మహిళలే మహారాణులు
జగ్గయ్యపేట, న్యూస్‌లైన్ : త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలే చక్రం తిప్పనున్నారు. ప్రస్తు రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. భవిష్యత్తులో జరుగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మహిళలే అత్యధికంగా పోటీ చేసే పరిస్థితి నెలకొంది. అధిక శాతం స్థానాలను మహిళలకే రిజర్వు చేయడంతో వారినే పోటీలోకి దింపాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు రిజర్వేషన్ల పక్రియ కల్పించడంతో స్థానిక సంస్థల పాలనలో భాగస్వాములు కానున్నారు. పేట నియోజకవర్గంలోని జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలకు చెందిన ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మహిళలకే రిజర్వుడ్ చేశారు. నాలుగు ఎంపీపీ స్థానాల్లో మూడు స్థానాలను మహిళలకే కేటాయించారు.
నియోజకవర్గంలో 54 ఎంపీటీసీ సెగ్మెంట్లు
నియోజకవర్గంలో జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో మొత్తం 54ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 28 స్థానాలను మహిళలకే కేటాయించడంతో మహిళలు మహారాణులుగా పాలన సాగించనున్నారు. వీటికితోడు ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు కూడా మహిళలకు రిజర్వు చేశారు. దీంతో మండలస్థాయి ముఖ్య పదవులన్నీ మహిళలనే వరించనున్నాయి. 2006లో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులకు సంబంధించి మొత్తం నియోజకవర్గంలోని పేట మండలానికి చెందిన చల్లా దుర్గా అనే మహిళ మాత్రమే జెడ్పీటీసీగా కొనసాగారు. ఈసారి జరిగే ఎన్నికల్లో ఎంపీపీ, జెడ్పీటీసీలు మహిళలకే రిజర్వు కావడంతో ఆరుగురు మహిళలు మండలస్థాయిలో ఉన్నత పదవులను అలంకరించనున్నారు.
రసవత్తరంగా పోటీ...
నియోజకవర్గంలో ఆయా మండలాల్లో కీలకమైన జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను మహిళలకు రిజర్వు చేయడంతో ఇన్నాళ్లు మండలస్థాయిలో చక్రం తిప్పుతూ రాజకీయాల్లో ఆరితేరిన నాయకులు తల పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఎన్నో ఏళ్లుగా ఆయా పదవులు తమకు దక్కకపోతాయా అనిఎదురుచూసిన నాయకులు చేసేదేమీలేక తమ సతీమణులను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. ఆరు నూరైనా పదవులు దక్కించుకోవడానికి ఎత్తులుపై ఎత్తులు చేస్తూ పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా కీలక పదవులన్నీ ఎస్సీ, బీసీలకు రిజర్వు కావడంతో తీవ్రమైన పోటీ నెలకొనే పరిస్థితి ఉంది. ఆయా మండలాల్లో స్థానిక పోరు రసవత్తరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఎన్నికలు వాయిదా... ?
ఎలక్షన్ కమిషన్ 17నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నామినేషన్లు స్వీకరించాలని ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. అయితే ఎన్నికలపై రెండురోజుల్లో పలు సూచనలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈసీకి సూచించడంతో ఈ ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.