Aruna Bahuguna
-
అవగాహనే ఆత్మరక్షణ
మనదేశానికి ఏమైంది? థామ్సన్ రాయ్‌టర్స్ ఏం చెప్పింది? లైంగిక దాడులు, అక్రమ రవాణా, హత్యలు, భ్రూణహత్యలు... భారతదేశంలో మహిళ అత్యంత ప్రమాదకరమైన స్థితిలో జీవిస్తోంది... అంటోంది థామ్సన్ రాయ్‌టర్స్. ‘అంత లేదని’ మహిళా కమిషన్ కొట్టిపారేసింది. ‘195 దేశాల్లో అధ్యయనం చేయడానికి 548 మంది ఏ మూలకు’ అని విశ్లేషకుల వాదన. ఆ నివేదికను పక్కన పెడితే... మనదేశంలో మహిళ పరిస్థితిని తన 39 ఏళ్ల పోలీసు అనుభవంతో విశ్లేషిస్తున్నారు అరుణాబహుగుణ. ‘‘మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి రాస్తూ పోతే పుంఖానుపుంఖాలుగా గ్రంథాలవుతాయి. ప్రపంచం మొత్తంలోనూ మహిళ పీడితవర్గంగానే ఉంది. ఇది కొన్ని వందల ఏళ్లుగా కొనసాగిన దైన్యం. ప్రపంచంలో 195 దేశాల్లో ఈ అంశం మీద సర్వే చేశారంటేనే అర్థమవుతోంది. మహిళలు ఇప్పటికీ బాధలకు లోనయ్యే స్థితిలోనే ఉన్నారని. ఈ పరిస్థితి గతంలో ఉండేది, ఇప్పుడూ ఉంది. విజ్ఞత నేర్చుకోకపోతే మరి కొన్ని తరాలకూ బాధలు తప్పవు. నాలుగ్గోడలే సాక్ష్యం మనదేశంలో మహిళలు చిన్నచూపుకు లోనవుతూ వందల ఏళ్లుగా కష్టాలు పడుతూనే ఉన్నారు. శారీరక – మానసిక వేధింపులు, లైంగిక దాడులు కూడా. ఇంటి నాలుగ్గోడల మధ్యనే లెక్కలేనన్ని దాడులు జరిగిపోయేవి. వితంతు మహిళ మీద అనేక అఘాయిత్యాలు జరిగేవి. అప్పుడప్పుడే వయసుకొస్తున్న లోకం తెలియని అమ్మాయిల మీద బంధువులే లైంగిక దాడికి పాల్పడే వాళ్లు. అవేవీ ఆ గోడలు దాటి బయటకు వచ్చేవి కాదు. మహిళలు పంటి బిగువున ఆ వేదనను అదిమి పెట్టుకుని బతుకు వెళ్లదీసేవారు. ఇప్పుడు మహిళల్లో ధ్యైర్యం వచ్చింది. నోరు తెరిచి తమకు వచ్చిన కష్టాన్ని చెప్పుకోగలుగుతున్నారు. అది స్వాగతించాల్సిన విషయం. అండలేని కాలమది మగవాళ్ల మీద ఆధారపడి జీవించిన స్థితి నుంచి మహిళలు బయటపడుతున్నారు, ఇండిపెండెంట్ అవుతున్నారు. ఇప్పుడు మహిళలకు ఎదురవుతున్న దాడుల్లో ఎక్కువ ఇంటి బయట జరుగుతున్నవే. నేను సర్వీస్‌లోకి వచ్చినప్పటి నుంచి లైంగిక వేధింపుల కేసు రోజుకి కనీసం ఒక్కటైనా వచ్చేది. అప్పట్లో ఒక ఆడపిల్ల ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కి వచ్చి కంప్లయింట్ ఇస్తే, ఆమెకి కుటుంబం నుంచి సపోర్టు ఉండేది కాదు. చాలా కేసుల్లో... అమ్మాయి చేత కేసు విత్‌డ్రా చేయించేవాళ్లు, న్యాయం కోసం పోరాడమని అండగా నిలిచేవాళ్లు కాదు. అమ్మానాన్నలు, భర్త, అత్తమామలు అమ్మాయినే వేలెత్తి చూపుతూ, ఆమె తలదించుకునేటట్లు చేసేవాళ్లు. ఇప్పుడు పేరెంట్స్ అమ్మాయికి అండగా నిలుస్తున్నారు. సమాజం చైతన్యవంతం అవుతోందనడానికి ఇదో ప్రతీక. స్వీయరక్షణే ప్రధానం మహిళల రక్షణ కోసం చట్టాలున్నాయి. న్యాయం కోసం పోరాడటానికి న్యాయస్థానాలూ ఉన్నాయి. అన్నింటికంటే ముందు మహిళలు స్వీయరక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని తీరాలి. పబ్‌లు, పార్టీలకు వెళ్లడం తప్పు కాదు. ప్రభుత్వం ఒక నిర్ణీత వయసును నిర్దేశించింది. ఆ నియమాన్ని కచ్చితంగా పాటిస్తే అనేక అవాంతరాలు నివారణ అవుతాయి. పార్టీల్లో పాల్గొన్న మహిళలు ‘కోక్‌లో మత్తు కలిపి ఇచ్చారని, మోస పోయా’మని కన్నీళ్లు పెట్టుకుంటుంటారు. పబ్లిక్ ప్రదేశాల్లో కోక్ వంటి వాటిని ఎవరికి వారు మూత తీసుకుని తాగడం అలవాటు చేసుకోవాలి. ఎంత స్నేహితులైనా, సన్నిహితులని నమ్మినా సరే... మరొకరు మూత తీసిన కోక్ బాటిల్‌ను తీసుకోవద్దనే చెబుతాను. కొత్త వాళ్లతో పార్టీలకు వెళ్లకూడదు. అలాగే ఒక టీమ్‌లో కనీసం ఒక్కరైనా మద్యం సేవించని వారై ఉంటే ఆ పార్టీలో పాల్గొన్న వాళ్లు క్షేమంగా ఇళ్లకు చేరుతారు. పిక్నిక్లంటూ బయటకు వెళ్లేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. మగవాళ్లకంటే మహిళలు శారీరకంగా బలహీనులు, కాబట్టి మహిళలు మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలి. ప్రలోభాలకు లోనుకాకుండా, తమ రక్షణ గురించి జాగ్రత్తగా ఉండాలి. కమిటీ రక్షణ మహిళలు తమకు ఎదురయ్యే సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండటంతోపాటు, తమకు రక్షణగా ఉన్న చట్టాల గురించి తెలుసుకోవాలి. చాలా మంది ఉద్యోగినులకు విశాఖ జడ్జిమెంట్, ఆ మేరకు రూపొందిన సెక్సువల్ హెరాస్మెంట్ ప్రివెన్షన్ గురించి ఏ మాత్రం తెలియదు. ఆ చట్టం ప్రకారం మగవాళ్లు, మహిళలు కలిసి పని చేసే ప్రతి ఆఫీస్‌లోనూ లైంగిక వేధింపుల నిరోధక కమిటీ ఉండాలి. ఈ కమిటీకి అధ్యక్షత వహించాల్సింది మహిళ మాత్రమే. కంప్లయింట్ ఇచ్చిన మహిళ పేరు, విచారణలో చర్చించిన విషయాలను సభ్యులు బయటకు చెప్పకూడదనే నిబంధన ఉంటుంది. అందుకోసం ఒక డిక్లరేషన్ మీద సంతకం కూడా చేస్తారు కమిటీ సభ్యులు. కాబట్టి బాధిత మహిళలు ఎటువంటి సంకోచం లేకుండా కమిటీని సంప్రదించవచ్చు. కమిటీ వేయమని యాజమాన్యాన్ని కోరాలి. మహిళల ఈ డిమాండ్‌ను ఏ సంస్థ కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఇదీ చదువే! అమ్మాయిని తక్కువగా చూడటం ఇంటి నుంచే మొదలవుతుంది. ఇంట్లో అబ్బాయిని మహారాజులాగా చూస్తూ, అమ్మాయి చేత అతడికి సేవలు చేయిస్తుంటేæ... పిల్లలు అదే నేర్చుకుంటారు. అలాంటి తల్లిదండ్రులు దేశానికి పౌరులుగా చాందసులనే ఇస్తారు. అలా పెరిగిన అబ్బాయి ‘తాను మగవాడిని కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుంద’నుకుంటాడు. ఈ విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంత ఉందో... స్కూలు, కాలేజ్‌ల మీద కూడా అంతే బాధ్యత ఉంటుంది. కరిక్యులమ్‌లో స్త్రీ–పురుష సమానత్వం, మహిళను గౌరవించడం వంటి అంశాలు విధిగా ఉండాలి. మహిళల అక్రమ రవాణా చేసేవాళ్లలో ‘మహిళ దేçహాన్ని ఉపయోగించుకుంటే తప్పేంటి’ అనే అహంకారపూరిత ధోరణే కదా! మహిళను తనతో సమానంగా గౌరవించడం అలవాటైతే మగవాళ్లలో ఈ రకమైన అవాంచనీయ ధోరణి రాదు. మహిళల కుటుంబం మాది మహిళల కుటుంబం. మా నాన్న ఉద్యోగ రీత్యా దూరంగా ఉండేవారు. మా అమ్మమ్మ, అమ్మ ఇద్దరూ వర్కింగ్ ఉమెనే. మా ఇంట్లో మగవాళ్లకు ఆడవాళ్లను గౌరవించే సంప్రదాయమే ఉండేది. మగవాళ్లు, ఆడవాళ్లు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకునే స్థాయికి సమాజం పరిణతి చెందాలి. అమ్మాయిలకు చెప్పేది ఒక్కటే... సమానత్వ సాధన కోసం పోరాటం జరుగుతోంది. ఈ పోరాటం మగవాళ్లను ద్వేషించడానికి కాదు. ఆడవాళ్లు... మగవారికంటే ఎందులోనూ తక్కువ కాదనే విషయాన్ని మగవాళ్లకు తెలియచెప్పడానికే. 39 ఏళ్ల కెరీర్... అరుణా బహుగుణ 1979లో ఉద్యోగంలో చేరారు. ఆంధ్రప్రదేశ్ (సమైక్యాంధ్రప్రదేశ్) రాష్ట్రానికి తొలి మహిళా ఐపీఎస్ అధికారి. కో ఆర్డినేషన్, డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ వర్క్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌లో విధులు నిర్వర్తించారు. ధైర్యం, నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు. ఆమె సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో ఎస్డీజీ అయిన తొలి మహిళ. ఆమె శాంతి భద్రతల సమస్యల్ని పరిష్కరించడంతోపాటు, సమాజం పురోభివృద్ధి కోసమే శ్రమించారు. నేషనల్ పోలీస్ అకాడమీ (సర్దార్ వల్లభ్‌భాయ్ నేషనల్ పోలీస్ అకాడమీ) డైరెక్టర్ బాధ్యతలందుకున్న తొలి మహిⶠకూడా. అదే అకాడమీ నుంచి గత ఏడాది రిటైరయ్యారు. ఆమె నిర్వర్తించిన కీలకమైన విధులకు గుర్తింపుగా ఇండియన్ పోలీస్ మెడల్ (1995), ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (2005) అందుకున్నారు. ఆమె పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లో. గోల్ఫ్ ఆడటం, సంగీతం వినడం, పియానో వాయించడం, పెట్‌తో ఆడుకోవడం ఆమెకిష్టమైన వ్యాపకాలు. – వాకా మంజులారెడ్డి -
‘కోటిన్నర ఉద్యోగాలు కల్పించే సత్తా ఉంది’
సాక్షి,బెంగళూర్ః ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) వంటి నూతన టెక్నాలజీలకు కోటిన్నర ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం ఉందని టెలికాం కార్యదర్శి అరుణా బహుగుణ అన్నారు. కొత్త ఉద్యోగాల కల్పనలో ఐటీ రంగం వెనుకబడి ఉన్నా నూతన టెక్నాలజీలతో ఆ లోటు పూడ్చుకోవచ్చన్నారు. దేశంలోని బెంగళూర్ ఇతర ప్రాంతాల్లో ఐటీ అవకాశాలపై ఆందోళన వ్యక్తమవుతున్నా కేవలం ఐఓటీ ద్వారానే ఈ స్ధాయిలో ఉద్యోగాలు సమకూర్చుకోవచ్చన్నారు. ఐఓటీ ఇండియా కాంగ్రెస్ సదస్సు సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఐఓటీకి పెద్దసంఖ్యలో ఉద్యోగాలను సృష్టించగల సత్తా ఉందంటూ, ఈ జాబ్‌లు బడా కంపెనీల నుంచి కాక స్టార్టప్‌ల నుంచే ఎక్కువగా ఉంటాయని అంచనా వేశారు. ఐఓటీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం త్వరలో మెరుగైన విధానంతో ముందుకొస్తుందన్నారు. నూతన టెక్నాలజీలకు అవసరమైన భద్రతా ప్రోటోకాల్స్‌పై ఐటీ, టెలికాం మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. -
జనం మెచ్చిన ఐపీఎస్
అరుణా బహుగుణతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ ⇒ వృత్తి జీవితంలో ఏనాడూ రాజీ పడలేదు ⇒ మహిళల విషయంలో ఒక ఆడబిడ్డగా పనిచేశా ⇒ వేధింపులపై కఠినంగా వ్యవహరించా ⇒ ఇప్పుడు ఉగ్రవాదం, సైబర్ క్రైమ్‌లే పెద్ద సవాళ్లు ⇒ నేడు రిటైర్ కానున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా ఐపీఎస్ సాక్షి, హైదరాబాద్: ‘‘మహిళలు తమ మార్గాన్ని తామే నిర్మించుకోవాలి. వారి కెరీర్‌కు, జీవితానికి వారే బాధ్యులు. సక్రమ మార్గంలో కఠోర సాధనతో ముందుకెళ్తే విజయాలు దాసోహం అంటాయి’’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన తొలి మహిళా ఐపీఎస్ అరుణా బహుగుణ తరచుగా చెప్పే మాటలివీ! 1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈమె అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం సర్దార్ వల్లభ్‌బాయ్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. దాదాపు 38 ఏళ్ల ఆమె ఉద్యోగ ప్రస్థానం మంగళవారంతో ముగియ నుంది. ఎంతో మంది మహిళా పోలీసులకు స్ఫూర్తిదాయ కంగా నిలుస్తున్న అరుణా బహుగుణను సోమవారం ‘సాక్షి’ పలకరించింది. ఆమె చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే.. రాజీకి చోటే లేదు.. ఏపీ క్యాడర్ నుంచి ఎంపికైన తొలి మహిళగా ప్రస్థానం మొదలెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పోలీసు శాఖలో భారీగా మార్పులొచ్చాయి. మహిళా పోలీసు అధికారుల సంఖ్య బాగా పెరిగింది. ఏ సమస్య వచ్చినా.. ఎలాంటి సందర్భాలు ఎదురైనా విధి నిర్వహణలో ఎక్కడా రాజీ పడ లేదు. ప్రజలకు సేవ చేయాలన్న సిద్ధాంతాన్నే నమ్ముకొని ముందుకెళ్లా. 38 ఏళ్ల కెరీర్లో అకుంఠిత దీక్షతో పనిచేయడం ఆనందంగా ఉంది. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకు చాలా విభాగాల్లో పనిచేశా. ప్రతి విభాగంలో కొత్త పని నేర్చుకున్నా. ఇలా అన్ని అనుభవాలతో విధులను ఎంజాయ్ చేశా. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నా. ఉగ్రవాదం, సైబర్ క్రైమ్‌లే సవాళ్లు అప్పటి నేరాలకు ఇప్పుడు జరిగే నేరాలకు చాలా తేడా ఉంది. అప్పట్లో అతిపెద్ద సమస్యగా నక్సలిజం ఉండేది. అయితే రానురాను నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రపంచంతో పాటు మన దేశానికి ఇప్పుడు టెర్రరిజం, సైబర్ క్రైమ్ సవాల్‌గా మారింది. మనిషి కంటికి కనబడకుండానే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎదుటివారి డబ్బులను కొల్లగొడుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిలను వేధిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. విమానాశ్రయాలకు భద్రత కల్పించడం ఇప్పుడు పోలీసు శాఖకు సవాల్‌గా మారింది. రాష్ట్ర స్థాయిలో వివక్ష కనిపించింది ఐపీఎస్ స్థాయిలో ప్రమోషన్ల విషయంలో మహిళల పట్ల ఎలాంటి వివక్ష లేదు. అయితే నేను విధులు నిర్వహిస్తున్న సమయంలో కొందరు రాష్ట్ర స్థాయి మహిళా పోలీసు అధి కారులకు పదోన్నతుల విష యంలో అన్యాయం జరిగిం ది. దీనిపై అప్పట్లో పెద్ద చర్చే జరి గింది. ఇప్పట్లో అలాంటి వివక్ష తగ్గిందనే చెప్పవచ్చు. సిటీ జాయింట్ పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్)గా పనిచేసిన సమయంలో కొందరు కిందిస్థాయి మహిళా సిబ్బందిపై పైస్థాయి అధికారులు వేధింపులకు గురిచేసేవారనే ఫిర్యాదులు వచ్చాయి. వాటిపట్ల కఠినంగా వ్యవహరించా. ఒక ఆడబిడ్డగా పనిచేశా.. వరకట్న వేధింపులకు గురయ్యే మహిళలకు అండగా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించడం ఆనందంగా ఉంది. ఐపీసీ 498(ఏ) వరకట్న చట్టం ఉపయోగించుకోవాల్సిన తీరుపై మహిళల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. దీంతో వరకట్న వేధింపులకు గురయ్యే మహిళలు ఠాణాలను ఆశ్రయించడం మొదలెట్టారు. ఓ ఆడబిడ్డగా ఆడవారి సమస్యలకు పరిష్కారం చూపే దిశగా పనిచేయడం మరిచిపోలేను. మహిళ భద్రత కీలకం పని ప్రాంతాలు, విద్యాసంస్థలు, బస్టాప్‌లు.. ఇలా ఎక్కడైనా మహిళలు వేధింపులకు గురయ్యే అవకాశముంది. ఈ విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. మహిళల వస్త్రధారణ వల్లే అకృత్యాలు పెరుగుతున్నాయనడం తప్పు. దాంతో నేను ఏకీభవించను. దేశ పౌరులుగా మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది. తప్పు చేస్తే ‘పోచమ్మ’లా మారాలి.. పోచమ్మ, మైసమ్మ, దుర్గమ్మ దేవతలను ప్రజలు ఆరాధిస్తుంటారు. తప్పు చేస్తే ఆ దేవత శిక్షిస్తుందని నమ్ముతుంటారు. ఇలాగే మహిళా పోలీసు అధికారులు ఉండాలి. తప్పు చేస్తే మహిళా అధికారులు శిక్షిస్తారని మగవాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా భయపడాలి. అలా మహిళా పోలీసులు విధులు నిర్వహించాలి. మ్యూజిక్‌తో ఒత్తిడిని అధిగమించా.. ఐపీఎస్‌తోపాటు ఏ రంగంలోనివారికైనా ఓ హాబీ ఉండాలి. విధి నిర్వహణలో ఒత్తిడి ఎదురైనప్పుడు ఈ అలవాట్ల ద్వారా సాంత్వన చేకూర్చుకోవచ్చు. మానసిక ప్రశాంతత పొందవచ్చు. నేనైతే వెస్టర్న్ మ్యూజిక్ ద్వారా ఒత్తిడిని అధిగమించేదాన్ని. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు, చికాకు కలిగినప్పుడు దీనిద్వారా ప్రశాంతత పొందేదాన్ని. జాబ్ కష్టమే.. కానీ సంతృప్తి ఉంటుంది.. మహిళలు పోలీసు అధికారులుగా పనిచేయడం కష్టమే. అటు కుటుంబ సభ్యులకు, ఇటు విధులకు సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఏదైనా ఘటన జరిగినప్పుడు రాత్రి సమయాల్లో వెళ్లాలి. నేను వైజాగ్, విజయనగరంలో ఎస్పీగా పనిచేసిన సమయంలో ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. అయితే విధుల్లో భాగంగా ఆయా నేరాల్లో పురోగతి ఉన్నప్పుడు వచ్చే ఆనందానికి అవధులు ఉండవు. మన ఇంట్లోని పిల్లలు బాగా అర్ధం చేసుకున్నప్పుడు విధులకు న్యాయం చేయగలం. ఇక ఇంగ్లిష్ టీచర్‌గా... రిటైర్మెంట్ తర్వాత కాస్త విరామం ఇవ్వదలుచుకున్నా. ఒక్కసారిగా ఇన్నాళ్లు అమితంగా ప్రేమించి ఆనందంగా చేసిన బాధ్యతలను వదులుకోవాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంది. అయినా తప్పదు. దీన్నుంచి మనస్సును మళ్లించడంతో పాటు సమాజానికి సేవ చేయడానికి జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో ఇళ్లలో పనిచేసే మహిళలకు ఇంగ్లిష్ పాఠాలు చెప్పాలనుకుంటున్నా. నా ఇద్దరు కుమారుల సాయంతో ఇంట్లోనే డొమెస్టిక్ వర్కర్లకు ఇంగ్లిష్ బేసిక్స్ నేర్పిస్తా. సీఆర్పీఎఫ్, అకాడమీని మరిచిపోలేను నేషనల్ పోలీసు అకాడమీలో చేరే ముందు సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్)లో స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా తొలి మహిళా అధికారిగా విధులు నిర్వర్తించే అవకాశం దక్కింది. ఆ సమయంలో మహిళలపై నేరాలకు సంబంధించి ఒక్క ఫిర్యాదు రాలేదు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో మహిళలపై అకృత్యాలకు సంబంధించి బాగా ఫిర్యాదులు ఉండేవి. మహిళలతో సీఆర్పీఎఫ్ సిబ్బంది దురుసుగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే నేను బాధ్యతలు స్వీకరించాక ఈ విషయంలో కఠినంగా వ్యవహరించా. అందుకు ఫలితం కనిపించింది. నేషనల్ పోలీసు అకాడమీ(ఎన్పీఏ)లోనూ మహిళా అధికారులను వేధించిన వారిపై చర్యలు తీసుకున్నా. నేను డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో దాదాపు నాలుగు ఐపీఎస్ బ్యాచ్‌లు శిక్షణ తీసుకున్నాయి. కొత్త పుంతలు తొక్కుతున్న నేరాలకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి, అమెరికాతో కలిసి కోర్సులు రూపొందించాం. అందుకు అనుగు ణంగా ప్రాక్టికల్‌గా ట్రైనింగ్ ఇచ్చాం. సీఆర్పీఎఫ్, ఎన్‌పీఏను మర్చిపోలేను. -
చట్టంతో నేరాలకు చెక్‌పెట్టండి
♦ మహిళా పోలీసులకు ఎస్వీపీఎన్పీఏ డెరైక్టర్ అరుణ బహుగుణ పిలుపు ♦ ‘చట్టం అమలులో మహిళల పాత్ర’ సదస్సులో ఉపన్యాసం సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాదంతో పాటు వివిధ నేరాలను చట్టం అనే ఆయుధంతో అణచివేసేందుకు మహిళా పోలీసులు ముందడుగు వేయాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీ(ఎస్వీపీఎన్పీఏ) డెరైక్టర్ అరుణ బహుగుణ పిలుపునిచ్చారు. స్థానిక నేషనల్ పోలీసు అకాడమీలో దేశంలో తొలిసారిగా ఎస్వీపీఎన్పీఏ, ఆస్ట్రేలియాకు చెందిన చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ సంయుక్తంగా ‘చట్టం అమలులో మహిళల పాత్ర’ అనే అంతర్జాతీయ సదస్సును మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన ఈ సదస్సులో బహుగుణ మాట్లాడుతూ తొలితరం మహిళామణుల జీవితాలు స్ఫూర్తిగా తీసుకొని విధి నిర్వహణలో అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ‘సాంకేతిక అభివృద్ధితో ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. నేరం, ఉగ్రవాదం ఖండ ఖండాతరాల్లో వేగంగా వ్యాపిస్తున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న నేరం-ఉగ్రవాద రూపంలో ఉన్నా, సాంకేతిక రూపంలో ఉన్నా చట్టం అనే ఆయుధంతో అణచివేసేందుకు మహిళ పోలీసులు ముందడుగు వేయాల’ని ఆమె అన్నారు. సీఎస్‌యూ ప్రొఫెసర్ ట్రెసీ గ్రీన్ మాట్లాడుతూ వ్యవస్థీకృత నేరాలు, సరిహద్దు భద్రత, ఉగ్రవాదం, తీవ్రవాదం వైపు మళ్లించడం లాంటి అంశాలను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ, ప్రాంతీయ నుంచి దేశీయస్థాయి దాకా పోలీసింగ్ నెట్‌వర్క్‌ను అనుసంధానం చేసుకోవడానికి ఈ సదస్సు ఓ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందని అన్నారు. ఇదో మైలురాయి... ‘భారత్, ఆస్ట్రేలియా మధ్య విధానపరమైన అంశాల్లో ఇప్పటికే సఖ్యత ఉంది. పన్ను ఎగవేత, తీవ్రవాదం ఎదుర్కొనడం లాంటి అంశాలపై కలసి పనిచేస్తున్నాం. అయితే ఉమెన్ పోలీసింగ్, లింగ సమానత్వం వంటి సమస్యలపై కలిసి పనిచేసేందుకు ఈ సదస్సు మైలురాయిగా నిలవడం ఆనందంగా ఉంద’ని ఆస్ట్రేలియా హైకమిషన్ డిప్యూటీ ైెహ కమిషనర్ క్రిస్ ఎల్స్టొఫ్ట్ అన్నారు. అనంతరం క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన సస్కియా హుఫ్నగేల్.. ఓల్డ్ బాయ్స్ నెట్‌వర్క్‌పై ప్రజంటేషన్ ఇచ్చింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఈస్టోనియా, బెల్జియమ్ వంటి దేశాల్లో మినహా మిగతా అన్ని దేశాల్లో పోలీసు ఫోర్స్‌లో మహిళల పట్ల వివక్ష ఉంది. పోలీసు ఫోర్స్‌ల్లో మహిళల సంఖ్య పెంచితే సరిపోదు. ఉన్నత స్థానాలకు చేరే విధంగా వారిలో నమ్మకం కల్పించాలి. ఇంటర్‌పోల్‌లో 44 శాతం, ఇంటర్నేషనల్ పోలీసు ఆఫీసులో 44 శాతం మంది మహిళలు ఉన్నారు. అయితే వీరంతా తక్కువ స్థాయిల్లోనే పనిచేస్తున్నా’రని గణాంకాలతో సహా వివరించారు. ఆస్ట్రేలియాలోని వోలంలాంగ్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కతినా మిషెల్ ‘నేషనల్ సెక్యూరిటీ టెక్నాలజీ’ వల్ల కలిగే నష్టాలను ప్రజంటేషన్ రూపంలో ఇచ్చారు. ఈ సదస్సులో 120 మంది మహిళా పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
నేషనల్ పోలీస్ అకాడమీకి తొలి మహిళా బాస్!
న్యూఢిల్లీ: నేషనల్ పోలీస్ అకాడమీ తొలి మహిళా డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి అరుణ బహుగుణ(56) ఎంపికైయ్యారు. హైదరాబాద్ లో పోలీస్ అధికారులకు శిక్షణ ఇచ్చే ఈ అకాడమీ లో మహిళా డైరెక్టర్ ను నియమించడం ఇదే తొలిసారి. 65 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కల్గిన అకాడమీకి బాస్ గా బహుగుణ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.1979 బ్యాచ్ కు చెందిన ఆమె ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలకు డీజీగా పని చేస్తున్నారు. 3 లక్షల సీఆర్పీఎప్ జవాన్లకు సేవలు అందిస్తున్నఆమె నేషనల్ పోలీస్ అకాడమీ బాస్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఆమె త్వరలోనే నియామక పత్రాలు అందుకోనుంది. ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది.. ప్రస్తుతం నేషనల్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్న సుభాష్ గోస్వామి ఇండో-టిబెటన్ డీజీగా స్థానం చలనం కలగడంతో ఆ స్థానంలో బహుగుణే నియమించారు.