరకు మాత్రమే. ఇక ‘ప్రొజీరియా’ అనే కండిషన్ ఉన్నవారిలో సైతం వయసు పైబడే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. వీరిలో జుట్టురంగు, చర్మం, గోళ్లు అన్నింట్లోనూ మార్పులు వస్తాయి. వయసు పైబడినప్పుడు జరిగే మార్పులు వారి అంతర్గత అవయవాల్లోనూ చోటుసుకుంటాయి. ప్రోజీరియా వచ్చిన పదేళ్ల కుర్రాడు 50 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడు. వాళ్లు కూడా 12-15 ఏళ్లు మాత్రమే.
వయసు పైబడటానికి బయటి కారణాలు (ఎక్స్ట్రిన్సిక్)
వయసు పైబడినట్లుగా కనిపించడానికి అనేక బయటి కారణాలు దోహదం చేస్తాయి. వాటిలో ముఖ్యమైనవి...
ఈ సూర్యుడికి ఎక్స్పోజ్ కావడం : సూర్యుడి కిరణాలకు ఎక్స్పోజ్ కావడం వల్ల చర్మం కొన్ని మార్పులకు గురవుతుంది. కమిలినట్లుగా మారడం, ప్రెకిల్స్ (చిన్న చుక్కల్లా కనిపించే గోధుమ రంగు మచ్చలు), ఏజ్ స్పాట్స్, చర్మంపై సన్నటి ముడుతలు కనిపిస్తాయి. చర్మాన్ని సాగదీసినప్పుడు ఇవి మాయమౌతాయి. కొన్ని సందర్భాల్లో కాస్త ఎర్రగా, గరుకుగా కనిపించే పులిపిరి కాయల్లాంటి యాక్టినిక్ కెరటోసిస్ వల్ల వయసు ఉన్నదాని కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది తర్వాతి దశలో చర్మ క్యాన్సర్‌కూ దారితీయవచ్చు. సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావడం వల్ల వయసు పైబడినట్లుగా మారడాన్ని ‘ఫొటో ఏజింగ్’ అంటారు. ఒకరి చర్మం ఫొటో ఏజింగ్‌కు గురికావడం అన్నది మళ్లీ ఆ వ్యక్తి చర్మపు రంగుతో పాటు అతడు ఎంతసేపు ఎండవేడికి ఎక్స్పోజ్ అవుతున్నాడనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఫెయిర్‌గా (తెల్లటి/ఎర్రటి చర్మపు రంగుతో) ఉండేవారికి చర్మంలో మెలనిన్ అనే పదార్థం తక్కువగా ఉంటుంది.
అందుకే వీళ్లు సూర్యరశ్మి ప్రభావానికి ఎక్కువగా గురవుతుంటారు. ఇక చర్మం డార్క్‌గా మారుతున్న కొద్దీ పై దుష్ర్పభావాలు తగ్గుతాయి. సూర్యరశ్మి తాలూకు దుష్ర్పభావాలకు చర్మం గురికావడం అన్నది కాలక్రమేణా జరుగుతుంటుంది. దీనివల్ల చర్మం నల్లబడటం, మందంగా మారడం, ముడుతలు పడటం జరుగుతుంది. అదేపనిగా సూర్యుడికి ఎక్స్పోజ్ కావడం వల్ల పై మార్పులన్నీ శాశ్వతం అయ్యే అవకాశమూ ఉంది. అందుకే వేడి ప్రదేశాల్లో నివసించేవారిలో ఏజింగ్ మార్పులన్నీ వారి ఇరవైలలోనే కనిపించడం మొదలవుతుంది.
సూర్యరశ్మివల్ల కలిగే ఏజింగ్ ప్రక్రియ నివారణకు..
సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావడం వల్ల వయసు పైబడినట్లుగా కనిపించడానికి దోహదం చేసే చర్మంలోని మార్పులను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...
ఈ ఎండ సమయంలో అంటే... ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వీలైనంతగా సూర్యరశ్మికి గురికాకుండా చూసుకోవడం .
సూర్యరశ్మిలోకి వెళ్లినప్పుడు సూర్యకిరణాలు నేరుగా తాకకుండా, చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు (అంటే పొడవుచేతుల చొక్కాల వంటివి) ధరించాలి. ముఖంపూర్తిగా కప్పుకుపోయేలా వెడల్పాటి అంచు ఉండే హ్యాట్ పెట్టుకోవాలి.
నిత్యం బయటికి వచ్చే ముందర సన్‌స్క్రీన్ రాసుకోవడం. అందునా ఎస్పీఎఫ్ 30 కంటే ఎక్కువ ఉండే సన్‌స్క్రీన్‌ను బయటికి రావడానికి 20 నిమిషాల ముందే రాసుకోవాలి. బయటికి వచ్చాక కూడా ప్రతి 3 గంటలకు ఒకమారు ఈ సన్‌స్క్రీన్‌ను రాసుకుంటూ ఉండాలి. స్విమ్మింగ్‌కు వెళ్తున్నప్పుడు లేదా ఎక్కువగా చెమట పడుతుందనుకున్నప్పుడు తడికి తట్టుకోగల (వాటర్ రెసిస్టెంట్) సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి.
చికిత్స : సూర్యరశ్మికి గురై నష్టపోయిన చర్మానికి లేజర్ టోనింగ్, మైక్రో డర్మా అబ్రేషన్, డర్మారోలర్, కెమికల్ పీలింగ్, లేజర్ రీ-సర్ఫేసింగ్ వంటి చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, మీసోథెరపీ, ఫైన్ థ్రెడ్ లిఫ్టింగ్ ప్రక్రియల వంటివి అత్యాధునికమైనవి. చికిత్స కోసం చాలా సమయం వెచ్చించలేనివారికి బొటాక్స్, ఫిల్లర్స్ అనే ప్రక్రియలు కూడా ఉన్నాయి.
భూమ్యాకర్షణ శక్తి (గ్రావిటీ)కి గురికావడం : మనం ప్రతి నిత్యం భూమ్యాకర్షణ శక్తికి గురవుతూనే ఉంటాం. అనుక్షణం మనల్ని అది కిందికి లాగుతూ ఉంటుంది. దీని ప్రభావం వల్ల మన చర్మంలో కనిపించే మార్పులను 50 ఏళ్లకు పైబడిన వారిలో చూడవచ్చు. ఎందుకంటే వారిలో చర్మం భూమ్యాకర్షణ శక్తికి లోబడి కిందికి వేలాడుతున్నట్లు కనిపిస్తుంది.
ఈ చర్మంపై గ్రావిటీ దుష్ర్పభావాల నివారణ ఇలా: క్రమం తప్పకుండా వ్యాయామం, పుష్టికరమైన ఆహారం వల్ల మన ముఖంలోని చర్మం ఎలాస్టిసిటీని కోల్పోకుండా ఉంటుంది. ముఖంపై పడే సన్నటి ముడుతలు (రింకిల్స్)ను సరిచేయడానికి బొటాక్స్‌తో, చెంపల వద్ద గుంటలు పడటాన్ని ఫిల్లర్స్ చికిత్సతో సరిచేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఫేస్‌లిఫ్ట్ ప్రక్రియను ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీతో సాధించవచ్చు.
నిద్రలో ముఖాన్ని ఉంచే పొజిషన్ వల్ల కనిపించే ఏజింగ్ :
మన ముఖాన్ని ఒక పక్కకు ఒరిగి ఉండేలా నిత్యం పడుకోవడం వల్ల ముఖంలో ఒకవైపు గీతలు పడతాయి. వీటిని ‘స్లీప్లైన్స్’ అంటారు. ఇవి నిద్రలో ముఖం వాలి ఉండే వైపునకు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల కూడా వయసు పైబడి కనిపిస్తుంటుంది.
పొగతాగడం వల్ల : ఈ దురలవాటుతో దేహంలోకి ప్రవేశించే విషపదార్థాల కారణంగా శరీరంలో ఎన్నో జీవరసాయన మార్పులు చోటుచేసుకుంటాయి. ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 10 కంటే ఎక్కువ సిగరెట్లు తాగేవారిలో... 10 ఏళ్ల తర్వాత ముఖం మీద రావాల్సిన ఏజింగ్ ముడుతలు పదేళ్ల కంటే ముందుగానే వస్తాయని తెలిసింది. పైగా సిగరెట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఈ ముడుతల లోతు కూడా పెరుగుతూ పోతుంది.
మితిమీరిన ఫేఫియల్ వ్యాయామాలు : కొందరు ముఖ (ఫేషియల్) వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అయితే మితిమీరి చేసే ఫేషియల్ వ్యాయామాల వల్ల కూడా ముఖం... వయసు కంటే ముందే ఏజింగ్‌కు గురవుతుందని తేలింది.
-నిర్వహణ: యాసీన్
ఏజింగ్ దుష్పరిణామాల నివారణకు సూచనలు...
ఈ మనం సమతుల ఆహారం తీసుకోవాలి. మనం తినే ఆహారపు జాబితాకి రంగురంగుల పండ్లను, కూరగాయలను చేర్చాలి. మన ఆహారంలో ఏజింగ్‌ను నివారించే క్యాటర్, బీట్రూట్, కలర్డ్ కాప్సికమ్, ఆరంజెస్, నిమ్మజాతి పండ్లు, స్ట్రాబెర్రీస్, బొప్పాయి పండ్లు, జామ, పుచ్చకాయలను ఎక్కువగా తీసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయాలి
మన భావ వ్యక్తీకరణను ముఖం ద్వారా చేయడాన్ని తగ్గించాలి. (ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌ను వీలైనంతగా తగ్గించాలి)
స్క్రబ్బింగ్‌ను కూడా వీలైనంతగా తగ్గించుకోవాలి
వీలైనంతగా ఒకపక్కకు ఒరిగి కాకుండా, పడకకు వీపును ఆనించే నిద్రపోవాలి
రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవాలి.
మరీ ఎక్కువ వేడినీటితో ముఖం కడుక్కోవడం, స్నానం చేయడాన్ని నివారించాలి. ఇందుకోసం గోరువెచ్చని నీటిని లేదా చల్లటి నీటినే ఉపయోగించాలి
ప్రతిరోజూ మాయిష్చరైజర్ను వాడాలి ఈ డాక్టర్ సలహా లేకుండా ముఖానికి పూసుకునే ఓవర్ ద కౌంటర్ సౌందర్యసాధనాలన్నింటినీ మానేయాలి. కేవలం డాక్టర్ సలహాతోనే వాటిని వాడాలి.
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
ఛీఫ్ డర్మటాలజిస్ట్
త్వచ స్కిన్ క్లినిక్
గచ్చిబౌలి, హైదరాబాద్