చర్మం పొడిబారుతోంది ఎలా?
కౌన్సెలింగ్
చలి వల్ల చర్మం పొడిబారుతోంది. నూనెలు వాడితే జిడ్డుగా అనిపిస్తుంది. మాయిశ్చరైజర్ వాడినా ఫలితం కనిపించడం లేదు. దురదలు కూడా వస్తున్నాయి. పరిష్కారం చెప్పగలరు.
- వాణీమోహన్, ఈ-మెయిల్
చలికాలం గాలిలో తేమ తగ్గిపోతుంది. దీని వల్ల చర్మంపై ఉండే సహజనూనెలు తగ్గిపోతుంటాయి. ఫలితంగా చర్మం పొడిబారుతోంది. అందుకే పై పూతగా చర్మానికి మాయిశ్చరైజర్ అనేది తప్పనిసరి. లేదంటే పొడిబారి, ముడతలు, దురద పుట్టి చర్మంపై పొక్కులు ఏర్పడతాయి. ఇలా చర్మం దెబ్బతినకుండా...
♦ నూనె ఆధారిత మాయిశ్చరైజర్లు వాడాలి. అదీ రోజుకు 3-4 సార్లు. థెర్మల్ స్కిన్ వాటర్ అనే మాయిశ్చరైజర్ మార్కెట్లో లభిస్తుంది. దీంట్లో హైడ్రేషన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మాయిశ్చరైజర్ వాడటం వల్ల చర్మం ముడతలు పడదు. త్వరగా వయసు పైబడ్డట్టు కనిపించరు. అలాగని పెట్రోలియమ్ జెల్లీ వంటివి ఈ కాలం వాడకూడదు. అందరి చర్మతత్త్వాలకు ఇవి సరిపడవు. వీటి వల్ల కొందరి చర్మం నల్లబడుతుంది.
♦ టోటల్ ఫ్యాటీ మ్యాటర్ , పి.హెచ్ 5.5.. గల సబ్బులు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిని స్నానానికి వాడాలి.
♦ చలి కాలం సూర్యకాంతి ప్రభావం తక్కువ అనుకోకూడదు. ఈ కాలంలోనే చర్మం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. అందుకని సన్‌ప్రొటెక్ట్ (ఎస్.పి.ఎఫ్ 30శాతం) క్రీమ్ తప్పక వాడాలి.
♦ స్నానం చేయడానికి 10 నిమిషాలు ముందు కొబ్బరినూనెను శరీరమంతా రాసుకుంటే మంచిది.
♦ చలి కదా అని మరీ వేడినీళ్లతో స్నానం చేయకూడదు. చర్మంపై ఉండే నూనెలను వేడి మరింతగా ఆవిరి చేస్తుంది. స్నానానికి గోరువెచ్చని నీళ్లనే వాడాలి.
♦ చర్మాన్ని పొడిబార్చే క్లెన్సర్లు, స్క్రబ్‌లు ఈ కాలం ఉపయోగించకూడదు.
- డా. షాను, చర్మవైద్య నిపుణురాలు
e-mail: sakshi.features@gmail.com