
మ్యూచువల్ ఫండ్స్ బ్రహ్మపదార్థం కాదు!
‘నాకు అంత ఐడియా లేదండి... మా ఆయనే చూసుకుంటారు డబ్బు విషయాలన్నీ’ అని మహిళలు అనే రోజులు కావివి. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలమైన సెన్సెక్స్, బ్యాంకులు, పెద్ద పెద్ద సంస్థలు వంటివే నేడు మహిళల నేతృత్వంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. మరి ఇలాంటి సమయంలోనూ నాకర్థం కావు అనుకోవడం మీ శక్తిని మీరు తక్కువ అంచనా వేసుకోవడమే. మహిళ పొదుపులో స్ట్రాంగ్, పెట్టుబడుల్లో వీక్... కానీ ఈ సిద్ధాంతం పాతబడే రోజులు వచ్చేశాయి.
ఈ వారం ఆధునిక మదుపు పద్ధతుల్లో ప్రాథమిక మార్గమైన మ్యూచువల్‌ఫండ్స్‌పె అవగాహన పెంచుకుందాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శక్తిమంతమైన మదుపు విధానాల్లో మ్యూచువల్ ఫండ్ ఒకటి. వీటిపై వచ్చే ప్రాథమిక ప్రశ్నలు-సమాధానాలు.
1. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి?
ఇది ఒక ఉమ్మడి నిధి. సంప్రదాయ పొదుపు పద్ధతుల కంటే కాస్త ఎక్కువ ఆదాయాన్నిచ్చేది. ఆధునిక పొదుపు పద్ధతుల్లో కాస్త తక్కువ రిస్క్‌తో కూడినది. నిరంతరం మార్పులక గురయ్యే షేర్లలో పెట్టుబడి పెట్టడం తెలియనపుడు ఏదైనా ఒక కంపెనీ ఒక ఉమ్మడి నిధిని ఏర్పాటుచేసి దానికో ‘కర్త’ను నియమించి షేర్లలో, బాండ్లలో మదుపు చేస్తుంది. వీలైనంత లాభదాయకంగా అతను ఈ ఉమ్మడి నిధిని షేర్లలో మదుపు చేస్తారు. ఈ ఉమ్మడి నిధిలో ప్రతి పౌరుడు తనకు నచ్చినంత మొత్తాన్ని మదుపు చేసుకోవచ్చు. వచ్చిన లాభాలను మనం మదుపు చేసిన శాతాన్ని బట్టి మనకు పంచుతారు. ఉదా: రెండు ఎకరాలున్న 50 మంది రైతులు తమ చిన్న పొలాలను అన్నీ కలిపి ఒకే వ్యక్తికి ఇచ్చారనుకుందాం. అతను పంట వేస్తాడు. లాభం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని అందరూ సమానంగా పంచుకుంటారు. ఫలితం ఏదైనా కౌలుదారుకు కొంత ఫీజు ఇస్తారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇలాగే పనిచేస్తాయి.
2. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎవరైనా పెట్టొచ్చా?
ఎవరైనా పెట్టొచ్చు. యాభై వేలకు పైన పెట్టుబడి పెట్టాలంటే పాన్‌కార్డ్ ఉండాలి. అంతకంటే తక్కువ అయితే అవసరం లేదు.
3. స్త్రీలకు మ్యూచువల్ ఫండ్స్‌లో మినహాయింపులేమైనా ఉంటాయా?
ఇదో ఉమ్మడి మదుపు నిధి కాబట్టి ప్రత్యేకించి మహిళలకు మినహాయింపులు ఏమీ ఉండవు.
4. మ్యూచువల్ ఫండ్స్‌లో దాచడం శ్రేయస్కరమేనా?
అసలుకు కూడా హామీ ఉండదు. కానీ, షేర్ల కంటే శ్రేయస్కరమే. మార్కెట్‌ను బట్టే లాభష్టాలుంటాయి.
5. అంత శ్రేయస్కరం కానపుడు ఎందుకు పెట్టాలి?
మనదేశంలో ధరలుపెరుగుదల-డబ్బు విలువ పడిపోవడం (ద్రవ్యోల్బణం) పెద్ద సమస్య. దీన్ని అధిగమించాలంటే మన పొదుపు రాబడి పెరగాలి. సాధారణ పద్ధతుల్లో ఆశించినంత రాదు. అందుకే కొంత నష్టభయం ఉన్నా కూడా వీటిలో పెట్టడం వల్ల ఎక్కువ ఆదాయానికి ఆస్కారం ఉంటుంది.
6. ‘అసలు’కు ఎసరు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఉన్న డబ్బంతా ఒకేసారి కాకుండా... ఒక ఫండ్ ఎంచుకుని అందులోనే ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తం (ఉదా: రూ.500) పెట్టుకుంటూ పోవడం శ్రేయస్కరం. ఇలా రెండేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం అలా పెడితే... నష్టం దాదాపు ఉండదు.
- వంగా రాజేంద్రప్రసాద్, ఆర్థిక వ్యవహారాల నిపుణులు