జనం మెచ్చిన ఐపీఎస్‌ | The First woman IPS Aruna Bahuguna interview with sakhi | Sakshi
Sakshi News home page

జనం మెచ్చిన ఐపీఎస్‌

Published Tue, Feb 28 2017 2:46 AM | Last Updated on Fri, Oct 5 2018 8:54 PM

జనం మెచ్చిన ఐపీఎస్‌ - Sakshi

జనం మెచ్చిన ఐపీఎస్‌

అరుణా బహుగుణతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ
వృత్తి జీవితంలో ఏనాడూ రాజీ పడలేదు
మహిళల విషయంలో ఒక ఆడబిడ్డగా పనిచేశా
వేధింపులపై కఠినంగా వ్యవహరించా
ఇప్పుడు ఉగ్రవాదం, సైబర్‌ క్రైమ్‌లే పెద్ద సవాళ్లు
నేడు రిటైర్‌ కానున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తొలి మహిళా ఐపీఎస్‌


సాక్షి, హైదరాబాద్‌: ‘‘మహిళలు తమ మార్గాన్ని తామే నిర్మించుకోవాలి. వారి కెరీర్‌కు, జీవితానికి వారే బాధ్యులు. సక్రమ మార్గంలో కఠోర సాధనతో ముందుకెళ్తే విజయాలు దాసోహం అంటాయి’’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన తొలి మహిళా ఐపీఎస్‌ అరుణా బహుగుణ తరచుగా చెప్పే మాటలివీ! 1979 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఈమె అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. దాదాపు 38 ఏళ్ల ఆమె ఉద్యోగ ప్రస్థానం మంగళవారంతో ముగియ నుంది. ఎంతో మంది మహిళా పోలీసులకు స్ఫూర్తిదాయ కంగా నిలుస్తున్న అరుణా బహుగుణను సోమవారం ‘సాక్షి’ పలకరించింది. ఆమె చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

రాజీకి చోటే లేదు..
ఏపీ క్యాడర్‌ నుంచి ఎంపికైన తొలి మహిళగా ప్రస్థానం మొదలెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పోలీసు శాఖలో భారీగా మార్పులొచ్చాయి. మహిళా పోలీసు అధికారుల సంఖ్య బాగా పెరిగింది. ఏ సమస్య వచ్చినా.. ఎలాంటి సందర్భాలు ఎదురైనా విధి నిర్వహణలో ఎక్కడా రాజీ పడ లేదు. ప్రజలకు సేవ చేయాలన్న సిద్ధాంతాన్నే నమ్ముకొని ముందుకెళ్లా. 38 ఏళ్ల కెరీర్‌లో అకుంఠిత దీక్షతో పనిచేయడం ఆనందంగా ఉంది. కెరీర్‌ ఆరంభం నుంచి ఇప్పటివరకు చాలా విభాగాల్లో పనిచేశా. ప్రతి విభాగంలో కొత్త పని నేర్చుకున్నా. ఇలా అన్ని అనుభవాలతో విధులను ఎంజాయ్‌ చేశా. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నా.

ఉగ్రవాదం, సైబర్‌ క్రైమ్‌లే సవాళ్లు
అప్పటి నేరాలకు ఇప్పుడు జరిగే నేరాలకు చాలా తేడా ఉంది. అప్పట్లో అతిపెద్ద సమస్యగా నక్సలిజం ఉండేది. అయితే రానురాను నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రపంచంతో పాటు మన దేశానికి ఇప్పుడు టెర్రరిజం, సైబర్‌ క్రైమ్‌ సవాల్‌గా మారింది. మనిషి కంటికి కనబడకుండానే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎదుటివారి డబ్బులను కొల్లగొడుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిలను వేధిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. విమానాశ్రయాలకు భద్రత కల్పించడం ఇప్పుడు పోలీసు శాఖకు సవాల్‌గా మారింది.

రాష్ట్ర స్థాయిలో వివక్ష కనిపించింది
ఐపీఎస్‌ స్థాయిలో ప్రమోషన్ల విషయంలో మహిళల పట్ల ఎలాంటి వివక్ష లేదు. అయితే నేను విధులు నిర్వహిస్తున్న సమయంలో కొందరు రాష్ట్ర స్థాయి మహిళా పోలీసు అధి కారులకు పదోన్నతుల విష యంలో అన్యాయం జరిగిం ది. దీనిపై అప్పట్లో పెద్ద చర్చే జరి గింది. ఇప్పట్లో అలాంటి వివక్ష తగ్గిందనే చెప్పవచ్చు. సిటీ జాయింట్‌ పోలీసు కమిషనర్‌ (లా అండ్‌ ఆర్డర్‌)గా పనిచేసిన సమయంలో కొందరు కిందిస్థాయి మహిళా సిబ్బందిపై పైస్థాయి అధికారులు వేధింపులకు గురిచేసేవారనే ఫిర్యాదులు వచ్చాయి. వాటిపట్ల కఠినంగా వ్యవహరించా.

ఒక ఆడబిడ్డగా పనిచేశా..
వరకట్న వేధింపులకు గురయ్యే మహిళలకు అండగా ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించడం ఆనందంగా ఉంది. ఐపీసీ 498(ఏ) వరకట్న చట్టం ఉపయోగించుకోవాల్సిన తీరుపై మహిళల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. దీంతో వరకట్న వేధింపులకు గురయ్యే మహిళలు ఠాణాలను ఆశ్రయించడం మొదలెట్టారు. ఓ ఆడబిడ్డగా ఆడవారి సమస్యలకు పరిష్కారం చూపే దిశగా పనిచేయడం మరిచిపోలేను.

మహిళ భద్రత కీలకం
పని ప్రాంతాలు, విద్యాసంస్థలు, బస్టాప్‌లు.. ఇలా ఎక్కడైనా మహిళలు వేధింపులకు గురయ్యే అవకాశముంది. ఈ  విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. మహిళల వస్త్రధారణ వల్లే అకృత్యాలు పెరుగుతున్నాయనడం తప్పు. దాంతో నేను ఏకీభవించను. దేశ పౌరులుగా మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది.

తప్పు చేస్తే ‘పోచమ్మ’లా మారాలి..
పోచమ్మ, మైసమ్మ, దుర్గమ్మ దేవతలను ప్రజలు ఆరాధిస్తుంటారు. తప్పు చేస్తే ఆ దేవత శిక్షిస్తుందని నమ్ముతుంటారు. ఇలాగే మహిళా పోలీసు అధికారులు ఉండాలి. తప్పు చేస్తే మహిళా అధికారులు శిక్షిస్తారని మగవాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా భయపడాలి. అలా మహిళా పోలీసులు విధులు నిర్వహించాలి.

మ్యూజిక్‌తో ఒత్తిడిని అధిగమించా..
ఐపీఎస్‌తోపాటు ఏ రంగంలోనివారికైనా ఓ హాబీ ఉండాలి. విధి నిర్వహణలో ఒత్తిడి ఎదురైనప్పుడు ఈ అలవాట్ల ద్వారా సాంత్వన చేకూర్చుకోవచ్చు. మానసిక ప్రశాంతత పొందవచ్చు. నేనైతే వెస్టర్న్‌ మ్యూజిక్‌ ద్వారా ఒత్తిడిని అధిగమించేదాన్ని. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు, చికాకు కలిగినప్పుడు దీనిద్వారా ప్రశాంతత పొందేదాన్ని.

జాబ్‌ కష్టమే.. కానీ సంతృప్తి ఉంటుంది..
మహిళలు పోలీసు అధికారులుగా పనిచేయడం కష్టమే. అటు కుటుంబ సభ్యులకు, ఇటు విధులకు సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఏదైనా ఘటన జరిగినప్పుడు రాత్రి సమయాల్లో వెళ్లాలి. నేను వైజాగ్, విజయనగరంలో ఎస్పీగా పనిచేసిన సమయంలో ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. అయితే విధుల్లో భాగంగా ఆయా నేరాల్లో పురోగతి ఉన్నప్పుడు వచ్చే ఆనందానికి అవధులు ఉండవు. మన ఇంట్లోని పిల్లలు బాగా అర్ధం చేసుకున్నప్పుడు విధులకు న్యాయం చేయగలం.

ఇక ఇంగ్లిష్‌ టీచర్‌గా...
రిటైర్మెంట్‌ తర్వాత కాస్త విరామం ఇవ్వదలుచుకున్నా. ఒక్కసారిగా ఇన్నాళ్లు అమితంగా ప్రేమించి ఆనందంగా చేసిన బాధ్యతలను వదులుకోవాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంది. అయినా తప్పదు. దీన్నుంచి మనస్సును మళ్లించడంతో పాటు సమాజానికి సేవ చేయడానికి జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో ఇళ్లలో పనిచేసే మహిళలకు ఇంగ్లిష్‌ పాఠాలు చెప్పాలనుకుంటున్నా. నా ఇద్దరు కుమారుల సాయంతో ఇంట్లోనే డొమెస్టిక్‌ వర్కర్‌లకు ఇంగ్లిష్‌ బేసిక్స్‌ నేర్పిస్తా.

సీఆర్‌పీఎఫ్, అకాడమీని మరిచిపోలేను
నేషనల్‌ పోలీసు అకాడమీలో చేరే ముందు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌)లో స్పెషల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా తొలి మహిళా అధికారిగా విధులు నిర్వర్తించే అవకాశం దక్కింది. ఆ సమయంలో మహిళలపై నేరాలకు సంబంధించి ఒక్క ఫిర్యాదు రాలేదు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో మహిళలపై అకృత్యాలకు సంబంధించి బాగా ఫిర్యాదులు ఉండేవి. మహిళలతో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది దురుసుగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి.

అయితే నేను బాధ్యతలు స్వీకరించాక ఈ విషయంలో కఠినంగా వ్యవహరించా. అందుకు ఫలితం కనిపించింది. నేషనల్‌ పోలీసు అకాడమీ(ఎన్‌పీఏ)లోనూ మహిళా అధికారులను వేధించిన వారిపై చర్యలు తీసుకున్నా. నేను డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో దాదాపు నాలుగు ఐపీఎస్‌ బ్యాచ్‌లు శిక్షణ తీసుకున్నాయి. కొత్త పుంతలు తొక్కుతున్న నేరాలకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి, అమెరికాతో కలిసి కోర్సులు రూపొందించాం. అందుకు అనుగు ణంగా ప్రాక్టికల్‌గా ట్రైనింగ్‌ ఇచ్చాం. సీఆర్‌పీఎఫ్, ఎన్‌పీఏను మర్చిపోలేను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement