సినీ మినీ కబుర్లు
సినిమా కష్టాలు అనే మాట వాడుతుంటాం. ఆ కష్టాల్లో కూడా రకరకాలు ఉంటాయి. అలాంటి ఒక కష్టాన్ని ఆరుద్ర తన ‘సినీ మినీ కబుర్లు’లో పంచుకున్నారు. చిన్నప్పుడు పిల్లలు పొలానికి వెళ్లినప్పుడు, అందులో ఒకడు ‘ఈ చెట్టు పళ్లు నావిరోయ్’ అనేస్తే మిగతావారు విధిగా ఆ చెట్టును వదిలేసి వేరేది చూసుకుంటారు. అదొక రాయబడని చట్టం. ఈ సరదా ఘటన కూడా అలాంటిదే. ‘‘ఒకనాడు నేను పాండిబజారులోని రాజకుమారి టాకీసులో ఆడుతున్న ఒక ఇంగ్లీషు సినిమాకి ఒక ప్రొడ్యూసర్ బలవంతం మీద రెండోసారి వెళ్లాను.
ఇంటర్‌వెల్‌లో జూనియర్ సిగరెట్ తాగుతూ కనబడ్డాడు. ‘‘బ్రదర్! ఇది నువ్వు ఎడాప్ట్ చేయాలనుకుంటున్నావేమో! నేను రిజర్వు చేసుకున్నాను’’ అని జూనియర్ స్పష్టపరిచాడు. ‘‘ఇది నేను రెండోసారి చూస్తున్నాను బ్రదర్!’’ అని నేను చెప్పాను. ‘‘నేను మూడోసారి చూస్తున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్‌కు సీనిక్ ఆర్డర్ ఏమిటో డిక్టేట్ చేస్తున్నాను, రాసుకుంటున్నాడు. దీనికి కాపీ రైటు నాది’’ అని జూనియర్ ప్రకటించాడు. చిత్రరంగంలో కాపీరైటు అంటే చట్టబద్ధమైన సర్వ స్వామ్యాలు కావు. కాపీ చేసే రైటు. ఆ చిత్రాన్ని కాపీ చేసే రైటు జూనియర్‌కు ఉందన్న సంగతి నా ప్రొడ్యూసర్‌కు నచ్చచెప్పటానికి నా తాతలు దిగివచ్చారు’’. (మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.)
Comments
Please login to add a commentAdd a comment