ఓల్గా నుంచి గంగకు.. | Article On Rahul Sankrityayan Ola nunchi Ganga Varaku | Sakshi
Sakshi News home page

ఓల్గా నుంచి గంగకు..

Published Mon, Aug 6 2018 1:09 AM | Last Updated on Mon, Aug 13 2018 7:56 PM

Article On Rahul Sankrityayan Ola nunchi Ganga Varaku - Sakshi

మన తాతముత్తాతల చరిత్రను తెలుసుకోవాలన్న కుతూహలం మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. వాళ్ల జీవిత విశేషాలను ఎవరైన చెప్తూంటే, చాలా ఉద్వేగంతో వింటాం. మరి ‘మానవత్వారంభ కాలం నుండి అంటే 361 తరాల నుండి మొదలుకుని 20వ శతాబ్దం వరకు జరిగిన మానవ వికాస క్రమాన్నీ, సామాజిక పరిణామాన్నీ కథలుగా మలిచి మన ముందుంచితే’? అది ఊహలకందని అద్భుతం.

అలా రాహుల్‌ సాంకృత్యాయన్‌ చేసిన అద్వితీయ రచన ‘ఓల్గా నుండి గంగకు’. ఇందులో మొత్తం 20 కథలున్నాయి.

మొదటి కథ ‘నిశ’ క్రీ.పూ. 6000 సంవత్సరం నాడు ఓల్గా నదీ తీరంలోని, ఆర్కిటిక్‌ మంచు మైదానాలలో ఒక ఇండోయూరోపియన్‌ కుటుంబం తమ జీవిక కోసం ప్రకృతితో జరిపిన పోరాటాన్ని వర్ణిస్తుంది.

మరొక కథలో స్వేచ్ఛ కోసం, స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపించి, కట్టుబాట్లను ఎదరించలేక విధివంచితుడిగా మిగిలిన పాంచాల యువరాజు సుదాసుడి విరహ వేదన హృదయాలను కదిలిస్తుంది.

‘బ్రిటిష్‌ పాలకులు అనుసరించిన క్రూరమైన పన్ను విధానాలు, సామాన్య రైతులపై జరిపిన దోపీడీలు, అత్యాచారాలు– వాటిని ఎదిరించలేని పేదల నిస్సహాయత’లకు ‘రేఖా భగత్‌’ పాత్ర ఒక విషాద సత్యం.

రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో దళిత మేధావి ‘సుమేరుడు’ ఫాసిస్టు శక్తుల నుండి దేశాన్ని రక్షించేందుకు చూపిన తెగువ, అతడి ఆత్మబలిదానం నిరుపమానమైనవి.

ప్రతీ కథలోనూ జీవన పోరాటం ఉంటుంది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, సమసమాజం, ప్రపంచశాంతి వంటి విలువల కోసం ప్రధాన పాత్రలు పరితపిస్తాయి. ఈ కథలు చదువుతుంటే ప్రాచీన చరిత్రపై మనకున్న సందేహాలూ, అపోహలూ మటుమాయం అవుతాయి. ప్రతీ కథలోనూ రాహుల్‌జీ చేసిన ప్రకృతి వర్ణన మనం ఆయా స్థలకాలాదులలో విహరించిన అనుభూతి కలిగిస్తుంది. 

ఈ ఇరవై కథలు ఫిక్షన్‌ జోనర్‌లో రాసినప్పటికీ ప్రామాణికత పాటించి రాసిన ‘మానవుడి చరిత్ర తాలూకు అవశేషాలు’. రాహుల్‌జీ క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా హజారీబాగ్‌ జైలులో ఉన్నప్పుడు ‘ఓల్గా సే గంగా’ పేరుతో 1943లో వీటిని హిందీలో రాశారు. చాగంటి తులసి తెలుగులోకి అనువదించారు. -సింగరాజు కూచిమంచి
 

మిమ్మల్ని బాగా కదిలించి, మీలో ప్రతిధ్వనించే పుస్తకం గురించి మాతో పంచుకోండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement