మనదేశానికి ఏమైంది? థామ్సన్ రాయ్‌టర్స్ ఏం చెప్పింది? లైంగిక దాడులు, అక్రమ రవాణా, హత్యలు, భ్రూణహత్యలు... భారతదేశంలో మహిళ అత్యంత ప్రమాదకరమైన స్థితిలో జీవిస్తోంది... అంటోంది థామ్సన్ రాయ్‌టర్స్. ‘అంత లేదని’ మహిళా కమిషన్ కొట్టిపారేసింది. ‘195 దేశాల్లో అధ్యయనం చేయడానికి 548 మంది ఏ మూలకు’ అని విశ్లేషకుల వాదన. ఆ నివేదికను పక్కన పెడితే... మనదేశంలో మహిళ పరిస్థితిని తన 39 ఏళ్ల పోలీసు అనుభవంతో విశ్లేషిస్తున్నారు అరుణాబహుగుణ.
‘‘మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి రాస్తూ పోతే పుంఖానుపుంఖాలుగా గ్రంథాలవుతాయి. ప్రపంచం మొత్తంలోనూ మహిళ పీడితవర్గంగానే ఉంది. ఇది కొన్ని వందల ఏళ్లుగా కొనసాగిన దైన్యం. ప్రపంచంలో 195 దేశాల్లో ఈ అంశం మీద సర్వే చేశారంటేనే అర్థమవుతోంది. మహిళలు ఇప్పటికీ బాధలకు లోనయ్యే స్థితిలోనే ఉన్నారని. ఈ పరిస్థితి గతంలో ఉండేది, ఇప్పుడూ ఉంది. విజ్ఞత నేర్చుకోకపోతే మరి కొన్ని తరాలకూ బాధలు తప్పవు.
నాలుగ్గోడలే సాక్ష్యం
మనదేశంలో మహిళలు చిన్నచూపుకు లోనవుతూ వందల ఏళ్లుగా కష్టాలు పడుతూనే ఉన్నారు. శారీరక – మానసిక వేధింపులు, లైంగిక దాడులు కూడా. ఇంటి నాలుగ్గోడల మధ్యనే లెక్కలేనన్ని దాడులు జరిగిపోయేవి. వితంతు మహిళ మీద అనేక అఘాయిత్యాలు జరిగేవి. అప్పుడప్పుడే వయసుకొస్తున్న లోకం తెలియని అమ్మాయిల మీద బంధువులే లైంగిక దాడికి పాల్పడే వాళ్లు. అవేవీ ఆ గోడలు దాటి బయటకు వచ్చేవి కాదు. మహిళలు పంటి బిగువున ఆ వేదనను అదిమి పెట్టుకుని బతుకు వెళ్లదీసేవారు. ఇప్పుడు మహిళల్లో ధ్యైర్యం వచ్చింది. నోరు తెరిచి తమకు వచ్చిన కష్టాన్ని చెప్పుకోగలుగుతున్నారు. అది స్వాగతించాల్సిన విషయం.
అండలేని కాలమది
మగవాళ్ల మీద ఆధారపడి జీవించిన స్థితి నుంచి మహిళలు బయటపడుతున్నారు, ఇండిపెండెంట్ అవుతున్నారు. ఇప్పుడు మహిళలకు ఎదురవుతున్న దాడుల్లో ఎక్కువ ఇంటి బయట జరుగుతున్నవే. నేను సర్వీస్‌లోకి వచ్చినప్పటి నుంచి లైంగిక వేధింపుల కేసు రోజుకి కనీసం ఒక్కటైనా వచ్చేది.
అప్పట్లో ఒక ఆడపిల్ల ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కి వచ్చి కంప్లయింట్ ఇస్తే, ఆమెకి కుటుంబం నుంచి సపోర్టు ఉండేది కాదు. చాలా కేసుల్లో... అమ్మాయి చేత కేసు విత్‌డ్రా చేయించేవాళ్లు, న్యాయం కోసం పోరాడమని అండగా నిలిచేవాళ్లు కాదు. అమ్మానాన్నలు, భర్త, అత్తమామలు అమ్మాయినే వేలెత్తి చూపుతూ, ఆమె తలదించుకునేటట్లు చేసేవాళ్లు. ఇప్పుడు పేరెంట్స్ అమ్మాయికి అండగా నిలుస్తున్నారు. సమాజం చైతన్యవంతం అవుతోందనడానికి ఇదో ప్రతీక.
స్వీయరక్షణే ప్రధానం
మహిళల రక్షణ కోసం చట్టాలున్నాయి. న్యాయం కోసం పోరాడటానికి న్యాయస్థానాలూ ఉన్నాయి. అన్నింటికంటే ముందు మహిళలు స్వీయరక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని తీరాలి. పబ్‌లు, పార్టీలకు వెళ్లడం తప్పు కాదు. ప్రభుత్వం ఒక నిర్ణీత వయసును నిర్దేశించింది. ఆ నియమాన్ని కచ్చితంగా పాటిస్తే అనేక అవాంతరాలు నివారణ అవుతాయి.
పార్టీల్లో పాల్గొన్న మహిళలు ‘కోక్‌లో మత్తు కలిపి ఇచ్చారని, మోస పోయా’మని కన్నీళ్లు పెట్టుకుంటుంటారు. పబ్లిక్ ప్రదేశాల్లో కోక్ వంటి వాటిని ఎవరికి వారు మూత తీసుకుని తాగడం అలవాటు చేసుకోవాలి. ఎంత స్నేహితులైనా, సన్నిహితులని నమ్మినా సరే... మరొకరు మూత తీసిన కోక్ బాటిల్‌ను తీసుకోవద్దనే చెబుతాను. కొత్త వాళ్లతో పార్టీలకు వెళ్లకూడదు.
అలాగే ఒక టీమ్‌లో కనీసం ఒక్కరైనా మద్యం సేవించని వారై ఉంటే ఆ పార్టీలో పాల్గొన్న వాళ్లు క్షేమంగా ఇళ్లకు చేరుతారు. పిక్‌నిక్‌లంటూ బయటకు వెళ్లేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. మగవాళ్లకంటే మహిళలు శారీరకంగా బలహీనులు, కాబట్టి మహిళలు మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలి. ప్రలోభాలకు లోనుకాకుండా, తమ రక్షణ గురించి జాగ్రత్తగా ఉండాలి.
కమిటీ రక్షణ
మహిళలు తమకు ఎదురయ్యే సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండటంతోపాటు, తమకు రక్షణగా ఉన్న చట్టాల గురించి తెలుసుకోవాలి. చాలా మంది ఉద్యోగినులకు విశాఖ జడ్జిమెంట్, ఆ మేరకు రూపొందిన సెక్సువల్ హెరాస్‌మెంట్ ప్రివెన్షన్ గురించి ఏ మాత్రం తెలియదు. ఆ చట్టం ప్రకారం మగవాళ్లు, మహిళలు కలిసి పని చేసే ప్రతి ఆఫీస్‌లోనూ లైంగిక వేధింపుల నిరోధక కమిటీ ఉండాలి. ఈ కమిటీకి అధ్యక్షత వహించాల్సింది మహిళ మాత్రమే.
కంప్లయింట్ ఇచ్చిన మహిళ పేరు, విచారణలో చర్చించిన విషయాలను సభ్యులు బయటకు చెప్పకూడదనే నిబంధన ఉంటుంది. అందుకోసం ఒక డిక్లరేషన్ మీద సంతకం కూడా చేస్తారు కమిటీ సభ్యులు. కాబట్టి బాధిత మహిళలు ఎటువంటి సంకోచం లేకుండా కమిటీని సంప్రదించవచ్చు. కమిటీ వేయమని యాజమాన్యాన్ని కోరాలి. మహిళల ఈ డిమాండ్‌ను ఏ సంస్థ కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు.
ఇదీ చదువే!
అమ్మాయిని తక్కువగా చూడటం ఇంటి నుంచే మొదలవుతుంది. ఇంట్లో అబ్బాయిని మహారాజులాగా చూస్తూ, అమ్మాయి చేత అతడికి సేవలు చేయిస్తుంటేæ... పిల్లలు అదే నేర్చుకుంటారు. అలాంటి తల్లిదండ్రులు దేశానికి పౌరులుగా చాందసులనే ఇస్తారు. అలా పెరిగిన అబ్బాయి ‘తాను మగవాడిని కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుంద’నుకుంటాడు.
ఈ విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంత ఉందో... స్కూలు, కాలేజ్‌ల మీద కూడా అంతే బాధ్యత ఉంటుంది. కరిక్యులమ్‌లో స్త్రీ–పురుష సమానత్వం, మహిళను గౌరవించడం వంటి అంశాలు విధిగా ఉండాలి. మహిళల అక్రమ రవాణా చేసేవాళ్లలో ‘మహిళ దేçహాన్ని ఉపయోగించుకుంటే తప్పేంటి’ అనే అహంకారపూరిత ధోరణే కదా! మహిళను తనతో సమానంగా గౌరవించడం అలవాటైతే మగవాళ్లలో ఈ రకమైన అవాంచనీయ ధోరణి రాదు.
మహిళల కుటుంబం
మాది మహిళల కుటుంబం. మా నాన్న ఉద్యోగ రీత్యా దూరంగా ఉండేవారు. మా అమ్మమ్మ, అమ్మ ఇద్దరూ వర్కింగ్ ఉమెనే. మా ఇంట్లో మగవాళ్లకు ఆడవాళ్లను గౌరవించే సంప్రదాయమే ఉండేది. మగవాళ్లు, ఆడవాళ్లు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకునే స్థాయికి సమాజం పరిణతి చెందాలి. అమ్మాయిలకు చెప్పేది ఒక్కటే... సమానత్వ సాధన కోసం పోరాటం జరుగుతోంది. ఈ పోరాటం మగవాళ్లను ద్వేషించడానికి కాదు. ఆడవాళ్లు... మగవారికంటే ఎందులోనూ తక్కువ కాదనే విషయాన్ని మగవాళ్లకు తెలియచెప్పడానికే.
39 ఏళ్ల కెరీర్...
అరుణా బహుగుణ 1979లో ఉద్యోగంలో చేరారు. ఆంధ్రప్రదేశ్ (సమైక్యాంధ్రప్రదేశ్) రాష్ట్రానికి తొలి మహిళా ఐపీఎస్ అధికారి. కో ఆర్డినేషన్, డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ వర్క్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌లో విధులు నిర్వర్తించారు. ధైర్యం, నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు. ఆమె సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో ఎస్‌డీజీ అయిన తొలి మహిళ. ఆమె శాంతి భద్రతల సమస్యల్ని పరిష్కరించడంతోపాటు, సమాజం పురోభివృద్ధి కోసమే శ్రమించారు.
నేషనల్ పోలీస్ అకాడమీ (సర్దార్ వల్లభ్‌భాయ్ నేషనల్ పోలీస్ అకాడమీ) డైరెక్టర్ బాధ్యతలందుకున్న తొలి మహిⶠకూడా. అదే అకాడమీ నుంచి గత ఏడాది రిటైరయ్యారు. ఆమె నిర్వర్తించిన కీలకమైన విధులకు గుర్తింపుగా ఇండియన్ పోలీస్ మెడల్ (1995), ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (2005) అందుకున్నారు. ఆమె పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లో.
గోల్ఫ్ ఆడటం, సంగీతం వినడం, పియానో వాయించడం, పెట్‌తో ఆడుకోవడం ఆమెకిష్టమైన వ్యాపకాలు.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment