Rahul Sankrityayan
-
శ్యామ్ సింగరాయ్.. బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్
Shyam Singha Roy Movie Blockbuster Success Meet: నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 24న విడుదలైంది. తమ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా జరిగిన ‘శ్యామ్ సింగరాయ్’ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో నాని, వెంకట్ బోయినపల్లి చిత్రయూనిట్‌కి షీల్డ్స్‌ను ప్రదానం చేశారు. -
బురఖా ధరించి సినిమా వీక్షించిన సాయిపల్లవి
-
బుర్ఖాలో సీక్రెట్‌గా థియేటర్‌కు వెళ్లిన హీరోయిన్
Sai Pallavi Secret Visit To Sriramulu Theatre For Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్యామ్ సింగరాయ్’హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. నాని కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబడుతుంది. అయితే తాజాగా ఆడియెన్స్ రెస్పాన్స్ ప్రత్యక్షంగా చూసేందుకు హీరోయిన్ సాయి పల్లవి బుర్ఖా వేసుకొని థియేటర్లో సందడి చేసింది. బుధవారం హైదరాబాద్ ముసాపేటలోని శ్రీరాములు థియేటర్‌కు డైరెక్టర్ రాహుల్‌తో కలిసి థియేటర్‌కు వెళ్లింది. బుర్ఖా ధరించిన ప్రేక్షకుల మధ్య ఉండి సినిమా చూసింది. బుర్ఖా ఉండటంతో ప్రేక్షకులు ఎవరూ గుర్తుపట్టలేదు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. కాగా ఈ చిత్రంలో కృతిశెట్టి మారో హీరోయిన్గా నటించింది. -
హైదరాబాద్‌లో కోల్కత్తా
హైదరాబాద్ నగరంలో కోల్‌కత్తాను సెట్స్ ద్వారా సృష్టిస్తున్నారు ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రబృందం. నాని హీరోగా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృతియాన్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. వెస్ట్ బెంగాల్ నేపథ్యంలో ఈ చిత్రకథాంశం ఉంటుంది. కరోనా ముందు ఈ చిత్రం మొత్తాన్ని కోల్‌కత్తాలో చిత్రీకరించాలనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో కీలక సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ మొత్తాన్ని హైదరాబాద్‌లోనే సెట్ వేసి షూట్ చేయనున్నారు. ఆల్రెడీ సెట్ వర్క్ పని జరుగుతోంది కూడా. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయిక. మరో హీరోయిన్గా అదితీ రావ్ హైదరీ నటిస్తారని సమాచారం. -
ఓల్గా నుంచి గంగకు..
మన తాతముత్తాతల చరిత్రను తెలుసుకోవాలన్న కుతూహలం మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. వాళ్ల జీవిత విశేషాలను ఎవరైన చెప్తూంటే, చాలా ఉద్వేగంతో వింటాం. మరి ‘మానవత్వారంభ కాలం నుండి అంటే 361 తరాల నుండి మొదలుకుని 20వ శతాబ్దం వరకు జరిగిన మానవ వికాస క్రమాన్నీ, సామాజిక పరిణామాన్నీ కథలుగా మలిచి మన ముందుంచితే’? అది ఊహలకందని అద్భుతం. అలా రాహుల్ సాంకృత్యాయన్ చేసిన అద్వితీయ రచన ‘ఓల్గా నుండి గంగకు’. ఇందులో మొత్తం 20 కథలున్నాయి. మొదటి కథ ‘నిశ’ క్రీ.పూ. 6000 సంవత్సరం నాడు ఓల్గా నదీ తీరంలోని, ఆర్కిటిక్ మంచు మైదానాలలో ఒక ఇండోయూరోపియన్ కుటుంబం తమ జీవిక కోసం ప్రకృతితో జరిపిన పోరాటాన్ని వర్ణిస్తుంది. మరొక కథలో స్వేచ్ఛ కోసం, స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపించి, కట్టుబాట్లను ఎదరించలేక విధివంచితుడిగా మిగిలిన పాంచాల యువరాజు సుదాసుడి విరహ వేదన హృదయాలను కదిలిస్తుంది. ‘బ్రిటిష్ పాలకులు అనుసరించిన క్రూరమైన పన్ను విధానాలు, సామాన్య రైతులపై జరిపిన దోపీడీలు, అత్యాచారాలు– వాటిని ఎదిరించలేని పేదల నిస్సహాయత’లకు ‘రేఖా భగత్’ పాత్ర ఒక విషాద సత్యం. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో దళిత మేధావి ‘సుమేరుడు’ ఫాసిస్టు శక్తుల నుండి దేశాన్ని రక్షించేందుకు చూపిన తెగువ, అతడి ఆత్మబలిదానం నిరుపమానమైనవి. ప్రతీ కథలోనూ జీవన పోరాటం ఉంటుంది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, సమసమాజం, ప్రపంచశాంతి వంటి విలువల కోసం ప్రధాన పాత్రలు పరితపిస్తాయి. ఈ కథలు చదువుతుంటే ప్రాచీన చరిత్రపై మనకున్న సందేహాలూ, అపోహలూ మటుమాయం అవుతాయి. ప్రతీ కథలోనూ రాహుల్జీ చేసిన ప్రకృతి వర్ణన మనం ఆయా స్థలకాలాదులలో విహరించిన అనుభూతి కలిగిస్తుంది. ఈ ఇరవై కథలు ఫిక్షన్ జోనర్లో రాసినప్పటికీ ప్రామాణికత పాటించి రాసిన ‘మానవుడి చరిత్ర తాలూకు అవశేషాలు’. రాహుల్జీ క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా హజారీబాగ్ జైలులో ఉన్నప్పుడు ‘ఓల్గా సే గంగా’ పేరుతో 1943లో వీటిని హిందీలో రాశారు. చాగంటి తులసి తెలుగులోకి అనువదించారు. -సింగరాజు కూచిమంచి మిమ్మల్ని బాగా కదిలించి, మీలో ప్రతిధ్వనించే పుస్తకం గురించి మాతో పంచుకోండి. -
సత్వం: నదిలాంటి మనిషి
సృష్టాది నుంచీ ఈ ప్రపంచపు నడతను మేఘాల్లో కూర్చుని వీక్షించినట్టుగా ఆయన చరిత్రను రికార్డు చేసిపెట్టారు. లేదంటే ‘ఓల్గా నుంచి గంగకు’ రాయడం ఎలా సాధ్యం! ఏప్రిల్ 9న మహాయాత్రికుడు రాహుల్ సాంకృత్యాయన్ జయంతి: అద్భుతం అనే విశేషణానికే గనక రూపమొస్తే, అది ఆరడుగుల రాహుల్ సాంకృత్యాయన్‌లా ఉంటుంది. ఎలాంటి మనిషాయన! యాత్రికుడు, చరిత్రకారుడు, భాషాశాస్త్రవేత్త, అనువాదకుడు, ఆచార్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, అపారమైన పాండిత్యం ఉన్నప్పటికీ సరళమైన హిందీలో రాసిన రచయిత! రాహుల్జీ పేరు వినగానే, కాళ్లకు కట్టుకోవడానికి బలపాల్ని వెతికేవాళ్లు ఉంటారు. అంతటి ఉత్తేజకర పాదాచారి ఆయన. యాత్రలు వాటికవే ఇవ్వగలిగే పరమానందాన్ని అనుభవిస్తూనే, వాటిద్వారా పరమార్థాన్ని కూడా ప్రజలకు అందించారు రాహులుడు. ఒకసారి ఈ దృశ్యం ఊహిద్దాం! పదమూడో శతాబ్దంలో నలంద, విక్రమశిల విశ్వవిద్యాలయాలను భక్తియార్ ఖిల్జీ ధ్వంసం చేసినప్పుడు బౌద్ధ భిక్షువులు పవిత్రమైన గ్రంథాలతో పారిపోయారనీ, ఆ విలువైన సంస్కృత పుస్తకాల్ని టిబెట్‌లోని ఆరామాల్లో భద్రపరిచివుంచారనీ ప్రచారంలో ఉంది. అయితే, ఆరు వందల ఏళ్లుగా వాటిల్లో ఏముందో చూసినవారు లేరు. సాంకృత్యాయన్ వాటికోసం అన్వేషిస్తూ, దారి కూడా సరిగాలేని కొండల్లో నడుస్తూ, కాశ్మీర్, లడఖ్, కార్గిల్ మీదుగా టిబెట్ వెళ్లారు. అక్కడ పుస్తకాలైతే లభించాయిగానీ అవి సంస్కృతంలో లేవు. అన్నీ భోటి భాషలో ఉన్నాయి. రాహుల్జీ కంచరగాడిదల మీద వాటిని తరలించుకొచ్చారు. మరో మూడుసార్లు టిబెట్ వెళ్లారు. టిబెటన్ నేర్చుకున్నారు. నేర్చుకోవడమేకాదు దాని వ్యాకరణ పుస్తకాలు రాశారు. టిబెటన్-హిందీ నిఘంటువు కూర్చారు. ఆ గ్రంథాలన్నీ పాట్నా మ్యూజియంలో ఉన్నాయిప్పుడు. ‘‘ప్రపంచంలో యాత్రలు చేయడానికి మించిన ముఖ్యమైన విషయం మరోటి లేదు. సమాజం కోసం ఒక యాత్రికుడికంటే శ్రేష్టంగా ఆలోచించగలవారు మరెవరూ ఉండరు,’’ అనేవారు రాహుల్జీ. ఈ ప్రపంచం ఈ రీతిన ఉండటానికి యాత్రికుల వివేకమే కారణమంటారాయన. ‘‘యాత్రలంటూ జరగకపోయివుంటే సోమరి మానవమూకలు పశుస్థాయినుంచి పరిణామం చెందేవే కాదు’’. ఉత్తరప్రదేశ్‌లోని పల్లెటూరులో కేదార్నాథ్ పాండేగా జన్మించి, తొమ్మిదేళ్లప్పుడే ప్రపంచం ఏమిటో చూడాలని ఇంట్లోంచి పారిపోయాడు సాంకృత్యాయన్. వేలాది కిలోమీటర్లు కాలినడకన చుట్టివచ్చారు. బౌద్ధాన్ని తనలో ఇంకించుకున్నవాడుగా తన పేరును రాహుల్ సాంకృత్యాయన్‌గా మార్చుకున్నారు. మూడు బౌద్ధ వేదాలనూ జీర్ణించుకుని త్రిపిటకాచార్య అయ్యారు. టిబెట్, శ్రీలంక, ఇరాన్, చైనా, అప్పటి సోవియట్ రష్యా... ఎక్కడ తిరిగితే అక్కడి భాష నేర్చుకున్నారు. అరబిక్, భోజ్‌పురి, ఫ్రెంచ్, హిందీ, కన్నడం, మైథిలి, నేపాలీ, పాళీ, పర్షియన్, రష్యన్, రాజస్థానీ, సింహళీస్, తమిళం, ఉర్దూలాంటి ముప్పైకి పైగా భాషలు, అందులోని యాసలు కూడా ఆయనకు తెలుసు. ఎక్కడా అధికారికంగా చదువుకోకపోయినా విశ్వవిద్యాలయాల్లో బోధించే స్థాయికి ఎదిగారు. అందుకే ఆయన్ని మహాపండిత్ అనేవారు. చివరికి మార్క్సిజం దగ్గర తన భావాల్ని స్థిరీకరించుకున్న రాహుల్జీ... సోషియాలజీ, మతం, తత్వం, భాష, సైన్సు మీద శతాధిక పుస్తకాలు రాశారు. రుగ్వేద ఆర్యులు, లోకసంచారి, దివోదాసు, విస్మృత యాత్రికుడు, సింహసేనాపతి, జయమౌధేయ, మధురస్వప్నం లాంటివి అందులో కొన్ని. సృష్టాది నుంచీ ఈ ప్రపంచపు నడతను మేఘాల్లో కూర్చుని వీక్షించినట్టుగా ఆయన చరిత్రను రికార్డు చేసిపెట్టారు. లేదంటే ‘ఓల్గా నుంచి గంగకు’ రాయడం ఎలా సాధ్యం! చరిత్రను అర్థం చేయించడానికి ఆయన పూసిన పంచదార పూత ఒక్కోసారి అది చరిత్రేనా అన్న అనుమానాన్ని కలిగిస్తుంది. కానీ ఎన్ని చరిత్రగ్రంథాలు చదివినా మెదడులో నమోదుకాని దృశ్యమాలిక ఆయన ‘ఓల్గా నుంచి గంగకు’ ద్వారా నమోదవుతుంది. రిఫరెన్సు పుస్తకాలు కూడా కంఠోపాఠంగా ఉంచుకున్న ఈ మహావిజ్ఞాని చివరిరోజుల్లో తన పేరేమిటో తనే చెప్పుకోలేని మతిమరుపులోకి జారిపోవడం సృష్టి వైచిత్రి. కానీ ఆయన్ని మనం మాత్రం మరిచిపోగలమా!