చట్టంతో నేరాలకు చెక్‌పెట్టండి
♦ మహిళా పోలీసులకు ఎస్‌వీపీఎన్‌పీఏ డెరైక్టర్ అరుణ బహుగుణ పిలుపు
♦ ‘చట్టం అమలులో మహిళల పాత్ర’ సదస్సులో ఉపన్యాసం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాదంతో పాటు వివిధ నేరాలను చట్టం అనే ఆయుధంతో అణచివేసేందుకు మహిళా పోలీసులు ముందడుగు వేయాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీ(ఎస్‌వీపీఎన్‌పీఏ) డెరైక్టర్ అరుణ బహుగుణ పిలుపునిచ్చారు. స్థానిక నేషనల్ పోలీసు అకాడమీలో దేశంలో తొలిసారిగా ఎస్‌వీపీఎన్‌పీఏ, ఆస్ట్రేలియాకు చెందిన చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ సంయుక్తంగా ‘చట్టం అమలులో మహిళల పాత్ర’ అనే అంతర్జాతీయ సదస్సును మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన ఈ సదస్సులో బహుగుణ మాట్లాడుతూ తొలితరం మహిళామణుల జీవితాలు స్ఫూర్తిగా తీసుకొని విధి నిర్వహణలో అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
‘సాంకేతిక అభివృద్ధితో ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. నేరం, ఉగ్రవాదం ఖండ ఖండాతరాల్లో వేగంగా వ్యాపిస్తున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న నేరం-ఉగ్రవాద రూపంలో ఉన్నా, సాంకేతిక రూపంలో ఉన్నా చట్టం అనే ఆయుధంతో అణచివేసేందుకు మహిళ పోలీసులు ముందడుగు వేయాల’ని ఆమె అన్నారు. సీఎస్‌యూ ప్రొఫెసర్ ట్రెసీ గ్రీన్ మాట్లాడుతూ వ్యవస్థీకృత నేరాలు, సరిహద్దు భద్రత, ఉగ్రవాదం, తీవ్రవాదం వైపు మళ్లించడం లాంటి అంశాలను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ, ప్రాంతీయ నుంచి దేశీయస్థాయి దాకా పోలీసింగ్ నెట్‌వర్క్‌ను అనుసంధానం చేసుకోవడానికి ఈ సదస్సు ఓ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందని అన్నారు.
ఇదో మైలురాయి...
‘భారత్, ఆస్ట్రేలియా మధ్య విధానపరమైన అంశాల్లో ఇప్పటికే సఖ్యత ఉంది. పన్ను ఎగవేత, తీవ్రవాదం ఎదుర్కొనడం లాంటి అంశాలపై కలసి పనిచేస్తున్నాం. అయితే ఉమెన్ పోలీసింగ్, లింగ సమానత్వం వంటి సమస్యలపై కలిసి పనిచేసేందుకు ఈ సదస్సు మైలురాయిగా నిలవడం ఆనందంగా ఉంద’ని ఆస్ట్రేలియా హైకమిషన్ డిప్యూటీ ైెహ కమిషనర్ క్రిస్ ఎల్స్‌టొఫ్ట్ అన్నారు. అనంతరం క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన సస్కియా హుఫ్‌నగేల్.. ఓల్డ్ బాయ్స్ నెట్‌వర్క్‌పై ప్రజంటేషన్ ఇచ్చింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఈస్టోనియా, బెల్జియమ్ వంటి దేశాల్లో మినహా మిగతా అన్ని దేశాల్లో పోలీసు ఫోర్స్‌లో మహిళల పట్ల వివక్ష ఉంది.
పోలీసు ఫోర్స్‌ల్లో మహిళల సంఖ్య పెంచితే సరిపోదు. ఉన్నత స్థానాలకు చేరే విధంగా వారిలో నమ్మకం కల్పించాలి. ఇంటర్‌పోల్‌లో 44 శాతం, ఇంటర్నేషనల్ పోలీసు ఆఫీసులో 44 శాతం మంది మహిళలు ఉన్నారు. అయితే వీరంతా తక్కువ స్థాయిల్లోనే పనిచేస్తున్నా’రని గణాంకాలతో సహా వివరించారు. ఆస్ట్రేలియాలోని వోలంలాంగ్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కతినా మిషెల్ ‘నేషనల్ సెక్యూరిటీ టెక్నాలజీ’ వల్ల కలిగే నష్టాలను ప్రజంటేషన్ రూపంలో ఇచ్చారు. ఈ సదస్సులో 120 మంది మహిళా పోలీసు అధికారులు పాల్గొన్నారు.